కీలక తీర్పుపై సీఎం జగన్ అత్యవసర సమావేశం

ABN , First Publish Date - 2021-01-21T19:15:27+05:30 IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

కీలక తీర్పుపై సీఎం జగన్ అత్యవసర సమావేశం

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్‍లో అత్యవసర సమావేశం నిర్వహించారు. అందుబాటులో ఉన్న మంత్రులు, పార్టీ సీనియర్ నేతలతో సీఎం భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, పేర్ని నానిలతో పాటు సీనియర్ నేతలు హాజరయ్యారు. సమావేశంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు కీలక తీర్పుపై చర్చిస్తున్నారు. హైకోర్టు తీర్పుపై ఎలా ముందుకెళ్లాలి..? సుప్రీంకోర్టుకు వెళ్లాలా..? లేకుంటే షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలా..? అనేదానిపై నిశితంగా చర్చించి ఓ నిర్ణయానికి రానున్నారు. అత్యవసర సమావేశం ముగిశాక మంత్రి పేర్ని నాని లేదా కొడాలి నాని మీడియా మీట్ నిర్వహించి వివరాలు వెల్లడించనున్నట్లు సమాచారం.


ప్రతిపక్షాలు అలా.. అధికార పార్టీ ఇలా..!?

కాగా.. స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఏపీ హైకోర్టు కీలక తీర్పును వెల్లడించిన విషయం విదితమే. పంచాయతీ ఎన్నికలు కొనసాగించాలని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసిన ధర్మాసనం.. ప్రజారోగ్యం, ఎన్నికలు రెండూ ముఖ్యమేనని ఎవరికీ ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కీలక తీర్పుపై ఇప్పటికే ఒకరిద్దరు మంత్రులు స్పందిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పుకొచ్చారు. మరోవైపు.. బీజేపీ, టీడీపీ ప్రముఖ నేతలు మాత్రం ఈ తీర్పును స్వాగతించారు. ఇదిలా ఉంటే.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి స్పందిస్తూ.. హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేస్తామన్నారు. మేం ఆశించిన విధంగా హైకోర్టు తీర్పు లేదని.. ఉద్యోగుల్లో కరోనా భయం ఉందని వెల్లడించారు.

Updated Date - 2021-01-21T19:15:27+05:30 IST