కేఆర్ఎంబీ పరిధిని నోటిఫై చేయండి: జగన్‌

ABN , First Publish Date - 2021-07-07T23:12:04+05:30 IST

కృష్ణా నదీ జలాల వివాదంపై ప్రధాని మోడీకి సీఎం జగన్ మరో లేఖ రాసారు. కేఆర్ఎంబీ పరిధిని వెంటనే నోటిఫై చేయాలని

కేఆర్ఎంబీ పరిధిని నోటిఫై చేయండి:  జగన్‌

అమరావతి: కృష్ణా నదీ జలాల  వివాదంపై ప్రధాని మోడీకి సీఎం జగన్ మరో లేఖ రాసారు. కేఆర్ఎంబీ పరిధిని వెంటనే నోటిఫై చేయాలని జగన్‌ కోరారు. రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టులకు సంబంధించిన అధికారులను కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకురావాలని విజ్జప్తి చేశారు. ఇరిగేషన్, విద్యుత్, తాగునీరు, ఉమ్మడి రిజర్వాయర్లకు చెందిన అధికారులను కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకురావాలన్నారు. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం 2014ను అనుసరించి నిర్వహణ చేపట్టాలని ప్రధానికి రాసిన లేఖలో జగన్‌ కోరారు. న్యాయబద్ధమైన వాటా వినియోగంపై ఆదేశాలు ఇవ్వాలన్నారు. కృష్ణా నదిలోని కామన్ రిజర్వాయర్లలో నిబంధనల్ని తెలంగాణ ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని జగన్‌ ఆరోపించారు. పునర్‌విభజన చట్టాన్ని తెలంగాణ గౌరవించడం లేదన్నారు.  


పదేపదే జలశక్తి శాఖ, కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసినా వివాదాలు పరిష్కారం కావటం లేదని జగన్‌ లేఖలో పేర్కొన్నారు. ప్రాజెక్టుల్లోని నీటిని తెలంగాణ వాడేస్తోందని, తక్షణం ఆపాలని కోరారు. తెలంగాణ అక్రమంగా నీటిని వాడటం వల్ల ఏపీ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయన్నారు. ప్రాజెక్టుల్లో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తుండటం వల్ల నీటిని వృథాగా సముద్రంలోకి వదలాల్సి వస్తోందన్నారు. శ్రీశైలంలో 834 అడుగులలోపు నీటిని ఏపీ వినియోగించుకోలేదని తెలిసి తెలంగాణ విద్యుత్‌ను ఉత్పత్తి చేయటం దారుణమన్నారు. జూన్ 1 నుంచి 26 టీఎంసీల నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తే 19 టీఎంసీల నీటిని విద్యుత్ ఉత్పత్తికి వాడేశారని సీఎం జగన్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. 


Updated Date - 2021-07-07T23:12:04+05:30 IST