లక్ష్మణ రేఖ దాటిన జగన్

ABN , First Publish Date - 2020-10-14T07:13:52+05:30 IST

న్యాయమూర్తులు వర్గ, కుల ప్రయోజనాలతో వ్యవహరిస్తున్నారని 1968లో కేరళ ముఖ్యమంత్రి నంబూద్రిపాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘న్యాయస్థానాలు, న్యాయపరిపాలనలో జోక్యం చేసుకున్న వారినే కాదు, తమ వ్యాఖ్యల వల్ల కొన్ని పరిణామాలకు.....

లక్ష్మణ రేఖ దాటిన జగన్

న్యాయమూర్తులు వర్గ, కుల ప్రయోజనాలతో వ్యవహరిస్తున్నారని 1968లో కేరళ ముఖ్యమంత్రి నంబూద్రిపాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘న్యాయస్థానాలు, న్యాయపరిపాలనలో జోక్యం చేసుకున్న వారినే కాదు, తమ వ్యాఖ్యల వల్ల కొన్ని పరిణామాలకు దారితీసే వారిని కూడా శిక్షించాల్సి ఉంటుందని, నంబూద్రిపాద్ వ్యాఖ్యలు న్యాయమూర్తులు, న్యాయస్థానాల ప్రతిష్టను ప్రజల దృష్టిలో దిగజార్చాయని’ ఆనాటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిదయతుల్లా వ్యాఖ్యానించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలు నాడు నంబూద్రిపాద్ వ్యాఖ్యల కంటే కొన్ని వందల రెట్లు తీవ్రమైనవి. వీటి పరిమాణాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.


జాతీయ రాజకీయాల్లో ఎన్నో కీలక సంఘటనలు జరుగుతున్నాయి. కరోనా తర్వాత ఆర్థిక సంక్షోభం మరింత విషమించింది. అనేక సామాజిక సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని హథ్రాస్‌లో ఒక దళిత యువతి పట్ల జరిగిన దారుణం మొత్తంగా దేశంలో దళితుల పరిస్థితి గురిం చిన చర్చను రేకెత్తించింది. ఆ యువతిని పోలీసులే దహనం చేసిన తీరుకూ, హైదరాబాద్‌లో గత ఏడాది కొందరు దుండగులు ఒక అమ్మాయిపై అత్యాచారం జరిపి హత్య చేసి కాల్చేసిన తీరుకూ తేడా కనిపించడం లేదు. జీఎస్టీ బకాయిలు చెల్లించలేదని రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నాయి. వ్యవసాయ, కార్మిక బిల్లులను ఆమోదించిన తీరుపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రప్రభుత్వం అత్యంత కీలకమైన ఆర్థిక సంస్కరణలను ఎంతో దూకుడుగా దేశంపై రుద్దే ప్రయత్నం చేస్తోంది. దేశంలో నిరుద్యోగం పెచ్చరిల్లడం, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, ఉత్పాదన పడిపోవడం, మార్కెట్ కోలుకోకపోవడంతో జాతి జీవనంలో ఎల్లెడలా నిరాశానిస్పృహలు ఆవరించాయి. సమాజంలో ఎవర్ని తట్టినా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక సరిహద్దుల్లో నెలకొన్న సంఘర్షణాయుత వాతావరణం ఇప్పట్లో చల్లారేట్టు కనపడడం లేదు.


ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు ఏ విధంగా వ్యవహరించాలి? దేశాన్ని చుట్టుముడుతున్న అనేక సమస్యల గురించి చర్చించగలగాలి. ప్రజలకు ఒక విశ్వాసాన్ని కలిగించగలగాలి. విచిత్రమేమంటే దేశంలో బిజెపి తర్వాత అధిక సంఖ్యాబలం ఉన్న ప్రాంతీయ పార్టీలు ఈ విషయంలో కూపస్థ మండూకాల్లా వ్యవహరిస్తున్నాయి. జాతీయస్థాయిలో ప్రతిపక్షంగా ఉండాల్సిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్‌లో సంఖ్యాబలం లేనప్పటికీ ఏదో రకంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేయగలుగుతున్నది. యుపిఏలో ఉన్న ప్రాంతీయపార్టీలు ఆ పార్టీకి అండగా ఉండడం వల్ల కొంత సంఘటిత స్వరం వినిపిస్తోంది. ఒకప్పుడు పార్లమెంట్‌లో ప్రతిధ్వనించిన వామపక్షాల స్వరం కూడా బలహీనంగా మారింది. తెలంగాణ రాష్ట్ర సమితి, తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలు జాతీయ సమస్యలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు సిద్ధమవుతున్నాయి. 22 మంది ఎంపీలు ఉన్న ఆంధ్రప్రదేశ్ అధికార పక్షం వైసీపీ జాతీయస్థాయిలో వ్యవహరిస్తున్న తీరు చాలా పేలవంగా, దయనీయంగా కనిపిస్తోంది. అంతమంది ఎంపీలు ఉన్నప్పటికీ జాతీయస్థాయి అంశాలను కనీసం ప్రస్తావించడానికి కూడా వారు వెనుకాడుతున్నారు. పార్లమెంట్‌లో అందరూ జాతీయ సమస్యల గురించి చర్చిస్తుంటే వైసీపీ సభ్యులు తమ రాష్ట్రంలో ప్రతిపక్షం గురించి, హైకోర్టు తీర్పుల గురించీ మాట్లాడుతున్నారు! 


ఈ నేపథ్యంలో తెలుగువాడైన ఒక న్యాయమూర్తిపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడమే కాక, దాన్ని బహిరంగపరచడం, అంతకు ముందు అదే అంశంపై హోంమంత్రిని, ప్రధానమంత్రిని కలుసుకోవడం ఆయన ఆలోచనా తీరుపై అతి తక్కువ స్థాయి అభిప్రాయం కలుగచేస్తోంది. గతంలో ముఖ్యమంత్రులు న్యాయమూర్తుల గురించి లేఖలు రాయడం జరగలేదని కాదు. దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గురించి నాటి హోంమంత్రి లాల్ బహదూర్ శాస్త్రికి ఫిర్యాదు చేశారు. కాని ఈ లేఖల గురించి ముఖ్యమంత్రులు కానీ కేంద్రంలో ఉన్న పెద్దలు కానీ బహిరంగ పరచలేదు.


న్యాయస్థానాల్లో నేతల కుంభకోణాల గురించి అనేక కేసులు నడిచాయి. మహా మహా నేతలు కోర్టుల చుట్టూ తిరిగారు. ఆడ్వాణీ, మోదీ, అమిత్ షా, యడ్యూరప్పలపై కూడా కేసులు నడిచాయి. అమిత్ షాను గుజరాత్‌లో అడుగుపెట్టకుండా కోర్టు నిషేధించింది. జయలలిత, లాలూ ప్రసాద్ యాదవ్‌ జైలు పాలయ్యారు. ములాయం, మాయావతి కేసుల్లో ఇరుక్కున్నారు. మాజీ ప్రదాని పీవీ నరసింహారావు సైతం సెషన్స్ కోర్టులో బోనులో నిలబడ్డారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ, సోనియాగాంధీ కూడా కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాజీ హోంమంత్రి చిదంబరం సైతం ఈడీ, సిబిఐ కోర్టుల్లో దోషిగా నిలబడి తీహార్ జైలు పాలయ్యారు.


కోర్టుల చుట్టూ తిరగాల్సివచ్చిన పరిస్థితుల నెదుర్కొన్న ఏ నాయకుడు కూడా ఎప్పుడూ ఏ న్యాయమూర్తిపై వ్యక్తిగత ఆరోపణలు చేయలేదు. న్యాయవ్యవస్థను నిందించలేదు. ఎందుకంటే ఆయా రాజకీయ పార్టీల నేతలకు, రాజ్యాంగం న్యాయవ్యవస్థకు కల్పించిన ప్రాధాన్యం గురించి తెలుసు. రాజ్యాంగం ప్రకారం శాసన వ్యవస్థ, కార్యానిర్వాహక వ్యవస్థతో పాటు న్యాయవ్యవస్థకు కూడా రాజకీయ పునాది ఉన్నది. ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయవ్యవస్థ స్వతంత్రతను స్పష్టం చేసిన రాజ్యాంగం, ఇతర వ్యవస్థల నిర్ణయాల చట్టబద్దతను, రాజ్యాంగబద్ధతను ప్రశ్నించే అధికారాన్ని న్యాయస్థానానికి కల్పించింది. చట్టసభలకు ఎన్నికైన నాయకులు ఆయా వ్యవస్థల సంస్థాగత, రాజ్యాంగపరమైన లక్ష్మణరేఖలను గుర్తించి వివేకంతో వ్యవహరించాలి. లేకపోతే ఆ వ్యవస్థల పట్ల ప్రజలకు ఉండే విశ్వాసం చెరిగిపోతుంది. వ్యవస్థల పట్ల ఉద్రిక్తతలు, భిన్నాభిప్రాయాలు, ఫిర్యాదులు ఎన్నో ఉండవచ్చు. కాని వాటిని పరిష్కరించుకునే విషయంలో అత్యంత సంయమనం, రాజనీతిజ్ఞత, వివేకంతో వ్యవహరించే వాడే నాయకుడవుతాడు.


ఒకరోజు సెంట్రల్ హాలులో అప్పటి కేంద్ర న్యాయశాఖ మంత్రి అరుణ్ జైట్లీ విలేఖరులతో మాట్లాడుతున్నపుడు ‘మీరు ఫలానా న్యాయమూర్తిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎందుకు నియమించలేదు..’ అని అడిగాను. ఆయన సుప్రీంలో ఫలానా న్యాయమూర్తి అనుయాయుడుగా ముద్రపడ్డారని, అందువల్ల తాము వెనుకాడుతున్నామని జైట్లీ చెప్పారు. సుప్రీం కొలీజియంలో అనేక పేర్లు ప్రస్తావనకు వస్తాయి. వారి గురించి రకరకాల సమాచారం ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా హోంశాఖకు లభిస్తుంది. సంబంధిత ముఖ్యమంత్రితో పాటు అనేక మంది అభిప్రాయాలు స్వీకరిస్తారు. చివరకు కేంద్రంలో ఉన్న పెద్దలు కూడా ఆ పేర్లపై తర్జనభర్జనలు జరుపుతారు. ఆ తర్వాతే ఆ జాబితాకు మోక్షం లభించి రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తారు. పైకి కొలీజియం వ్యవస్థ న్యాయవ్యవస్థ స్వతంత్రతకు నిదర్శనంగా కనిపిస్తున్నా అంతా ఒక ప్రజాస్వామ్య బద్ధంగా, ఏకాభిప్రాయ సాధనతో జరుగుతుంది. రాజకీయాల్లో అనుభవజ్ఞులైన నేతలు ప్రజాస్వామ్య వ్యవస్థలో జరిగే ఇలాంటి ప్రక్రియలను వివేకవంతంగా అర్థం చేసుకుంటారు. ప్రతి దాన్నీ అనుమానాస్పద దృష్టితో చూడరు. చెన్నారెడ్డి లాంటి సీనియర్ నేత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైకోర్టు న్యాయమూర్తులు వ్యతిరేకంగా తీర్పు నిచ్చినా హైకోర్టు గురించి ఒక్క మాట కూడా నేతలను అననిచ్చేవారు కాదంటారు. ఎన్టీరామారావుపై కాంగ్రెస్ నేత ఒకరు అనేక ఆరోపణలు చేసి కేసు దాఖలు చేసినప్పుడు న్యాయవ్యవస్థ ప్రకటించిన తీర్పులను మరో కాంగ్రెస్ నేత ప్రభావితం చేశారనే ప్రచారం కూడా ఉన్నది. అయినా ఎన్టీఆర్ కానీ, తెలుగుదేశం నేతలు కానీ న్యాయవ్యవస్థ గురించి నిష్ఠూరంగా ఒక్క మాట కూడ మాట్లాడలేదు. కేసీఆర్ సర్కార్‌కు వ్యతిరేకంగా హైకోర్టు వ్యాఖ్యానించినా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు కాని ఏనాడూ దూషణకు పాల్పడలేదు. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో చెప్పవచ్చు. కానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి న్యాయవ్యవస్థ గురించి చేస్తున్న వీరంగం ఆయన అనుభవరాహిత్యానికి నిదర్శనంగా మారిందనడంలో సందేహం లేదు.


నిజానికి న్యాయస్థానాలు ఏ కేసుల గురించీ తమంతట తాము దర్యాప్తు చేయవు. సాక్ష్యాలను సేకరించడం కానీ, దర్యాప్తు చేయడం కానీ, ఛార్జిషీట్లు దాఖలు చేయడం కానీ చేసే సంస్థలు వేరుగా ఉంటాయి. తమకు సమర్పించిన సాక్ష్యాధారాల ఆధారంగానే కోర్టులు నిర్ధారణకు వస్తాయి. నిజంగా నేరాలకు పాల్పడకపోతే, సాక్ష్యాధారాల గురించి భయం లేకపోతే న్యాయస్థానాలు ఏవో చేస్తాయని ఆందోళన చెందడం దేనికి? తాము నేరస్థులమని, తప్పు చేశామని, ఏదో ఒకరోజు న్యాయస్థానం తమను దోషిగా తీర్మానించి శిక్ష విధిస్తుందని భయపడినప్పుడే ఒకరకమైన నిరాశా నిస్పృహలు ఆవరించి, తెగింపుతనం వస్తుంది. బహుశా అందువల్లనే జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై తీవ్రమైన ఆరోపణలకు దిగుతున్నారన్న అభిప్రాయం ఢిల్లీలోని న్యాయవర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎలాగూ జరిగేది ఆపలేము కనుక తమ దూకుడు ద్వారా జనంలో ఒక అభిప్రాయాన్ని కలిగించేందుకు ప్రయత్నించి రాజకీయ ప్రయోజనం పొందాలనే కాంక్ష ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది.


1968లో కేరళ ముఖ్యమంత్రి ఇఎంఎస్ నంబూద్రిపాద్ న్యాయమూర్తులు వర్గ, కుల ప్రయోజనాలతో వ్యవహరిస్తున్నారని, పేదల కంటే ధనికుల పక్షాన్నే ఉన్నారని వ్యాఖ్యానించినప్పుడు తీవ్రంగా దుమారం రేగింది. హైకోర్టు ఆయనకు కోర్టు ధిక్కారం కింద రూ. వేయి పెనాల్టీ లేదా నెల రోజుల జైలు శిక్ష విధిస్తే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిదయతుల్లా దాన్ని వారం రోజుల శిక్షకు లేదా రూ.50 పెనాల్టీకి తగ్గించారు. ప్రముఖ న్యాయవాది కృష్ణయ్యర్ నంబూద్రిపాద్ తరఫున వాదించినప్పటికీ, ఏ న్యాయమూర్తినైనా వ్యక్తిగతంగా ఇఎంఎస్ నిందించి ఉంటే దాన్ని తీవ్రంగా వ్యతిరేకించేవారమని అన్నారు. ‘న్యాయస్థానాలు, న్యాయపరిపాలనలో జోక్యం చేసుకున్న వారినే కాదు, తమ వ్యాఖ్యల వల్ల కొన్ని పరిణామాలకు దారితీసే వారిని కూడా శిక్షించాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు న్యాయమూర్తులు, న్యాయస్థానాల ప్రతిష్ఠను ప్రజల దృష్టిలో దిగజార్చాయఝని’ అని జస్టిస్ హిదయతుల్లా వ్యాఖ్యానించారు. దాదాపు యాభై ఏళ్ల తర్వాత నాడు నంబూద్రిపాద్ చేసిన వ్యాఖ్యల కంటే జగన్ చేసిన వ్యాఖ్యలు కొన్ని వందల రెట్లు తీవ్రమైనవి, నిర్దిష్టమైనవి మాత్రమే కాదు, మొత్తం న్యాయవ్యవస్థ పైనే చేసినవి. దీని పరిమాణాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.


భారతదేశంలో మాదిరి కాకుండా అమెరికాలో న్యాయమూర్తులను ఆ దేశ అధ్యక్షులే నియమిస్తారు. ఒక న్యాయమూర్తిని ‘ఒబామా న్యాయమూర్తి’గా ట్రంప్ అభివర్ణించారు. దీన్ని ప్రధాన న్యాయమూర్తి రాబర్ట్స్ వ్యతిరేకిస్తూ ‘మా దగ్గర ఒబామా న్యాయమూర్తులు కానీ, ట్రంప్ న్యాయమూర్తులు కానీ, బుష్ న్యాయమూర్తులు కానీ, క్లింటన్ న్యాయమూర్తులు కానీ ఉండరు. మా న్యాయమూర్తులందరూ తమ ముందు హాజరైన వారికి సమాన న్యాయం లభించేలా చూస్తారు..’ అని వ్యాఖ్యానించారు. ఈ సున్నితమైన విషయం మన రాజకీయనేతలు గమనించకపోవడం ఈ దేశంలో ప్రజాస్వామ్య పతనానికి నిదర్శనం.




ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2020-10-14T07:13:52+05:30 IST