అంతర్రాష్ట్ర జల వివాదాలపై ఫిబ్రవరిలో అఖిలపక్ష భేటీ: Cm

ABN , First Publish Date - 2022-01-23T17:16:51+05:30 IST

అంతర్రాష్ట్ర జల వివాదాలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయాలపై ఫిబ్రవరి తొలివారంలో అఖిలపక్ష భేటీని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై తెలిపారు. మేకెదాటు ప్రాజెక్టుకు సంబంధిం

అంతర్రాష్ట్ర జల వివాదాలపై ఫిబ్రవరిలో అఖిలపక్ష భేటీ: Cm

బెంగళూరు: అంతర్రాష్ట్ర జల వివాదాలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయాలపై ఫిబ్రవరి తొలివారంలో అఖిలపక్ష భేటీని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై తెలిపారు. మేకెదాటు ప్రాజెక్టుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఫిబ్రవరి 14న విచారణకు రానుందని ఈలోగానే అఖిలపక్షభేటీని ఏర్పాటు చేస్తామన్నారు. నగరంలో శనివారం సీఎం మీడియాతో మాట్లాడుతూ కృష్ణ, కావేరి జలవివాదాలపై కోర్టులో కేసులు ప్రగతిదశలో ఉన్నాయన్నారు. రాష్ట్రం తరపున వాదిస్తున్న అడ్వకేట్లతో వర్చువల్‌ సమావేశం జరుపుతామన్నారు. అడ్వకేట్‌ జనరల్‌, జలనిపుణులు పాల్గొంటారన్నారు. కర్ణాటకకు జల వివాదాలు పలు రాష్ట్రాల నుంచి కొనసాగుతున్నాయన్నారు. ట్రిబ్యునల్‌ ఆదేశాలు, సుప్రీంకోర్టులో వాయిదాలకు ముందు తరచూ వర్చువల్‌ సమీక్షలు జరిపి వారు ఏ విధంగా స్పందించదలచుకున్నారో తెలుసుకుంటామన్నారు. కృష్ణ నదికి సంబంధించి బచావత్‌ ఆదేశాలతోపాటు బ్రిజేశ్‌ మిశ్రా ట్రిబ్యునల్‌ నిర్ణయం కూడా వచ్చిందని, గెజిట్‌ నోటిఫికేషన్‌ వెలువడాల్సి ఉందన్నారు. మహదాయి ట్రిబ్యునల్‌ ఆదేశాలు జారీ చేసినా మరోసారి సుప్రీంకోర్టులో పిటీషన్‌ దాఖలైందన్నారు. కర్ణాటకతోపాటు మూడు రాష్ట్రాల నీటి పంపిణీకి సంబంధించి విబేధాలు ఉన్నాయన్నారు. కావేరి నదికి అనుబంధంగా మేకెదాటు ప్రాజెక్టు నిర్మాణాలకు కేంద్రం డీపీఆర్‌ ఆదేశించిందని, ఆ తర్వాత తమిళనాడు సుప్రీంకోర్టును ఆశ్రయించిందన్నారు. వీటిపై ఇప్పటికే పలుమార్లు ఢిల్లీలోనూ చర్చలు జరిగాయన్నారు. త్వరలోనే వర్చువల్‌ భేటీ జరిపి న్యాయవాదులు, నిపుణులతో మాట్లాడతామన్నారు. 

Updated Date - 2022-01-23T17:16:51+05:30 IST