Commonman CM: పౌరకార్మికులతో సీఎం అల్పాహారం

ABN , First Publish Date - 2022-09-24T18:04:54+05:30 IST

ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై(Chief Minister Basavaraj Bommai) తాను ‘కామన్‌మ్యాన్‌ సీఎం’ అని మరోమారు నిరూపించుకున్నారు.

Commonman CM: పౌరకార్మికులతో సీఎం అల్పాహారం

                          - మరోసారి కామన్‌మ్యాన్‌ సీఎం అని నిరూపించుకున్న బొమ్మై


బెంగళూరు, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై(Chief Minister Basavaraj Bommai) తాను ‘కామన్‌మ్యాన్‌ సీఎం’ అని మరోమారు నిరూపించుకున్నారు. శాసనసభ సమావేశాలతో బిజీగా ఉన్నప్పటికీ శుక్రవారం ఆయన తన రేస్‌కోర్సురోడ్డు నివాసానికి విచ్చేసిన పౌరకార్మికులను ఏకంగా అల్పారానికి ఆహ్వానించి ఆశ్చర్యచకితుల్ని చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 11,137 మంది పౌరకార్మికులను రెగ్యులరైజ్‌ చేసి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి బొమ్మైకు కృతజ్ఞతలు తెలిపేందుకు పెద్ద సంఖ్యలో పౌరకార్మికులు సీఎం నివాసానికి తరలివచ్చారు. సీఎంకు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం పౌరకార్మికుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. భారతి అనే పౌరకార్మికురాలి పక్కనే ఆశీనుడైన సీఎం మీకు జీతభత్యాలు సరిగ్గా వస్తున్నాయా? అంటూ అడిగి తెలుసుకున్నారు. పిల్లలు దారితప్పకుండా చక్కటి విద్యాబుద్ధులు నేర్పాలని సూచించారు. తమ ఉద్యోగాల భద్రత కోసం ఇంతకాలం పరితపించామని, ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎంతో సంతోషంగా ఉందని పలువురు పౌరకార్మికులు సీఎంకు వివరించారు. కిందిస్థాయిలో పనిచేసే సిబ్బందిలో ఆత్మగౌరవం పెంచేందుకు తద్వారా వారిలో ఆత్మవిశ్వాసం రేకెత్తించేందుకు అందరూ కృషి చేయాలని సీఎం ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. పౌరకార్మికులు ఉద్యోగ భద్రత విషయంలో ఇకపై ఎలాంటి దిగులు పడాల్సిన పనిలేదన్నారు. పౌరకార్మికులతో కలిసి ఉపహారం చేసిన వారిలో మంత్రులు గోవింద కార్జోళ, సీసీ పాటిల్‌, కోట శ్రీనివాసపూజారి, సఫాయ్‌ కర్మచారి కమిషన్‌ చైర్మన్‌ శివణ్ణ తదితరులున్నారు.

Updated Date - 2022-09-24T18:04:54+05:30 IST