ఆ ప్రాజెక్టుకు నీటి కొరత తీరుస్తాం..

ABN , First Publish Date - 2022-06-05T17:54:00+05:30 IST

భద్ర జలాశయం ద్వారా వాణివిలాస్‌ ప్రాజెక్టుకు నీటి కొరతను తీరుస్తామని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై హామీ ఇచ్చారు. చిత్రదుర్గ జిల్లా

ఆ ప్రాజెక్టుకు నీటి కొరత తీరుస్తాం..

- త్వరలోనే చిత్రదుర్గ మెడికల్‌ కళాశాలకు శంకుస్థాపన 

- విద్యావిధానంలో మార్పులకు చర్యలు

- ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై 


బెంగళూరు, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): భద్ర జలాశయం ద్వారా వాణివిలాస్‌ ప్రాజెక్టుకు నీటి కొరతను తీరుస్తామని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై హామీ ఇచ్చారు. చిత్రదుర్గ జిల్లా హిరియూరు తాలూకాలో ధర్మపుర చెరువుకు ఎత్తిపోతల ద్వారా నీరు మళ్లించే పనులకు శనివారం సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం హరియబ్బ గ్రామంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గతంలో జలవనరులశాఖ మంత్రిగా ఉన్నప్పుడు హిరియూరు రైతులు 543 రోజులపాటు తీవ్రమైన పోరాటం చేశారని గుర్తు చేశారు. అప్పట్లో రైతులతో కలసి చర్చించి నీటి మళ్లింపు హామీ ఇచ్చానన్నారు. 15 రోజుల్లో వాణి విలాస్ కు 5 టీఎంసీల నీటిని కేటాయించానన్నారు. కానీ కాంగ్రెస్‌ 2 టీఎంసీలకే పరిమితం చేసిందని, తద్వారా ఈ ప్రాంత అన్నదాతలకు అన్యాయం చేసిందన్నారు. గత కొంతకాలంగా ఎమ్మెల్యే పూర్ణిమా నీటి మళ్లింపు విషయమై ప్రస్తావించారని తెలిపారు. సమస్య పరిష్కారానికి కట్టుబడతానని హామీ ఇచ్చారు. భద్ర ఎగువ ప్రాజెక్టుకు జాతీయహోదా దక్కిందని, ధర్మపురతోపాటు మరో 7 చెరువులకు నీరు మళ్లిస్తానని హామీ ఇచ్చారు. తాను సీఎం అయ్యాకనే చిత్రదుర్గకు మెడికల్‌ కళాశాల మంజూరు చేశానని, త్వరలోనే శంకుస్థాపన చే స్తానని తెలిపారు. తుమకూరు, చిత్రదుర్గ, దావణగెరెకు రైల్వే ప్రాజెక్టుకు కేంద్రమంత్రితో త్వరలోనే పునాది వేయిస్తానన్నారు. హిరియూ రు అభివృద్ధికి ఎమ్మెల్యే కట్టుబడ్డారని తెలిపారు. రాష్ట్రంలో విద్యావిధానంలో మార్పునకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం 7వేల పాఠశాల తరగతి గదులను నిర్మించతలపెట్టిందన్నారు. పేద రైతుల పిల్లలకు విద్య అందుబాటులో ఉండాలనే 14 లక్షల మందికి ‘విద్యానిధి’ సమకూరుస్తున్నామన్నారు. ఇదే సందర్భంగా పలువురు లబ్ధిదారులకు మూడు చక్రాల సైకిళ్లు, కుట్టుమిషన్లు, గంగాకల్యాణ పథకం పత్రాలు అందచేశారు. కార్యక్రమంలో మంత్రులు గోవింద కారజోళ, బీసీ పాటిల్‌, బైరతి బసవరాజ్‌, ఎమ్మెల్యే తిప్పారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-05T17:54:00+05:30 IST