ప్రతిపక్ష నాయకునిగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న క్రమంలో అన్ని వర్గాలకు ఆశలు కల్పించినట్లే, రాయలసీమ ప్రాంతంలోని ప్రజల కడగండ్లు తీరుస్తానని, వలసలు ఆపుతానని, ఉపాధి కల్పనకోసం పరిశ్రమలు తీసుకొస్తానని, సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేస్తానని ప్రమాణం చేసి ప్రజల్లో ఆశలు రేకెత్తించారు. మరోవైపు, తన షాడో మేధావుల బృందంతో సీమకు అన్యాయం జరిగిపోతున్నదనీ, జగన్ అధికారంలోకి రావడం ఒక్కటే అన్ని సమస్యలకు పరిష్కారమని అన్నట్టు చెప్పిస్తూ, రాయలసీమవాదం పేరుతో విశ్వవిద్యాలయాలే కేంద్రంగా సెంటిమెంటుని రాజేశారు.
ప్రజలు సైతం పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా చరిత్రలో మొదటిసారి సీమలోని 52 అసెంబ్లీ స్థానాలకు గాను, 49 స్థానాలను జగన్మోహన్ రెడ్డికి కట్టబెట్టారు. కానీ, ఆయన అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు కావస్తున్నా, నేటికీ ఒక్క సీమ ప్రాజెక్ట్ పూర్తి చేసిన పాపాన పోలేదు. కరువు సీమలో డ్రిప్ విధానం ద్వారా బతుకుతున్నవారికి రాయితీలతో కూడిన వ్యవసాయ పనిముట్లు సైతం అందించకపోవడంతో వ్యవసాయం పెనుభారం అయింది. 300 కి.మీ.ల కడప -బెంగళూరు రైల్వేలైన్ నిర్మాణాలకుగాను, కేంద్రం వేగంగా కదులుతూంటే, భూసేకరణలాంటి సహకారం రాష్ట్రం వైపునుండి అందించకుండా, కేవలం 70 కి.మీ.లకే పరిమితంచేసి రాయచోటి, పీలేరు ప్రజల రైలుకూత వినాలన్న చిరకాల స్వప్నానికి జగన్మోహన్ రెడ్డి చరమగీతం పాడారు. చివరకు నడికుడి -శ్రీకాళహస్తి రైల్వేలైన్ నిర్మాణం కొరకు కేంద్రం ఆర్ధిక సాయం అందిస్తున్నప్పటికి, అందుకోలేని స్థితిలో రాష్ట్రం వుంది. ఉన్న నీటి ప్రాజెక్టులను సైతం కాపాడుకోలేని అసమర్థస్థితి ప్రభుత్వానిది.
పింఛా, అన్నమయ్య డ్యాంలు రెండుసార్లు కొట్టుకుపోయాయి. ఇసుక బకాసురుల స్వార్ధం కారణంగా 33 మంది అమాయక రైతుల ప్రాణాలు వరదకు ఆహుతయ్యాయి. చేతికి వచ్చిన పంట, పశుసంపద కడలి పాలవ్వగా పేదలు నిరాశ్రయులయ్యారు. మూడు నెలల్లో ఇళ్ళు నిర్మించి తాళాల గుత్తి చేతిలో పెడతానని బాధితులకు సీఎం ఇచ్చిన హామీ నెరవేరలేదు. సొంత జిల్లాలో తన అనుచరుల స్వార్ధం కారణంగా చనిపోయినటువంటి కుటుంబాలకు కేవలం ఐదు లక్షలు చెల్లించి చేతులు దులుపుకున్నారు. మరోచేత్తో విశాఖ పరిశ్రమ మృతులకు కోటి రూపాయలు ఇచ్చి మనసున్న మహారాజుగా చాటుకున్నారు. మేట వేసిన పంట పొలాలు సాగులోకి తెచ్చే ప్రయత్నం గాని, సీమ ప్రాజెక్టులకోసం బడ్జెట్లో కేటాయింపులు చేయకపోవడం గాని దేనికి సంకేతం? రాయలసీమ మేధావులు ఈ అన్యాయాలను ప్రశ్నించడం లేదేమి? అందుకే, పెనునిద్దరలో ఉన్న జగన్ ప్రభుత్వాన్ని నిద్రలేపడానికి భారతీయ జనతాపార్టీ నేడు కడపలో ‘రాయలసీమ రణభేరి’ మ్రోగించనుంది.
– నాగోతు రమేష్ నాయుడు
బీజేపీ రాష్ట్ర కార్యదర్శి