‘ట్యాబ్‌’లు సెప్టెంబరులో! 8వ తరగతి నుంచి 10 వరకు అవే!

ABN , First Publish Date - 2022-06-29T20:15:09+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులకు వచ్చే సెప్టెంబరులో ట్యాబ్‌లు ఇస్తామని సీఎం జగన్‌ చెప్పారు. తరగతి గదుల్లో డిజిటల్‌ బోర్డులు..

‘ట్యాబ్‌’లు సెప్టెంబరులో! 8వ తరగతి నుంచి 10 వరకు అవే!

తరగతి గదుల్లో డిజిటల్‌ బోర్డులు, టీవీలు 

విద్యాశాఖపై సమీక్షలో సీఎం జగన్‌ వెల్లడి


అమరావతి, జూన్‌ 28(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులకు వచ్చే సెప్టెంబరులో ట్యాబ్‌లు ఇస్తామని సీఎం జగన్‌ చెప్పారు. తరగతి గదుల్లో డిజిటల్‌ బోర్డులు, టీవీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ’నాడు-నేడు’ కార్యక్రమంలో పాఠశాలల అభివృద్ధి, డిజిటల్‌ లెర్నింగ్‌పై మంగళవారం క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు, తరగతి గదుల్లో డిజిటల్‌ స్ర్కీన్ల ఏర్పాటు వంటి వాటిపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. విద్యార్థులకు అందించే ట్యాబ్‌లో బైజూస్‌ కంటెంట్‌ను అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. దానికి తగినట్టుగానే ట్యాబ్‌ స్పెసిఫికేషన్స్‌, ఫీచర్లు ఉండాలన్నారు.  టెండర్లు పిలిచేప్పుడే ట్యాబ్‌ల నాణ్యత, డ్యూరబిలిటీని దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. 


8వ తరగతిలో ఇచ్చిన ట్యాబ్‌ 9, 10 తరగతుల్లో కూడా ఉపయోగపడాలని చెప్పారు. ట్యాబ్‌ల నిర్వహణ కూడా ముఖ్యమని, మంచి కంపెనీలను పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. తరగతి గదిలో డిజిటల్‌ బోర్డులు, టీవీల ఏర్పాటుతో సైన్స్‌, గణితం వంటి సబ్జెక్టులు పిల్లలకు సులువుగా అర్థమవుతాయన్నారు. ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యం కూడా పెరుగుతుందని చెప్పారు. విద్యా నిపుణుల సలహా మేరకు కొన్ని తరగతుల్లో ఇంటరాక్టివ్‌, మరికొన్ని తరగతులకు టీవీ స్ర్కీన్లు పెట్టేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు అధికారులు చెప్పారు. డిజిటల్‌ స్ర్కీన్లు, ప్యానెళ్ల భద్రతపైనా దృష్టి పెట్టాలన్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ, పాఠశాల విద్య స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ బుడితి రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-29T20:15:09+05:30 IST