వారి అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం...

ABN , First Publish Date - 2022-04-15T18:23:30+05:30 IST

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, దేశంలో కీలక మార్పునకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పునాది వేశారని సీఎం బసవరాజ్‌ బొమ్మై

వారి అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం...

బెంగళూరు: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, దేశంలో కీలక మార్పునకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పునాది వేశారని సీఎం బసవరాజ్‌ బొమ్మై అభిప్రాయపడ్డారు. అంబేడ్కర్‌ 131వ జయంతి సందర్భంగా విధానసౌధ ప్రాంగణంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. గురువారం విధానసౌధలోని బ్యాంకెట్‌ హాల్‌లో అంబేడ్కర్‌ పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పరివర్తన అనేది విశ్వంలో ధర్మమని భారతరత్న అంబేడ్కర్‌ మంత్రం కూడా ఇదేనన్నారు. మేం పరివర్తన చేస్తామని మీరు అదే మార్గంలో ముందుకెళ్లాలని అప్పటిదాకా విశ్రమించరాదని సంకల్పం ప్రతి ఒక్కరిలోనూ రావాలన్నారు. ఓ వర్గం రాజకీయాలకోసం ఉపయోగించుకోవడం నేరమని, కొందరు తమ స్వార్థం కోసం దేశాన్ని నాశనం చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. సొంతంగా ప్రతి వ్యక్తి ఆలోచించాలని, ఎవరి మంచి చెడు అనేది తెలుసుకోవాలన్నారు. అంబేడ్కర్‌ పేరు ఉపయోగించుకుని కొందరు ఉన్నత స్థానాలు అలంకరించారని అయితే సమాజంలో సామాజికవర్గాన్ని ఇతరులను మరిచారని విచారం వ్యక్తం చేశారు. సామాజికంగా మార్పు రావాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఎస్సీ వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాల అభివృద్ధికి కట్టుబడ్డామన్నారు. రాష్ట్రంలో అంబేడ్కర్‌ సందర్శించిన పది ప్రాంతాల అభివృద్ధికి రూ.10 కోట్లతో సర్వాంగ సుందరంగా చేయదలిచామన్నారు. అంబేడ్కర్‌ పేరి ట పురస్కారాలను ఎస్‌ సిద్దార్థ, ఆర్‌ఎస్‌ సరస్వతమ్మ, డీ రామానాయక్‌, గురువప్ప, ఎన్‌టీ బాళేమణి, బీఎం గిరిరాజ్‌లకు ప్రదానం చేశారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కోట శ్రీనివాసపూజారి, ఎమ్మెల్యే రిజ్వాన్‌ అర్షద్‌, ఎమ్మెల్సీలు ప్రతాప్ సింహనాయక్‌, వైఏ నారాయణస్వామి, ఆర్‌ దేవేగౌ డ, మాజీ మంత్రి మోటమ్మతోపాటు పలువురు పాల్గొన్నారు. 


కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో...

సమసమాజ నిర్మాణం ఆకాంక్షించిన అంబేడ్కర్‌ ఆశయాలకోసం పాటుపడదామని కాంగ్రెస్‌ నేతలు పిలుపునిచ్చారు. రేస్‌కోర్సు రోడ్డు కాంగ్రెస్‌ కార్యాలయంలో అంబేడ్కర్‌ జయంతి జరిపారు. అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలు చల్లి నివాళులు అర్పించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివకుమార్‌, ప్రతిపక్షనేత సిద్దరామయ్య, పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ సుర్జేవాలా సహా ప్రము ఖలు పాల్గొన్నారు.


జేడీఎస్‌ ఆధ్వర్యంలో..

రాష్ట్ర పార్టీ కార్యాలయం జే పీ భవన్‌లో అంబేడ్కర్‌ జయంతి జరిపారు. మాజీ ప్రధాని, జేడీఎస్‌ అగ్రనేత దేవేగౌడతోపాటు పలువురు ముఖ్యనాయకులు పాల్గొన్నా రు. అంబేడ్కర్‌ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా దేవేగౌడ మాట్లాడుతూ బాబూ జగ్జీవన్‌రామ్‌ను ప్రధానిని చేయలేదన్నారు. అంబేడ్కర్‌ పేదరికం నుంచి ఎదిగినవారన్నారు. పోరాటాల ద్వారా ముందుకెళ్లారని ప్రతి మతానికి రక్షణ కల్పించేలా రాజ్యాంగాన్ని రూపొందించారని కొనియాడారు. కుంభమేళాలో ఐదు రోజులపాటు పాదపూజ చేశారని ఈ విషయం అభినందించదగినదన్నారు. ఎమ్మెల్సీ తిప్పేస్వామి, జేడీఎస్‌ కార్యాధ్యక్షుడు నబీ, ఎస్సీసెల్‌ విభాగం అధ్యక్షుడు అమరనాథ్‌, తిమ్మయ్య, ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-04-15T18:23:30+05:30 IST