పక్కాగా రీసర్వే

ABN , First Publish Date - 2021-04-23T09:58:05+05:30 IST

‘‘అవినీతి, అక్రమాలకు తావులేకుండా, పూర్తి పారదర్శకతతో భూముల సమగ్ర సర్వే ప్రాజెక్టు పనులు కొనసాగాలి.

పక్కాగా రీసర్వే

అవినీతి, అలసత్వం సహించను

పర్యవేక్షణ కోసం స్టీరింగ్‌ కమిటీ

సీసీఎల్‌ఏదే ప్రాజెక్టులో కీలక పాత్ర

వారానికి ఓసారి సమీక్ష చేయండి

అధికారులతో సమీక్షలో సీఎం


అమరావతి, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): ‘‘అవినీతి, అక్రమాలకు తావులేకుండా, పూర్తి పారదర్శకతతో భూముల సమగ్ర సర్వే ప్రాజెక్టు పనులు కొనసాగాలి. ఏ ఒక్క తప్పుజరిగినా ఉపేక్షించను. అలసత్వాన్ని సహించను’’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి... అధికారులకు స్పష్టం చేశారు. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో భూముల సమగ్రసర్వేపై ఆయన సమీక్ష చేశారు. గత ఏడాది డిసెంబరు 21న  భూముల సమగ్రసర్వేను సీఎం లాంఛనంగా ప్రారంభించిన తర్వాత కూడా అనేకమార్లు సమీక్ష చేశారు. అయితే అవినీతికి అస్కారం లేకుండా రీ సర్వే జరగాలని, ఏ చిన్న విషయంలో అవినీతి జరిగినా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని, ఈ విషయంలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం స్పష్టంగా పేర్కొనడం మాత్రం ఇదే తొలిసారి.


ఒక్కటికి రెండుసార్లు క్రాస్‌చెక్‌ చేసుకోవాలని, అన్నీ పక్కాగా ఉంటేనే ముందుకు సాగాలని, తప్పులకు ఆస్కారం ఇవ్వొద్దని సీఎం సూటిగా చెప్పినట్లు తెలిసింది. ప్రాజెక్టు అమలుపై ఇక నుంచి ఉన్నతస్థాయి అధికారులు వారానికి ఒకసారి సమీక్ష చేసి పురోగతి నివేదికలకు తనకు పంపించాలని సీఎం ఆదేశించినట్లు తెలిసింది. అధికారులు ఇచ్చిన నివేదికలపై చర్చ జరుగుతుండగానే.. రీ సర్వే పనులు ముందుగా చెప్పినంత వేగంగా ఎందుకు సాగడం లేదు.. అందుకు ఎదురవుతున్న అడ్డంకులు.. సవాళ్లు ఏమిటని సీఎం ఆరా తీసినట్లు తెలిసింది. అడ్డంకులు, సమస్యలను అధిగమించి వేగంగా రీ సర్వే సాగడానికి, రెవెన్యూ, సర్వే, పురపాలకశాఖ, పంచాయతీరాజ్‌ శాఖల మధ్య సమన్వయం ఉండాలని, ఏదైనా సమస్య వస్తే అది పరిష్కారం అయ్యేవరకు రీ సర్వే పనులు నిలిచిపోకూడదని సీఎం చెప్పినట్లు తెలిసింది. ఇందుకోసం ఒక స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రీ సర్వే ప్రాజెక్టు అమలు, పర్యవేక్షణ, సమస్యల పరిష్కారంలో భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌దే (సీసీఎల్‌ఏ) కీలకపాత్ర అని సీఎం స్పష్టం చేశారు. శాఖల మధ్య సమన్వయలోపం, ఇతర సమస్యలు వచ్చినప్పుడు ముందుండి పరిష్కరించాలని, వారానికి ఒకసారి సీసీఎల్‌ఏ సమీక్ష నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు.


ఇదిలా ఉంటే, ఇప్పటివరకు సాగిన భూముల సర్వేపై శాఖలవారీగా అధికారులు ప్రజంటేషన్‌లు ఇచ్చారు. తొలిదశలో ప్రతీ జిల్లాలో ఒక గ్రామం చొప్పున 13 గ్రామాలు, ప్రతీ రెవెన్యూ డివిజన్‌కు ఒక గ్రామం చొప్పున 51 గ్రామాలు, ప్రతీ మండలానికి ఒక గ్రామం చొప్పున 650 గ్రామాల్లో సర్వే చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఇప్పటి వరకు 51 గ్రామాల్లో సమగ్రసమాచారం సేకరించినట్లు పేర్కొన్నారు. వీటిల్లో వచ్చే నెల నుంచి గ్రామస్థాయిలో సర్వే మొదలుపెట్టి జూలై నాటికి పూర్తిచేస్తామని సీఎంకు నివేదించారు. 650 గ్రామాలకు గాను 545 చోట్ల డ్రోన్‌లతో సర్వే చేసినట్లు తెలిపారు. వ్యవసాయ భూములు, నివాసప్రాంతాలకు సంబంధించి ఇప్పటివరకు 2693 ఛాయాచిత్రాలు (డ్రోన్‌ ఇమేజెస్‌) తీసినట్లు సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా టైటిల్‌బిల్లు ప్రస్తావనకు వచ్చింది. కేంద్రంలో ఇప్పుడు దాని పరిస్థితి ఏమిటి అని సీఎం ఆరా తీశారు. ఇంకా అది కేంద్ర పరిశీలనలోనే ఉందని, ఇటీవలే కొన్ని అభ్యంతరాలకు సమాధానాలు పంపించినట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అయితే, త్వరగా టైటిల్‌ మిల్లు ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. సర్వే ప్రక్రియకు నిధుల కొరత రానివ్వొద్దని అధికారులకు స్పష్టం చేశారు. 


రైతుల సమక్షంలోనే రాళ్లు..

భూముల సర్వేలో ముఖ్యమంత్రి జగన్‌ కీలక ఆదేశాలు ఇచ్చారు. గ్రామంలో భూముల సర్వే చేస్తున్న క్రమంలో రైతుల సమక్షంలోనే సరిహద్దు రాళ్లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో రెండో అభిప్రాయానికి తావులేదని సీఎం ఖరాఖండిగా స్పష్టం చేసినట్లు తెలిసింది. ‘‘సర్వే అనేదే రైతుల సమస్యలు, సందేహాలు తీర్చడానికి. కాబట్టి వారి సమక్షంలోనే సరిహద్దు రాళ్లను ఏర్పాటు చేయాలి. ఈ విషయంలో వారు సంతృప్తిగా ఉండాలి. సరిహద్దు రాళ్ల ఏర్పాటు పేరిట రైతుల నుంచి ఒక్కరూపాయి కూడా వసూలు చేయవద్దని సీఎం స్పష్టం చేశారు. అంటే ఉచితంగానే రైతులకు సరిహద్దు రాళ్లు అందించాల్సి ఉంది. కాగా, సర్వే పూర్తయిన తర్వాత భూమికి సంబంధించిన రైతుకు సరిహద్దులను పక్కాగా చూపించాలని సీఎం చెప్పారు. ఈ విషయాలపై స్పష్టత ఇస్తూ ప్రతీ గ్రామ పంచాయతీ కార్యాలయం పరిధిలో హోర్డింగులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.


51 గ్రామాల్లో సమగ్ర సర్వే పూర్తయ్యేనాటికి గ్రామపంచాయతీ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసు, భూ పరిపాలనా ప్రధాన కమిషనర్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌భార్గవ, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మీ, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి వి. ఉషారాణి, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌, సర్వే కమిషనర్‌ సిద్థార్ధ్‌జైన్‌, సీఎం ప్రధాన సలహాదారు అజేయకల్లం తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-23T09:58:05+05:30 IST