support: భారీ వర్షాలతో దెబ్బతిన్నాం.. ఆదుకోండి

ABN , First Publish Date - 2022-08-31T17:53:33+05:30 IST

భారీ వర్షాలతో రాజధాని బెంగళూరు సహా పలు జిల్లాల్లో అపారనష్టం సంభవించిందని కేంద్రం ఉదారంగా ఆదుకోవాలని కర్ణాటక విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర

support: భారీ వర్షాలతో దెబ్బతిన్నాం.. ఆదుకోండి

- కేంద్రానికి రాష్ట్రం వినతి

- అధికారులతో సమీక్షించిన సీఎం

- వరద ప్రాంతాల్లో పర్యటించిన కుమారస్వామి, డీకే శివకుమార్‌


బెంగళూరు, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షాలతో రాజధాని బెంగళూరు సహా పలు జిల్లాల్లో అపారనష్టం సంభవించిందని కేంద్రం ఉదారంగా ఆదుకోవాలని కర్ణాటక విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ఆర్‌ అశోక్‌ బెంగళూరులో మంగళవారం మీడియాతో మాట్లాడారు. తక్షణసాయంగా ప్రభుత్వం రూ.250 కోట్లను విడుదల చేసిందని, యుద్ధప్రాతిపదకన సహాయ చర్యలు చేపట్టామని తెలిపారు. బెంగళూరు సహా రాష్ట్రంలోని రామనగర, మండ్య, తుమకూరు తదితర జిల్లాల్లో సోమవారం రోజంతా కురిసిన కుండపోత వర్షం కారణంగా అపారనష్టం సంభవించిందన్నారు. జూలై నుంచి ఆగస్టు వరకు వర్షం కారణంగా సంభవించిన నష్టాన్ని అధిగమించేందుకు, సహాయ కార్యక్రమాలకు రూ.1012.5 కోట్లను విడుదల చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరామని పేర్కొన్నారు. జాతీయ విపత్తు సహాయనిధి ద్వారా ఈ మొత్తం రాష్ట్రానికి అందే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో గత రెండు నెలలుగా కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా 5.80 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయన్నారు. 22,734 కిలోమీటర్ల రహదారులు పాక్షికంగా లేదా పూర్తిగా ధ్వంసమయ్యాయని, 1471 వంతెనలు కుప్ప కూలాయన్నారు. 499 చెరువులకు గండి పడిందన్నారు. నీట మునిగిన ప్రాంతాల్లోని 9,556 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలు, శిబిరాలకు తరలించామన్నారు. 29వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారన్నారు. గత 24 గంటల అవధిలో రాష్ట్రంలో 820 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని, 27జిల్లాల్లో అత్యధికంగా వర్షం కురిసిందని, 20 గ్రామాలు పూర్తిగాను, మరో 50 గ్రామాలు పాక్షికంగాను నీట మునిగాయన్నారు. రామనగరలో ఇద్దరు, బళ్లారిలో ఒకరు మృతి చెందారన్నారు. ముందుజాగ్రత్తగా చామరాజనగర, తుమకూరు, మండ్య, రామనగర జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించామన్నారు. అన్ని జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తం చేశామన్నారు. రామనగర జిల్లా బిడది శివారులోని తోరెదొడ్డి గ్రామంలో కారుపై చెట్టు కుప్పకూలిన మృతి చెందిన బోరేగౌడ నివాసాన్ని మాజీ సీఎం హెచ్‌డీ కు మారస్వామి సందర్శించి కుటుంబీకులను ఓదార్చారు. పార్టీ తరపున రూ.5 లక్షల సహాయ చెక్కును అందచేశారు. ప్రభుత్వం నుంచి మరింత సాయం అందించేలా ప్రయత్నిస్తానన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బెంగళూరు - మైసూరు ఎక్స్‌ప్రెస్‌ హైవే(Bangalore - Mysore Express Highway) పనుల నాణ్యత అద్భుతంగా ఉందంటూ బీజేపీ ఎంపీ ప్రతాప్‏సింహ చేసిన వ్యాఖ్యలపై ఆక్రోశం వ్యక్తం చేశారు. సోమవారం మధ్యాహ్నం ఈ ప్రాంతానికి ప్రతాపడసింహ వచ్చి ఉంటే రోడ్డుపైనే ఎంచక్కా ఈత వేసేందుకు అవకాశం ఉండేదని ఎద్దేవా చేశారు. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ కూడా చెన్నపట్టణ తాలూకాలో పర్యటించి బాధితుల సమస్యలను ఆలకించారు. మరోవైపు మరో రెండురోజులు భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించడంతో పలు జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ముఖ్యమంత్రి బొమ్మై(Chief Minister Bommai) బెంగళూరులో మంగళవారం సాయంత్రం తాజా పరిస్థితిని సమీక్షించారు. 

Updated Date - 2022-08-31T17:53:33+05:30 IST