రాజధానికి సరికొత్త రూపం

ABN , First Publish Date - 2021-12-22T17:45:45+05:30 IST

రాజధాని బెంగళూరు నగరానికి అత్యుత్తమ మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా సరికొత్త రూపాన్ని ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ప్రకటించారు. శాసనసభలో మంగళవారం కాంగ్రెస్‌ సభ్యుడు కేజే జార్జ్‌

రాజధానికి సరికొత్త రూపం

- పోలీసులకు ఇక ఆకర్షణీయమైన యూనిఫాం 

- ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై వెల్లడి 


బెంగళూరు: రాజధాని బెంగళూరు నగరానికి అత్యుత్తమ మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా సరికొత్త రూపాన్ని ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ప్రకటించారు. శాసనసభలో మంగళవారం కాంగ్రెస్‌ సభ్యుడు కేజే జార్జ్‌ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ స్మార్ట్‌ సిటీ పథకం కింద చేపట్టిన పనులను నిర్ణీత అవధిలోగా పూర్తి చేయాల్సిందిగా అధికార యంత్రాంగానికి స్పష్టమైన సూచనలు చేశామన్నారు. బెంగళూరు నగర జనాభా ఇప్పటికే కోటి దాటేసిందన్నారు. స్మార్ట్‌ సిటీ పథకం కింద రూ.వెయ్యి కోట్లకుపైగా నిధులు మంజూరైన సంగతిని గుర్తు చేశారు. ఇందులో రూ.550 కోట్లు రహదారుల అభివృద్ధికి కేటాయించామన్నారు. కబ్బన్‌పార్కు, కేఆర్‌ మార్కెట్‌ అభివృద్ధికి తలా రూ.60 కోట్లు, విద్యుత్‌ బస్సుల కోసం రూ.50 కోట్లు కేటాయించామన్నారు. 2022 మా ర్చినాటికి పూర్తి చేయాలని సంకల్పించినట్టు తెలిపారు. బెంగళూరు నగర జిల్లాలోని 16 ప్రముఖ రహదారులను అత్యాధునికస్థాయిలో తీర్చిదిద్దడం ద్వారా ట్రాఫిక్‌ రద్దీకి తెరదించుతామన్నారు. రాజధానికి కొత్తరూపం ఇచ్చేందుకు చేపట్టిన పథకాలకు నిధుల కొరత లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా బెంగళూరు పోలీసుల యూనిఫాంకు కూడా కొత్తరూపం ఇవ్వాలన్న ఆలోచన ఉందన్నారు. మరింత ఆకర్షణీయంగా ఉండేలా యూనిఫాంను సిద్ధం చేస్తున్నామన్నారు. రాజధాని అంతటా ట్రాఫిక్‌ రద్దీని నియంత్రించి ఎల్‌ఈడీ వీధి దీపాలు అమర్చడం ద్వారా నగర సౌందర్యాన్ని పెంచుతామన్నారు. నగరంలో శాంతిభద్రతల పరిస్థితిని మెరుగుపరిచే అంశంపై దృష్టి సారించామన్నారు

Updated Date - 2021-12-22T17:45:45+05:30 IST