
బెంగళూరు: దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమయ్యేందుకు కర్ణాటక కీలక పాత్ర పోషిస్తోందని, కొవిడ్ అనంతరం రాష్ట్ర ఆర్థిక ప్రగతి కొత్త పుంతలు తొక్కుతోందని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రకటించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌తో వీడియో సదస్సులో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. కొవిడ్-19 అనంతరం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడిన పడుతోందని అభివృద్ధి ఊపందుకొంటోందని చెప్పారు. మౌళిక సదుపాయాల రంగంలో గణనీయంగా పెట్టుబడులు తరలివస్తుండడమే ఇందుకు తార్కాణమన్నారు. 2022లో నిర్వహించతలపెట్టిన ప్రపంచ పెట్టుబడిదారుల సమావేశం కర్ణాటకను మరింతగా మలుపు తిప్పనుందన్నారు. బీదర్, గుల్బర్గా విమానాశ్రయ నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, 9 రైల్వే పథకాలు, సాగరమాల ప్రాజెక్ట్‌లో నాలుగు పథకాలు ఇప్పటికే శరవేగంగా సాగుతున్నాయని సీఎం వివరించారు. ఆర్థిక వలయాలను టౌన్‌షిప్‌లుగా అభివృద్ది చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్ర ఆర్థిక ప్రగతికి తమ ప్రభుత్వం కట్టుబడివుందన్నారు.