పాఠ్యపుస్తకాల్లో లోపాలను సరిదిద్దేందుకు సిద్ధం: Cm

ABN , First Publish Date - 2022-06-17T17:07:54+05:30 IST

పాఠ్యపుస్తకాల్లో తలెత్తిన లోపాలను సరిదిద్దేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని ఇందుకు సంబంధించి అందిన సలహాలు, సూచనలను పరిశీలిస్తున్నామని

పాఠ్యపుస్తకాల్లో లోపాలను సరిదిద్దేందుకు సిద్ధం: Cm

బెంగళూరు, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): పాఠ్యపుస్తకాల్లో తలెత్తిన లోపాలను సరిదిద్దేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని ఇందుకు సంబంధించి అందిన సలహాలు, సూచనలను పరిశీలిస్తున్నామని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ప్రకటించారు. దావణగెరెలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. పాఠ్యపుస్తకాల్లో లోపాలకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలలోనూ అభ్యంతరాలు వచ్చాయని సీఎం గుర్తుచేశారు. విద్యాశాఖ వెబ్‌సైట్‌లోనూ పాఠ్యాంశాల మార్పుకు సంబంధించి సలహాలు సూచనలు వస్తున్నాయన్నారు. పాఠ్యాంశాలలో తప్పులకు సంబంధించి తాను కూడా ప్రాథమిక విద్యాశాఖా మంత్రి బీసీ నగేష్ కు కొన్ని సూచనలు చేశానన్నారు. విద్యార్ధుల భవిష్యత్తు దృష్ట్యా పాఠ్యాంశాలకు సంబంధించి గందరగోళం కొనసాగడం మంచిది కాదన్నారు. పాఠ్యాంశాలపై కొందరు మేధావులు, సాహితీవేత్తలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేయడాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వం అందరి మనోభావాలను గౌరవిస్తుందని ఇదే సమయంలో వాస్తవాలను విద్యార్ధులకు పాఠాలరూపంలో అందించేందుకు ప్రయత్నిస్తుందని సీఎం అన్నారు. 


నాలుగు స్థానాలూ గెలిచి ఉంటే బాగుండేది...

ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో మొత్తం నాలుగు స్థానాలను గెలుస్తామని భావించామని, అయినా ప్రజాతీర్పును గౌరవిస్తున్నామన్నారు. విధానపరిషత్‌కు వరుసగా 8వ సారి ఎన్నికైన బసవరాజ హొరట్టిని సీఎం ప్రత్యేకంగా అభినందించారు. ఆయన సేవలను తగిన రీతిలో వినియోగించుకుంటామని భరోసా ఇచ్చారు. విధానపరిషత్‌లో తొలిసారి బీజేపీకి పూర్తి మెజార్టీ లభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇకపై బిల్లుల ఆమోదం విషయం లో ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు ఉండవన్నారు.


అవినీతి విచారణపై పోరాటమా?.. హవ్వ సిగ్గుచేటు

కాంగ్రెస్‌ నేతల అవినీతిపై ఈడీ దర్యాప్తుచేస్తోందని అయితే దర్యాప్తును అడ్డుకునేలా కాంగ్రెస్‌ వ్యవహరిస్తుండటం సిగ్గుచేటని సీఎం వ్యాఖ్యానించారు. రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ చేస్తున్న పోరాటాలకు అర్ధంపర్ధం లేదన్నారు. ప్రజలు కూడా ఈ పోరాటాల అసలు ఉద్దేశ్యాన్ని అర్ధంచేసుకుంటున్నారన్నారు.


మేకెదాటు డీపీఆర్‌కు అనుమతి ఖాయం

మేకెదాటు పధకంపై తన వాదనను రాష్ట్రం బలంగా ప్రతిపాదించిందని ఈ నేపథ్యంలో డీపీఆర్‌కు అనుమతి లభించడం ఖాయమని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తంచేశారు. తమిళనాడు ఈ విషయంలో చేస్తున్న వాదనకు అర్ధం లేదన్నారు.

Updated Date - 2022-06-17T17:07:54+05:30 IST