నా ప్రభుత్వానికి ఢోకా లేదు: భూపేష్ బఘెల్

ABN , First Publish Date - 2021-08-27T20:41:17+05:30 IST

ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని, అసెంబ్లీలో తమకు మూడొంతుల మెజారిటీ ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి..

నా ప్రభుత్వానికి ఢోకా లేదు: భూపేష్ బఘెల్

న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని, అసెంబ్లీలో తమకు మూడొంతుల మెజారిటీ ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ తెలిపారు. రాహుల్ గాంధీతో శుక్రవారం సాయంత్రం సమావేశం ఉండొచ్చని చెప్పారు. పార్టీకి అసెంబ్లీలో 70 మంది ఎమ్మెల్యేలున్నట్టు చెప్పారు. నాయకత్వం విషయంలో ఛత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన విభేదాల నేపథ్యంలో ఆయన శుక్రవారం ఢిల్లీ చేరుకున్నారు. ఆయన మద్దతుదారులైన 26 మంది ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీ చేరుకున్నారు. ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ ఇన్‌చార్జి పీఎల్ పునియాను ఆయన నివాసంలో వీరంతా కలుసుకున్నారు. మధ్యాహ్నం 4 గంటలకు రాహుల్‌ను భూపేష్ బఘెల్ కలిసే అవకాశం ఉంది.


''రాహుల్ గాంధీని కలుసుకొమ్మని కేసీ వేణుగోపాల్ నుంచి పిలుపు వచ్చింది. అందుకోసమే పార్టీ అధిష్ఠానాన్ని కలుస్తున్నాను. పార్టీ నేతను కలుసుకోవడం సహజమే కదా. కొందరైతే ఆహ్వానం లేకపోయినా వెళ్లి కలుస్తుంటారు'' అని ఢిల్లీకి బయలుదేరే ముందు రాయ్‌పూర్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ భూపేష్ బఘెల్ తెలిపారు. చెరో రెండున్నరేళ్ల పాలన పంచుకోవాలని కోరుకునే వారు రాజకీయ అస్థిరత కోసం ప్రయత్నిస్తున్నారని, అయితే వాళ్ల ప్రయత్నాలు విజయవంతం కావని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. కాగా, టీమ్ పనితీరు లేకపోతేనే నాయకత్వం మార్చాల్సి ఉంటుందని, భూపేష్ బఘెల్ చక్కటి పాలన అందిస్తున్నారని ఛత్తీస్‌గఢ్ మంత్రి అమర్‌జీత్ భగత్ తెలిపారు.

Updated Date - 2021-08-27T20:41:17+05:30 IST