ఆపదలో ఉన్నాం.. ఆదుకోండయ్యా.. పరామర్శ కాదు.. పైసలివ్వండి..!

Dec 2 2021 @ 23:44PM
అనంతసాగరం : సోమశిల జలాశయం సమీపంలో దెబ్బతిన్న రోడ్డు

  • పరామర్శ కాదు.. పైసలివ్వండి!
  • వరద బాధితుల గగ్గోలు
  • నేడు ముఖ్యమంత్రి జగన పర్యటన
  • బంగాళాఖాతంలో అల్పపీడనాల ప్రభావం..
  • 20 రోజులుగా ఎడతెరపిలేని వర్షాలు...


జిల్లా చరిత్రలో ఎన్నడూ లేనంతగా వరద పోటెత్తింది. ఎంతో శాంతంగా ఉండే పెన్నమ్మ ఉగ్రరూపం దాల్చింది. వాగులు, వంకల ఉధృతికి చెరువుల కట్టలు తెంచుకున్నాయి. ఓ చోట ఊరు మునిగిపోగా మరోచోట వెళ్లేందుకు దారి కూడా లేకుండా పోయింది. గూడు చెదిరి కొందరు.. కట్టుబట్టలతో ఇంకొందరు రోడ్డున పడ్డారు. అన్నదాతల చేతికొచ్చిన పంట దెబ్బతింది.. వేసిన వరినాట్లన్నీ గంగపాలయ్యాయి. రూ.కోట్లు పెట్టుబడి పెట్టిన ఆక్వా రంగం కడలిలో కలిసిపోయింది. ఇలా జిల్లాలో ఎటు చూసినా, ఏ వర్గాన్ని కదిలించినా కన్నీళ్లే కనిపిస్తున్నాయి. ఆ చీకటి రోజుల నుంచి ఇప్పటికీ జిల్లావాసులు కోలుకోలేకున్నారు. ఎంతోమంది సగం కూలిన ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ బతుకీడుస్తున్నారు. అందాల్సినంత సాయం ఇంకా అందలేదు. ఆపన్నహస్తాల కోసం రెండు కళ్లు వీధి గుమ్మం వైపు ఆశగా చూస్తున్నాయి. జిల్లాకు జరిగిన నష్టం రూ.1100 కోట్లపైనేనని అధికారులు ప్రాథమిక అంచనా వేసినా క్షేత్రస్థాయిలో ఈ నష్టం భారీగా ఉంది.


పరామర్శలు కాదు..

జరిగిన వరద నష్టంపై ఇటీవల కేంద్రానికి చెందిన రెండు బృందాలు జిల్లాలో పరిశీలించాయి. బాధితులతోనూ మాట్లాడాయి. పాలకులూ ముంపువాసులను పరామర్శిస్తున్నారు. ఇదంతా బాగున్నా... సాయం మాటేమిటన్నదే ప్రశ్నగా మిగిలిపోతోంది. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి శుక్రవారం బుచ్చిరెడ్డిపాళెం, నెల్లూరు రూరల్‌, నగరం ప్రాంతాల్లో పర్యటించనున్నారు. జరిగిన నష్టాన్ని పరిశీలించి, బాధితులతో మాట్లాడనున్నారు. నష్టాన్ని పూడ్చి, బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. దెబ్బతిన్న రోడ్లు, ఇతర నిర్మాణాలను వీలైనంత త్వరగా పునరుద్ధరించగలిగేతేనే సాధారణ పరిస్థితులు ఏర్పడతాయి. 


పోటెత్తిన పెన్నా.. దానికితోడు ఇసుకాసురుల అక్రమ తవ్వకాలతో బలహీనపడిన కరకట్టలు.. ఇవే ప్రజలను ముంచేశాయి. నెల్లూరు నగరం శివారు ప్రాంతాలైన ఏడు కాలనీలు పది అడుగుల లోతున నీళ్లలో మునిగిపోయాయి. వందలాది ఎకరాల పొలాల్లో 5 నుంచి ఆరు అడుగుల ఎత్తు ఇసుక మేటలు పెట్టేశాయి. పచ్చని పంటపొలాల మధ్య 20 నుంచి 30 అడుగుల వెడల్పుతో 10 అడుగులకు మించిన లోతుతో గండ్లు పడ్డాయి. వేలాది ఇళ్లు నీట మునగడంతో ఇళ్లలోని కోట్లాది రూపాయల విలువచేసే గృహోపకరణాలు పనికిరాకుండా పోయాయి. పొంగుకొచ్చిన వరద ఓ పాలిటెక్నిక్‌ విద్యార్థిని తరగతి గదిలోనే కబళించేసింది. ఎన్నో మూగజీవాలు నీటిలో కొట్టుకుపోయాయి. వరద కారణంగా జిల్లా పరిధిలో తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాలు.. అక్కడి ప్రజలకు ఎదురైన కష్టనష్టాలకు సంబంధించి క్లుప్తంగా...


బుచ్చిరెడ్డిపాళెం మండలంలో పెన్నా పొర్లుకట్టలు తెగడంతో అంచనాలకు మించిన నష్టం జరిగింది. మినగల్లు నుంచి దామరమడుగు పల్లెపాలెం వరకు 14 చోట్ల పెన్నా కరకట్టలు తెగిపోవడంతో వరద ఊళ్లపైకి పోటెత్తింది. పెనుబల్లి సహా ఐదు గ్రామాలు నీట మునిగాయి. మినగల్లు నుంచి దామరమడుగు వరకు కిలోమీటర్ల విస్తీర్ణంలో పంట పొలాల్లో 6 నుంచి 10 అడుగుల ఎత్తుకు ఇసుక మేటలు వేశాయి. పొలాల్లో భారీ గండ్లు పడ్డాయి. నీట మునిగిన వేలాది ఇళ్లలో గృహోపకరణాలన్నీ నాశనం అయ్యాయి. ప్రతి కుటుంబం కనీసం 10 వేల నుంచి 2, 3 లక్షల వరకు నష్టపోయింది. వందకుపైగా మూగజీవాలు కొట్టుకుపోయాయి. 


ఇందుకూరు మండలం ముదివర్తిపాలెం, నిడుముసలి, పల్లెపాలెం గ్రామాల వద్ద నాలుగు చోట్ల పెన్నా పొర్లుకట్టలు తెగిపోయాయి. ఈ వరద ఉధృతి కారణంగా  గంగపట్నం, మైపాడు చెరువులు తెగిపోయాయి. గంగపట్నం చెరువు కింద సుమారు మూడు వేల ఎకరాల్లో రొయ్యల చెరువులు ధ్వంసం అయ్యాయి. చేతికి అంది వచ్చిన రొయ్యలు మొత్తం సముద్రం పాలయ్యాయి.  సాగుదారులు వందల కోట్ల రూపాయలు నష్టపోయారు. పల్లెపాలెం వద్ద వంతెన తెగిపోవడంతో 400 మత్స్యకార కుటుంబాలకు జీవనోపాధి దెబ్బతింది. ఇక ప్రధాన రోడ్లన్నీ ధ్వంసం అయ్యాయి. 


కోవూరు మండలం సాలుచింతల, స్టౌబీడీ కాలనీ, కోనమ్మతోట గ్రామాలు నీట మునిగాయి. ఈ ప్రాంతవాసులకు రెండు రోజులపాటు ఆహారం కూడా అందించే అవకాశం లేకుండా పోయింది. 50కిపైగా పూరిగుడిసెలు కూలిపోయాయి. ఇళ్లన్నీ నీట మునగడంతో గృహోపకరణాలన్నీ నాశనం అయ్యాయి. లక్ష్మీనారాయణపురంలో లక్షల రూపాయల ఎండు చేపలు ఎందుకూ పనికిరాకుండా పోయాయి. కోవూరు చెరువు తెగిపోవడంతో పాటూరు వద్ద రోడ్డు కోతకు గురైంది. పలు గ్రామాలకు రాకపోకలు బంద్‌ అయ్యాయి. 


నెల్లూరు నగర పరిధిలో భగతసింగ్‌ కాలనీ, జనార్ధనరెడ్డి కాలనీ, అల్లీనగర్‌, గాంధీగిరిజన కాలనీ, వారాది సెంటర్‌, పునరావాస కాలనీ, నల్లకాలువ ప్రాంతంలో వేలాది ఇళ్లు నీట మునిగాయి. ఈ ప్రాంతాల్లో సుమారు 10 అడుగుల ఎత్తున వరద ప్రవహించడంతో ఫస్ట్‌ ఫ్లోర్‌లోకి కూడా నీళ్లు వెళ్లాయి. వేల ఇళ్లలో సామగ్రి పనికిరాకుండా పోయింది. ప్రతి కుటుంబం కనిష్ఠంగా రూ.50 వేల  నుంచి 3 లక్షల వరకు నష్టపోయింది. పాలిటెక్నిక్‌, ఐటీఐ కళాశాలలు నీట మునిగాయి. పాలిటెక్నికల్‌ కళాశాలలో గోపి అనే విద్యార్థి కళాశాల ప్రాంగణంలోనే నీట మునిగి చనిపోయాడు. జగనన్న కాలనీ ఇళ్ల పునాదులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఈ రెండు కాలనీలు ఇప్పటికీ వరద నుంచి కోలుకోలేకున్నాయి.  - నెల్లూరు (ఆంధ్రజ్యోతి)

 

వరదలు, భారీ వర్షాలకు జిల్లాలో 23 మండలాలు ప్రభావితమయ్యాయి. మొత్తం 1,22,404 మంది ముంపు బారిన పడ్డారు. 11,784 హెక్టార్ల పంట భూములు దెబ్బతిన్నాయి. ఇందులో కొంత భూమిలో పంటలు ఉండగా, మరికొంత భూమిలో ఇసుక మేటలు ఏర్పడి సాగుకు ఉపయోగపడని విధంగా మారాయి. రూ.12.68 కోట్ల నష్టం వాటిల్లింది. 2481.70 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. 381 పశువులు, గొర్రెలు, మేకలు వరద , వర్షాల కారణంగా చనిపోయాయి. ఇక మత్స్యశాఖకు రూ.15.23 కోట్ల నష్టం జరిగింది. 1016 హెక్టార్లలో చేపల, రొయ్యల సాగు దెబ్బతిందని అధికారులు గుర్తించారు. అయితే వాస్తవానికి ఈ నష్టం భారీగా ఉంటుందని అంచనా. 


జిల్లాలో 656 కిలోమీటర్ల మేర ఆర్‌అండ్‌బీ రహదారులు దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల కల్వర్టర్లు, రహదారులు తెగిపోయాయి. వీటికి మరమ్మతు చేయాలంటే రూ.40.79 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఇక పంచాయతీరాజ్‌ పరిధిలో 1303 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమవగా, రూ.335.73 కోట్లు నష్టం వాటిల్లింది. వరద కారణంగా 672 ఇళ్లు దెబ్బతిన్నాయి. కొన్ని ఇళ్లు పాక్షికంగా దెబ్బతినగా మరికొన్ని పూర్తిగా పనికిరాకుండా పోయాయి. 


జిల్లాలో అత్యధికంగా ఇరిగేషన శాఖకు నష్టం జరిగింది. సోమశిల ప్రాజెక్టు, తెలుగుగంగ ప్రాజెక్టు, పెన్నార్‌ డెల్టా సిస్టమ్‌లో ఎక్కువ నిర్మాణాలు, చెరువులు దెబ్బతిన్నాయి. దాదాపు 1465 చెరువులు, నిర్మాణాలు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. మొత్తంగా రూ.756.93 కోట్లు నష్టం జరిగినట్లు ఇరిగేషన అధికారులు తేల్చారు. 


నెల్లూరు కార్పొరేషనతోపాటు మున్సిపాలిటీల్లో రోడ్లు, డ్రెయిన్లు, పైప్‌లైన్లు, వీధి దీపాలు దెబ్బతిన్నాయి. వీటి మూలంగా రూ.11.14 కోట్లు నష్టం జరిగింది.


గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలోని తాగునీటి పథకాలకు రూ.5.67 కోట్లు, మూడు ఆసుపత్రుల భవన నిర్మాణాలు దెబ్బతినగా రూ.52 లక్షలు నష్టం జరిగింది. ఫీడర్లు, సబ్‌స్టేషన్లు, స్తంభాలు దెబ్బతినడంతో విద్యుత శాఖకు రూ.8.52 కోట్లు, ఆరు పాఠశాలల నిర్మాణాలు దెబ్బతినగా రూ.2.54 కోట్లు నష్టం జరిగినట్లు అధికారులు నివేదిక తయారు చేశారు.

నెల్లూరు : వెంకటేశ్వరపురంలో పెన్నా నది పోటెత్తడంతో నేలమట్టమైన ఇళ్లు


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.