ఒంగోలు: మళ్లీ సీఎం జగన్‌ ఫ్రస్టేషన్...

ABN , First Publish Date - 2022-04-22T20:03:46+05:30 IST

ఒంగోలు: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఫ్రస్టేషన్‌లోకి వెళ్లిపోయారు.

ఒంగోలు: మళ్లీ సీఎం జగన్‌ ఫ్రస్టేషన్...

ఒంగోలు: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఫ్రస్టేషన్‌లోకి వెళ్లిపోయారు. శుక్రవారం సీఎం ఒంగోలులో పర్యటిస్తున్నారు. మూడో విడత వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం నిధులను ఆయన మహిళల పొదుపు ఖాతాల్లోకి విడుదల చేశారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ మంచి జరుగుతుంటే కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని, దుష్టచతుష్టయం అక్కసుతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సంక్షేమ పథకాలు అందిస్తున్న జగన్‌ పాలన వద్దంటూ.. చంద్రబాబు పాలనే కావాలని దుష్టచతుష్టయం అంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు దత్తపుత్రుడు కూడా అదే చెబుతున్నారని పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. పేదలకు ఉచిత పథకాలు ఇవ్వొద్దని, ఇకపై ఆ పథకాలు ఆపాలంటున్నారన్నారు.


ఉచిత పథకాలతో ఆర్థిక విధ్వంసం జరుగుతోందని, ఏపీ శ్రీలంకలా మారుతుందని గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారని సీఎం జగన్‌ మండిపడ్డారు. చంద్రబాబులా మోసం చేస్తే ఏపీ అమెరికా అవుతుందట... రాక్షసులు, దుర్మార్గులతో మనం యుద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. కాగా సీఎం పర్యటన సందర్భంగా ఒంగోలులో పోలీసులు భారీగా మోహరించారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్లే దారి మొత్తం బారికేడ్లతో నింపేశారు. ఇళ్ల నుంచి జనం బయటకు రాకుండా బారికేడ్లు కట్టారు. ఒంగోలు పూర్తిగా పోలీసుల ఆంక్షల వలయంలోకి వెళ్లిపోయింది. 

Updated Date - 2022-04-22T20:03:46+05:30 IST