క్వారంటైన్‌లోనూ CM అత్యవసర సమీక్ష

ABN , First Publish Date - 2022-01-12T17:08:35+05:30 IST

కొవిడ్‌ బారినపడి క్వారంటైన్‌లో విశ్రాంతి తీసుకుంటున్న ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై మంగళవారం కరోనా తాజా స్థితి గతులపై మంత్రులు, ఉన్నతాధికారులతో వర్చువల్‌ సమీక్ష నిర్వహించారు. ముందు జాగ్రత్తగా

క్వారంటైన్‌లోనూ CM అత్యవసర సమీక్ష

                   - నెలాఖరు వరకు Covid ఆంక్షల విస్తరణ 


బెంగళూరు: కొవిడ్‌ బారినపడి క్వారంటైన్‌లో విశ్రాంతి తీసుకుంటున్న ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై మంగళవారం కరోనా తాజా స్థితి గతులపై మంత్రులు, ఉన్నతాధికారులతో వర్చువల్‌ సమీక్ష నిర్వహించారు. ముందు జాగ్రత్తగా కొవిడ్‌ మార్గదర్శకాలను నెలాఖరు వరకు విస్తరించాలని సమావేశంలో నిర్ణయించారు. పాఠశాల విద్యార్థులలో కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు అధికంగా ఉంటున్నాయని ఆరోగ్యశాఖ అధికారులు సూచించడంతో ఆయా జిల్లాల్లో కేసుల ఆధారంగా పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని జిల్లాధికారులకు అప్పగించాలని తెలిపారు. తాలూకా, జిల్లా ఆసుపత్రులలో కొవిడ్‌ బారినపడిన చిన్నారుల కోసం ప్రత్యేక వార్డులు, ఐసీయూలను కేటాయించాలని సీఎం సూచించారు. కొవిడ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో తగిన ప్రమాణంలో ఔషధాలను నిల్వ చేసుకోవాలన్నారు. విద్య, ఆరోగ్యశాఖలు సంయుక్తంగా అన్ని విద్యాసంస్థలలో రాష్ట్రవ్యాప్తంగా క నీసం 15రోజులకోసారి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు జరపాలని సూచించారు. బహిరంగ స్థలాల్లో కొవిడ్‌ నియంత్రణకు విధించిన ఆంక్షలు కట్టుదిట్టంగా అమలయ్యేలా జిల్లాధికారులు, ఎస్పీలు పరస్పరం సమన్వయంతో పనిచేయాలని సీఎం ఆదేశించారు. థర్డ్‌వేవ్‌ తీవ్రత నేపథ్యంలో హోం ఐసొలేషన్‌లో ఉన్నవారి ఆరోగ్య స్థితిపై ప్రత్యేక పర్యవేక్షణ జరపాలని, అవసరమైనవారికి మందుల కిట్లను అందచేయాలని సూచించారు. రాజధాని బెంగళూరులో కొవిడ్‌కేసుల సంఖ్య అధికంగా ఉండడంతో తక్షణం 27 కొవిడ్‌కేర్‌ సెంటర్‌లు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. వైకుంఠ ఏకాదశి, సంక్రాంతి పండుగల సమయంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను సిద్ధం చేయాలని, రెవెన్యూ, దేవదాయ శాఖలకు సీఎం సూచించారు. ఇక బూస్టర్‌ డోసుకోసం కొవిడ్‌ రెండో డోసు పొంది 9 నెలలు పూర్తైన కొవిడ్‌ వారియర్స్‌కు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. బీబీఎంపీ పరిధిలో కొవిడ్‌ పరీక్షలను రోజుకు 1.3లక్షలకు పెంచాలని సీఎం ఆదేశించారు. సభలు, సమావేశాలు, ఉత్సవాలపై పూర్తిగా నిషేధం విధించాలని నిర్ణయించారు. మార్కెట్‌ ప్రాంతాలలో జనసంచారం లేకుండా చూడాలని, ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పక్కాగా వీటిని అమలు చేయాలని సీఎం ఆదేశించారు. సమావేశంలో మంత్రులు డాక్టర్‌ కే సుధాకర్‌, బీసీ నాగేశ్‌, ఆరగ జ్ఞానేంద్ర, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి రవికుమార్‌, కొవిడ్‌ సాంకేతిక సలహా సమితి అధ్యక్షుడు డాక్టర్‌ సుదర్శన్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-12T17:08:35+05:30 IST