మాది చేతల ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-04-12T16:58:31+05:30 IST

మాటలకంటే తమకు చేతలు ముఖ్యమని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై పేర్కొన్నారు. రాష్ట్రంలో కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలపై తాను మౌనంగా ఉన్నట్టు,

మాది చేతల ప్రభుత్వం

- శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు 

- ఇకపై ప్రభుత్వ ఆధ్వర్యంలోనే సమానతా దినోత్సవం : సీఎం


బెంగళూరు: మాటలకంటే తమకు చేతలు ముఖ్యమని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై పేర్కొన్నారు. రాష్ట్రంలో కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలపై తాను మౌనంగా ఉన్నట్టు, సంఘ్‌ పరివార్‌ చేతిలో కీలుబొమ్మగా మారినట్టు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ఉడుపి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సోమవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో సామరస్యాన్ని కాపాడేందుకు, శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎవరెవరి ఆచారాలు, సంప్రదాయాలు వారి ద గ్గరే ఉండాలని, సమాజంలో వీటిని బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నించినా, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నా సహించేది లేదన్నారు. కోస్తాలో లవ్‌జిహాద్‌ను అడ్డుకునేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్టు మీడియా ప్రస్తావించగా సీఎం పై విధంగా బదులిచ్చారు. ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులకు తగిన సూచనలు చేశామన్నారు. హిజాబ్‌తో ప్రా రంభమైన వివాదాలు చుట్టుముట్టి కొన్నిచోట్ల ఉద్రిక్తతలకు కారణమైన మాట నిజమేనని అంగీకరించారు. తక్షణం రంగంలోకి దిగి వీటిని అణచివేశామన్నారు. 


ప్రభుత్వ ఆధ్వర్యంలోనే సమానతా దినోత్సవం 

చిత్రదుర్గ మురుఘ మఠాధిపతి శివమూర్తి స్వామిజీ పుట్టినరోజు వేడుకలను ఇకపై ప్రభుత్వం ఆధ్వర్యంలోనే సమానతా దినోత్సవంగా జరపనున్నారు. ఈ విషయాన్ని ప్యాలెస్‌ మైదానంలో జరిగిన పరివర్తనాపర ధర్మసంసత్‌ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి 12వ శతాబ్దంలో బసవణ్ణ అసమానతల నివారణకు దిట్టమైన పోరాటం చేశారని ఇదే పద్ధతి ఇకముందు కూడా కొనసాగాలన్నారు. సమాజంలో సమానత శాంతి, అహింస అన్నిమతాల బోధనా సారాంశమేనని ఆచరణలో మాత్రమే తేడాలు ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. ఇదే సందర్భంగా స్వామిజీని ఘనంగా సన్మానించారు. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌తోపాటు పలువురు పాల్గొన్నారు. 


నేత, మత్స్యకార్మికుల పిల్లలకు విద్యానిధి విస్తరణ: సీఎం 

ఉడుపి జిల్లా పర్యటనలో భాగంగా సీఎం బొమ్మై నేత, మత్స్యకారులపై వరాల వర్షం కురిపించారు. స్థానిక శ్రీక్షేత్రమైన ఉజ్జిల మహాలక్ష్మి ఆలయాన్ని దర్శించిన అనంతరం జరిగిన కార్యక్రమంలో సీఎం ప్రసంగించారు. ఇదే సందర్భంగా డాక్టర్‌ బణ్ణంజె గోవిందాచార్య స్మారక డిజిటల్‌ గ్రంథాలయ్యాన్ని ప్రారంభించి, విగ్రహాన్ని ఆవిష్కరించారు. పెజావర మఠాధిపతి విశ్వప్రసన్న స్వామిజీతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి ఉడుపిలోని శ్రీకృష్ణ మందిరాన్ని దర్శించి పూజల్లో పాల్గొన్నారు. మంగళూరు డివిజన్‌లో కేఎస్ ఆర్టీసీ నిర్మించిన డాక్టర్‌ వీఎస్‌ ఆచార్య బస్టాండ్‌ను కూడా సీఎం ప్రారంభించారు. మల్పెలో శ్రీరామ భజన మండలి ఏర్పాటు చేసిన బ్రహ్మ కళశోత్సవ, సువర్ణ మహోత్సవాన్ని కూడా సీఎం ప్రారంభించారు. సీఎం వెంట మంత్రులు సునీల్‌కుమార్‌, కోట శ్రీనివాసపూజారి, ఎస్‌ అంగార, ఎమ్మెల్యేలు రఘుపతిభట్‌, లాలాజి మెండన్‌ తదితరులు ఉన్నారు. 

Updated Date - 2022-04-12T16:58:31+05:30 IST