చీకట్లో సీఎం వరద పర్యటన

ABN , First Publish Date - 2021-12-03T07:42:31+05:30 IST

జిల్లాలో వరద నష్టాల పరిశీలనకు గురువారం సీఎం జగన్‌ రెండు గంటలు ఆలస్యంగా రావడంతో చీకట్లోనే వరద నష్టాలను, బాధితుల కష్టాలను పరిశీలించాల్సి వచ్చింది.

చీకట్లో సీఎం వరద పర్యటన
పాపానాయుడుపేట వద్ద కూలిన వంతెన ప్రదేశాన్ని చూస్తున్న ముఖ్యమంత్రి జగన్‌

-రెండు గంటలు ఆలస్యంగా రాక

-వెదుళ్ళచెరువు, పాపానాయుడుపేటల్లో పర్యటన

-చీకట్లోనే దెబ్బతిన్న ఇళ్లు, కూలిన బ్రిడ్జి పరిశీలన

-తిరుచానూరు పర్యటన, సమీక్ష వాయిదా

-ముప్పావు గంటలో ముగిసిన మొదటిరోజు టూర్‌



చీకటిపడ్డాక సీఎం వచ్చారు. టార్చిలైట్ల వెలుగులో కూలిన వంతెన చూశారు. ఎస్టీ కాలనీలో అరగంట కలతిరిగారు. పసిబిడ్డల్ని ఎత్తుకుంటూ, ముసలివాళ్ల చెంపలపై తాకుతూ, మహిళల తలలపై ఆశీర్వదిస్తున్నట్టుగా చేతులానిస్తూ తన సహజ శైలిలో గడిపారు. వెదళ్లచెరువు ఎస్టీ కాలనీ, పాపానాయుడుపేటలో కూలిన వంతెన చూసిన ఆయన పాడిపేట పర్యటనను  వాయిదా వేసుకున్నారు. రెండు గంటల ఆలస్యంగా వచ్చిన సీఎం రాత్రి 8.20 కే పర్యటన ముగించుకుని అతిథిగృహానికి చేరుకున్నారు. శుక్రవారం ఉదయం మరికొన్ని ప్రాంతాలను సందర్శిస్తారు

తిరుపతి, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వరద నష్టాల పరిశీలనకు గురువారం సీఎం జగన్‌ రెండు గంటలు ఆలస్యంగా రావడంతో చీకట్లోనే వరద నష్టాలను, బాధితుల కష్టాలను పరిశీలించాల్సి వచ్చింది.సాయంత్రం 5.25 గంటలకు ఆయన విమానాశ్రయంలో దిగేటప్పటికే ఆకాశం మేఘావృతమై మబ్బులు కమ్ముకుని వుండడంతో చీకట్లు అలుముకోవడం మొదలైంది.6 గంటలకు రేణిగుంట మండలం వెదళ్ళ చెరువు ఎస్టీ కాలనీ చేరుకునే సరికే చీకటి పడిపోయింది. ఫ్లడ్‌ లైట్ల వెలుగులో ఆయన వీధుల వెంట పర్యటించి వరదలకు దెబ్బతిన్న ఇళ్ళను పరిశీలించారు.పది ఇళ్ళను దగ్గరగా వెళ్ళి చూసి బాధితులను పలకరించారు.ప్రభుత్వం నుంచీ సాయం అందిందా అంటూ మహిళలను ప్రశ్నించారు. సీఎం రాక సందర్భంగా అధికారులు వారికి ముందుగానే ఇళ్ళ స్థల పట్టాలు, హౌసింగ్‌ శాఖ తరపున దెబ్బతిన్న ఇళ్ళకు పరిహారంగా రూ. 91 వేల వంతున చెక్కులు అందజేశారు.కాలనీలో అరగంట పాటు గడిపిన సీఎం తర్వాత 7.13 గంటలకు పాపానాయుడు పేట చేరుకుని 15 నిమిషాలు గడిపారు.స్వర్ణముఖిపై బ్రిడ్జి కూలిపోయిన ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ సందర్శించాక ఫ్లడ్‌ లైట్‌ వెలుగుల్లోనే కూలిన బ్రిడ్జిని పరిశీలించారు.అక్కడినుంచీ తిరుచానూరు చేరుకుని పాడిపేట సమీపంలో స్వర్ణముఖిపై కొట్టుకుపోయిన వంతెనను పరిశీలించాల్సి వుండగా అప్పటికే బాగా ఆలస్యం కావడంతో శుక్రవారానికి వాయిదా వేసుకున్నారు. పాపానాయుడు పేట నుంచీ నేరుగా రాత్రి 8.20 గంటలకు తిరుపతి పద్మావతీ అతిధి గృహం చేరుకున్నారు.అక్కడే సమీక్షా సమావేశం వుంటుందని ప్రకటించిన కారణంగా ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు మీటింగ్‌ హాల్లో నిరీక్షించారు.అయితే అది కూడా వాయిదా పడింది.పర్యటించిన రెండు చోట్లా అధికార పార్టీకి చెందిన మండల, గ్రామస్థాయి ప్రజాప్రతినిధులకు సీఎంతో మాట్లాడే అవకాశం దొరకలేదు. పోలీసులు కఠినంగా వ్యవహరించడంతో దూరంగానే వుండాల్సి వచ్చింది.


సీఎం వచ్చేముందు ఆగిన విద్యుత్‌ సరఫరా 

పాపానాయుడుపేటలో సీఎం పరిశీలించే స్వర్ణముఖి బ్రిడ్జి వద్ద అధికారులు షామియానాలు ఏర్పాటు చేసి వాటి కింద ఫొటో ఎగ్జిబిషన్‌, వీవీఐపీలు కూర్చునేందుకు ఓ విభాగం, స్థానిక ప్రజాప్రతినిధులు కూర్చునేందుకు మరో విభాగం, మీడియా కోసం ఇంకో విభాగం ఏర్పాటు చేశారు. సీఎం బ్రిడ్జి చూడడానికి వీలుగా నదికి చేరువగా రెండుచోట్ల బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే ఆయన పర్యటన ఆలస్యం కావడంతో ముందుగానే ఫ్లడ్‌ లైట్లు ఏర్పాటు చేశారు. తీరా సీఎం వచ్చే ముందు విద్యుత్‌ సరఫరా ఆగిపోవడంతో అధికారులు, ముఖ్యంగా పోలీసులు హైరానా పడ్డారు. అయితే నాలుగు నిమిషాల తర్వాత విద్యుత్‌ సరఫరా కావడంతో ఊపిరి పీల్చుకున్నారు.ఫొటో ఎగ్జిబిషన్‌లో ఎస్పీడీసీఎల్‌, పంచాయతీరాజ్‌ శాఖలకు కేటాయించిన బోర్డులు  ఖాళీగా దర్శనమివ్వడంతో కలెక్టర్‌ హరినారాయణన్‌ భగ్గుమన్నారు.సంబంధిత శాఖల అధికారులపై చర్యలు తీసుకుంటానని ఘాటుగా హెచ్చరికలు జారీ చేశారు. మీరేం చేస్తున్నారంటూ రెవిన్యూ శాఖకు చెందిన మండల, డివిజన్‌ స్థాయి అధికారులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్‌ మండిపడడంతో ఆయా శాఖల అధికారులు ఉరుకులుపరుగులు తీశారు. మొత్తానికీ సీఎం జగన్‌ అక్కడికి చేరుకోకముందే ఆ శాఖల బోర్డులపై ఫొటోలు ప్రత్యక్షమయ్యాయి.


 వీఆర్వో సస్పెన్షన్‌కు సీఎం ఆదేశం

రేణిగుంట, డిసెంబరు 2: ప్రభుత్వమిచ్చిన భూమికి పట్టాదారు పాస్‌ పుస్తకం ఇవ్వడంలో అన్యాయం చేస్తున్నారని ఓ మహిళ చేసిన ఫిర్యాదుతో స్పందించిన ముఖ్యమంత్రి సంబంధిత వీఆర్వోను సస్పెండ్‌ చేయాల్సిందిగా ఆదేశించారు. గురువారం సాయంత్రం సీఎం జగన్‌ను వెదళ్ళచెరువు ఎస్టీ కాలనీలో వరదయ్యపాలెం మండలం ఇందిరానగర్‌కు చెందిన తుపాకుల సుజాత కలసి వినతి పత్రం అందజేశారు. యానాది కులానికి చెందిన తమ కుటుంబానికి ప్రభుత్వం 2004లో ఇందిరా నగర్‌ సర్వే నంబరు 303-1లో 2.75 ఎకరాల భూమిని పట్టాగా ఇచ్చిందని ఆమె వివరించారు. ఇటీవల తన భర్త మరణించడంతో రైతు భరోసా కోసం తన పేరిట పట్టాదారు పాస్‌ పుస్తకం జారీ చేయాలని వీఆర్వోను కోరగా కేవలం ఎకరా భూమికి మాత్రమే పాస్‌ పుస్తకం ఇచ్చారని వివరించారు. మొత్తం భూమికి తన పేరిట పాస్‌ పుస్తకం ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన సీఎం జగన్‌ వెంటనే వీఆర్వో చలపతిని సస్పెండ్‌ చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు.వైద్య శాఖలో మిడ్‌ లైఫ్‌ హెల్త్‌ ప్రొవైడర్లకు కౌన్సిలింగ్‌ నిర్వహించే సందర్భంలో జిల్లాను యూనిట్‌గా పరిగణించాలని సంబంధిత ఉద్యోగులు సీఎంకు వినతి పత్రం సమర్పించగా సానుకూలంగా స్పందించారు.


నేడు తిరుపతిలో పర్యటన

 తిరుపతి, తిరుచానూరు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి శుక్రవారం ఉదయం పర్యటించనున్నారు.అలాగే అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. వాస్తవానికి గురువారం తిరుచానూరు పర్యటనతో పాటు అధికారులతో జరపాల్సిన సమీక్షా సమావేశం కూడా ఆలస్యం కారణంగా జరగని సంగతి తెలిసిందే. వీటిలో పాడిపేట పర్యటన శుక్రవారం జరిగే అవకాశముంది. శ్రీకృష్ణ నగర్‌, ఆటో నగర్‌ ప్రాంతాల్లో పర్యటించాక పాడిపేట వెళతారని సమాచారం. అలాగే సమీక్షా సమావేశం కూడా శుక్రవారం ఉదయాన్నే వుండొచ్చునని సమాచారం. కాకపోతే వీటిపై స్పష్టత లేదు. ప్రస్తుతానికైతే ఈ రెండు కార్యక్రమాలూ శుక్రవారం ఉంటాయన్న ఉద్దేశంతోనే అధికార యంత్రాంగం దానికనుగుణంగా ఏర్పాట్లు చేపట్టింది.







Updated Date - 2021-12-03T07:42:31+05:30 IST