దేశ సమైక్యతకు రాజ్యాంగం పునాదులు

ABN , First Publish Date - 2021-11-27T17:55:25+05:30 IST

దేశం సమైక్యతాబాటలో ముందుకు సాగేందుకు రాజ్యాంగం బలమైన పునాదులు వేసిందని ముఖ్యమంత్రి బసవరాజ్‌బొమ్మై పేర్కొన్నారు. దావణగెరెలో శుక్రవారం రాజ్యాంగ దినోత్సవాన్ని ఆయన లాంఛనంగా

దేశ సమైక్యతకు రాజ్యాంగం పునాదులు

- మానవతా విలువలు చాటిచెప్పిన అంబేడ్కర్‌ 

- రాజ్యాంగ దినోత్సవ సభలో CM బొమ్మై


దావణగెరె(బెంగళూరు): దేశం సమైక్యతాబాటలో ముందుకు సాగేందుకు రాజ్యాంగం బలమైన పునాదులు వేసిందని ముఖ్యమంత్రి బసవరాజ్‌బొమ్మై పేర్కొన్నారు. దావణగెరెలో శుక్రవారం రాజ్యాంగ దినోత్సవాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ పవిత్రమైన రాజ్యాంగాన్ని అంగీకరించిన ఈరోజు దేశ చరిత్రలో అత్యంత మహత్తరమైనదన్నారు. ప్రపంచంలోనే అత్యంత శ్రేష్ఠమైన రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ధన్యులన్నారు. వాక్‌ స్వాతంత్య్రంతోపాటు సామాజిక, ఆర్థిక, ధార్మిక స్వేచ్ఛను భారత రాజ్యాంగం కల్పించడంతో ప్రజలమధ్య పరస్పరం అప్యాయత, విశ్వాసం, సామరస్యం నెలకొన్నాయన్నారు. మానవతా విలువలకు ఉన్న గొప్పదనాన్ని అంబేడ్కర్‌ రాజ్యాంగం ద్వారా చాటిచెప్పారన్నారు. ఎన్నో గొప్ప గుణాలు ఉన్న కారణంగానే దశాబ్దాలు దాటినా భారతరాజ్యాంగంపై ప్రజలలో గౌరవం చెక్కు చెదరలేదన్నారు. దేశ ఐక్యతలో రాజ్యాంగం పోషించిన పాత్ర అత్యంత కీలకమైనదన్నారు. పౌరహక్కులు ఎంత ముఖ్యమో అసమానత నివారణ కూడా అంత ముఖ్యమని అంబేడ్కర్‌ రాజ్యాంగం ద్వారా చాటి చెప్పారన్నారు. ప్రజలు తమ బాధ్యతలను విస్మరిస్తే దేశంలో అరాచకత్వం ఏర్పడుతుందని ఆయన హెచ్చరించారు. అంబేడ్కర్‌ను ఆధునిక భారత పితామహగా అభివర్ణించారు. 75 ఏళ్లలో గ్లోబలైజేషన్‌, లిబరలైజేషన్‌, ప్రైవేటైజేషన్‌ వంటివి చోటు చేసుకున్నా భారతరాజ్యాంగ విలువలకు గౌరవం పెరిగిందే తప్ప ఏమాత్రం తగ్గలేదన్నారు. మోదీ ప్రధాని అయ్యాక అంబేడ్కర్‌కు సముచిత గౌరవం లభిస్తోందన్నారు. ఒకప్పుడు దీనదళితులు ఓటుబ్యాంకుగా ఉండేవారని, ఇప్పుడు పరిస్థితి సమూలాగ్రం మారిందన్నారు. అంతకుముందు ఆయ న రాజ్యాంగపీఠికను చదివారు. ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. మంత్రి బైరతి బసవరాజ్‌, ఎంపీ జీఎం సిద్దేశ్వర్‌, ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి రేణుకాచార్య, జిల్లా అధికారి మహంతేశ్‌ బీళగి తదితరులు పాల్గొన్నారు. ఇదే వేదికపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఎస్‌ఏ రవీంద్రనాథ్‌ అమృతమహోత్సవాన్ని కూ డా కనులపండువగా నిర్వహించారు. రవీంద్రనాథ్‌ సేవలను ప్రస్తుతిస్తూ వెలువడిన పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. రవీంద్రనాథ్‌ నేటి తరానికి ఎంతో ఆదర్శప్రాయులన్నారు. కాంగ్రెస్‌ హయాంలోని టెండర్లపైనా దర్యాప్తు తమ ప్రభుత్వంపై గవర్నర్‌కు కాంగ్రెస్‌ నేతలు చేసిన ఫిర్యాదులో ఏమాత్రం పసలేదని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై వ్యాఖ్యానించారు. దావణగెరెలో శుక్రవారం రాజ్యాంగ దినోత్సవంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ హయాంలో జరిగిన టెండరు అక్రమాలపై కూడా దర్యాప్తు జరిపించి నిజానిజాలను ప్రజలముందు ఉంచుతామన్నారు. కాంట్రాక్టర్లలో కొందరు చేస్తున్న విమర్శల్లో వాస్తవాలను పరిశీలించకుండా తమది పర్సంటేజ్‌ ప్రభుత్వం అంటూ చేస్తున్న విమర్శలు అర్థరహితమన్నారు. అవినీతికి మారుపేరైన కాంగ్రెస్‌ నేతల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన కర్మ తమకు పట్టలేదన్నారు. అవినీతి నిరోధక దళం (ఏసీబీ)కి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో సమాజానికి చీడపురుగుల్లా మారిన అవినీతి అధికారులు, ఉద్యోగులను ఏరిపారేస్తున్నారని సీఎం పేర్కొన్నారు. ఏసీబీ, లోకాయుక్త సంస్థలలో ప్రభుత్వ జోక్యాన్ని పూర్తిగా నివారించి అధికారులకు స్వేచ్ఛ ఇచ్చామని సీఎం వెల్లడించారు. 

Updated Date - 2021-11-27T17:55:25+05:30 IST