రూ. 11,513 కోట్ల పెట్టుబడులకు ఆమోదం

ABN , First Publish Date - 2022-04-19T17:51:18+05:30 IST

బెంగళూరులో ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై అధ్యక్షతన సోమవారం జరిగిన రాష్ట్రస్థాయి హైలెవెల్‌ కమిటీ 58వ సమావేశంలో రూ.11,513 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన

రూ. 11,513 కోట్ల పెట్టుబడులకు ఆమోదం

- రాష్ట్ర హైలెవెల్‌ కమిటీ సమావేశంలో నిర్ణయం 

- భూములు తీసుకుని పరిశ్రమలు ఏర్పాటు చేయని కంపెనీలపై చర్యలు: సీఎం


బెంగళూరు: బెంగళూరులో ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై అధ్యక్షతన సోమవారం జరిగిన రాష్ట్రస్థాయి హైలెవెల్‌ కమిటీ 58వ సమావేశంలో రూ.11,513 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన పది ప్రముఖ ప్రాజెక్టులకు ఆమోదముద్ర లభించింది. ఈ పెట్టుబడుల రాకతో 46,984 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు. సమావేశంలో సీఎం బసవరాజ్‌ బొమ్మై ప్రసంగిస్తూ కాంట్రాక్టు, సబ్‌ కాంట్రాక్టు పరిమితిని మితిమీరి విస్తరించడం సరికాదని అధికారులకు హితబోధ చేశారు. పరిశ్రమలకు ఇచ్చే స్థలాల కేటాయింపు, రాయితీలపై కూడా సమగ్ర చర్చ జరిగింది. విద్యుత్‌, స్టీల్‌ ప్రాజెక్టులకు సంబంధించి ఇటీవలి కాలంలో నీటి వాడకం ప్రమాణం గణనీయంగా పెరుగుతోందని సీఎం పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పరిశ్రమలకు నీటి సరఫరాకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. పరిశ్రమల ఏర్పాటుకోసం 10-20 ఏళ్ల క్రితం భూములు పొందిన చాలా కంపెనీలు ఇంకా పరిశ్రమలు స్థాపించలేదని, వాటిని గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు. కర్ణాటక పారిశ్రామిక ప్రదేశాభివృద్ధి బోర్డు ఏర్పాటుకు సంబంధించి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. వచ్చే నవంబరు 2, 3 తేదీలలో జరగనున్న ప్రపంచ పెట్టుబడిదారుల సమావేశాన్ని విజయవంతం చేయాలని, ఇందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రస్తుత పారిశ్రామిక విధానం 2025కు అనుగుణంగా పారిశ్రామిక విప్లవానికి నాంది పలకాలన్నారు. సమావేశంలో భారీ పరిశ్రమలశాఖ మంత్రి మురుగేశ్‌ నిరాణి, గృహ వసతిశాఖ మంత్రి సోమణ్ణ, ఉన్నతవిద్యాశాఖ మంత్రి డాక్టర్‌ సీఎన్‌ అశ్వత్థనారాయణ, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి పీ రవికుమార్‌, ఆర్థికశాఖ అదనపు ముఖ్యకార్యదర్శి ఐఎస్ఎన్‌ ప్రసాద్‌, అభివృద్ధి కమిషనర్‌ వందితాశర్మ, ఐటీబీటీ శాఖల అదనపు ముఖ్యకార్యదర్శి డాక్టర్‌ ఈవీ రమణారెడ్డి, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి మంజునాథ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-04-19T17:51:18+05:30 IST