నూతన సంవత్సర వేడుకలపై త్వరలో నిర్ణయం: CM

ABN , First Publish Date - 2021-12-11T17:14:46+05:30 IST

నూతన సంవత్సర వేడుకలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వంపై ఒత్తిడి ఉన్నమాట నిజమేనని అయితే మరో వారం తర్వాత కొవిడ్‌ పరిస్థితిని సమీక్షించి తగిన నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై

నూతన సంవత్సర వేడుకలపై త్వరలో నిర్ణయం: CM

బెంగళూరు: నూతన సంవత్సర వేడుకలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వంపై ఒత్తిడి ఉన్నమాట నిజమేనని అయితే మరో వారం తర్వాత కొవిడ్‌ పరిస్థితిని సమీక్షించి తగిన నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ప్రకటించారు. హుబ్బళ్ళిలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కొత్తగా ఒమైక్రాన్‌ కేసులేవీ వెలుగుచూడలేదన్నారు. ప్రతి కొవిడ్‌ పాజిటివ్‌ కేసును కూలంకుషంగా పరిశీలించాలని ఆరోగ్యశాఖ అధికారులకు సూచించామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వద్దన్నారు. బాధితుల ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లపై నిఘా కొనసాగుతోందన్నారు. క్రిస్మస్‌, నూతన సంవత్సర వేడులకు అనుమతి ఇవ్వాలా వద్దా అనే అంశంపై త్వరలోనే ప్రభుత్వం స్పష్టత ఇస్తామన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణ దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. బెళగావి శాసనసభ సమావేశాలలో ఉత్తర కర్ణాటక సమస్యలపై విస్తారమైన చర్చ జరగాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. భారీ వర్షాలు వరదల కారణంగా పంటనష్టానికి గురైన అన్నదాతలకు పరిహారాన్ని పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. విధానపరిషత్‌ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు కైవశం చేసుకుంటుందన్నారు.


శాసనసభ సమావేశాలను కుదించం 

ఒమైక్రాన్‌ వేరియంట్‌ నేపథ్యంలో శాసనసభ సమావేశాలను కుదించే ఆలోచన లేదని రెవెన్యూశాఖ మంత్రి ఆర్‌ అశోక్‌ స్పష్టం చేశారు. బెంగళూరు విధానసౌధ వద్ద మాజీ ముఖ్యమంత్రి నిజలింగప్ప జయంతి సందర్భంగా శుక్రవారం ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ముందుగా నిర్ణయించిన ప్రకారమే శాసనసభ సమావేశాలు రెండు వారాలపాటు జరుగుతాయన్నారు. కాగా పరిషత్‌ ఎన్నికల్లో బీజేపీకి 12 స్థానాలు ఖాయమని అంతకంటే ఎక్కువ స్థానాలు రావచ్చునని ఆశిస్తున్నామన్నారు.

Updated Date - 2021-12-11T17:14:46+05:30 IST