CM KCR: పరామర్శల్లేవ్.. పలకరింపుల్లేవ్.. ఎన్ని విమర్శలొస్తున్నా సీఎం కేసీఆర్ ఎందుకో ఇలా..!

ABN , First Publish Date - 2022-09-02T14:54:26+05:30 IST

‘‘ తెలంగాణ ప్రజల కాలికి ముళ్లు గుచ్చితే పంటితో తీస్తా’’.. ‘‘నా కంఠంలో ప్రాణం ఉన్నంత వ‌ర‌కు తెలంగాణని ఆగం కానివ్వ‌ను’’.. తెలంగాణ(Telangana) సమాజం సాక్షిగా పలు వేదికలపై ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) చేసిన గర్జనలివీ.

CM KCR: పరామర్శల్లేవ్.. పలకరింపుల్లేవ్.. ఎన్ని విమర్శలొస్తున్నా సీఎం కేసీఆర్ ఎందుకో ఇలా..!

హైదరాబాద్: ‘‘ తెలంగాణ ప్రజల కాలికి ముళ్లు గుచ్చితే పంటితో తీస్తా’’.. ‘‘నా కంఠంలో ప్రాణం ఉన్నంత వ‌ర‌కు తెలంగాణని ఆగం కానివ్వ‌ను’’.. తెలంగాణ(Telangana) సమాజం సాక్షిగా పలు వేదికలపై ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) చేసిన గర్జనలివీ. జనాల కష్టనష్టాల్లో అండగా నిలబడతానని.. సాధకబాధకాల్లో తోడుగా నిలుస్తానంటూ మాటిచ్చారాయన. ప్రజలు కూడా కేసీఆర్ నుంచి ఆశించింది ఇలాంటి భరోసానే. రెండుసార్లు అధికార పీఠాన్ని ఎక్కించిందీ అందుకే. కానీ పలు సందర్భాల్లో కేసీఆర్ స్పందించిన రీతి మానవీయ కోణాన్ని ప్రశ్నిస్తోంది. కొన్ని జనగోసలు ఆయన హృదయాన్ని చలించపజేయవా ?.. రోదనలన్నీ ఆయన చెవిచేరవా ?.  ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ విషాద ఘటన నేపథ్యంలో కేసీఆర్ వైఖరి చుట్టూ ఉత్పన్నమవుతున్న ప్రశ్నలివీ. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు చనిపోయిన ఘటన అందరినీ కదిలించింది. అందరినోటా అయ్యోపాపం అనిపించింది. ఇంతటి విషాద ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం ఒక వ్యవస్థగా స్పందించేతప్ప.. మేమున్నామంటూ ఇబ్రహీంపట్నం దవాఖానా, లేదా బాధితుల స్వస్థలాలకు ప్రభుత్వపెద్దలు ఎవరూ వెళ్లలేదు. మరీ ముఖ్యంగా ప్రభుత్వ పెద్ద ప్రత్యక్షంగా ఎందుకు స్పందించడం లేదు? అనే సీరియస్ ప్రశ్న ఒకటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎదురవుతోంది. వాస్తవానికి విపక్ష నేతలు చేస్తున్న ఈ విమర్శలను కొట్టిపారేయడానికి వీల్లేదు. టెస్టులు చేయకుండా, ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోకుండా, ఆపరేషన్లు చేసి గదిలో నిర్లక్ష్యంగా కింద పడుకోబెట్టడం దాచేస్తే దాగే సత్యమా?. అమాయక మహిళలు నలుగురు చనిపోవడం అంత తేలికైనా విషయమా?. అయినా సీఎం కేసీఆర్‌కు ఈ ఘటన సీరియస్‌ అంశంగా అనిపించలేదా అనే విపక్ష పార్టీల ప్రశ్నల్లో అర్థం, ఆవేదన ఉన్నాయి. .






దేశంలో మీడియాతో ఎక్కువసేపు మాట్లాడగలిగే ముఖ్యమంత్రుల్లో కేసీఆర్ ఒకరనడంలో సందేహం లేదు. ప్రెస్‌మీట్లు పెట్టి మరీ మాట్లాడిన అంశాలు చాలానే ఉన్నాయి. కానీ చాలా సీరియస్ అంశమైన ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించిన ఘటనపై సీఎం ఇంతవరకు నోరు మెదపలేదు. ప్రత్యక్షంగా స్పందించలేదు. చనిపోయినవారంతా పేదింటి మహిళలే... తల్లులను కోల్పోయి పిల్లలు కన్నీళ్లు రాలుస్తున్న స్పందించేందుకు మనసురావడం లేదా అంటూ సీఎం వైఖరిపై  ప్రతిపక్ష పార్టీలు విమర్శణాస్త్రాలు సంధిస్తున్నాయి. ఇంతటి విషాద ఘటనపై స్పందించలేదు కానీ పొరుగు రాష్ట్రాల్లో తన రాజకీయ ప్రాబల్యం కోసం పాకులాడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రజల సొమ్ముతో వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇబ్రహీంపట్నం బాధితులను పరామర్శించకుండా సీఎం కేసీఆర్ బిహార్‌ పర్యటనకు వెళ్లడాన్ని ప్రశ్నిస్తున్నారు. గాల్వాన్ అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడాన్ని ఎవరూ తప్పుబట్టడం లేదు. అయితే రాష్ట్రంలో జరిగిన విషాద ఘటనపై  కనీసం సమీక్ష కూడా చేపట్టరా అని నిలదీస్తున్నారు. ముఖ్యమంత్రి అయ్యుండి  కనీసం స్పందించకపోవడం దారుణమని విపక్షనేతలు మండిపడుతున్నారు. వాస్తవానికి ఇబ్రహీంపట్నం ఘటనలో  ఎక్స్‌గ్రేసియా ప్రకటన, తాత్కాలికంగా ఆపరేషన్ల నిలిపివేత, డాక్టర్లపై లైసెన్స్ రద్దు వేటు వంటి చర్యలను ప్రభుత్వం ప్రకటించింది. కొంతమంది బాధిత మహిళలకు నిమ్స్‌లో మెరుగైన వైద్యం అందించారు. వాళ్లని మంత్రి హరీష్ రావు పరామర్శించారు. అయితే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి స్వయంగా స్పందించి ఉంటే సముచితంగా ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతమవ్వకుండా హెచ్చరించినట్టు మాత్రమే కాకుండా.. కఠిన చర్యలు ఉంటాయనే సంకేతాలు ఇచ్చినట్టు ఉండేదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా బాధిత కుటుంబాలకు బాసటగా నిలిచినట్టు ఉండేదని, బాధితులు ఆ మాత్రం సాంత్వన కోరుకోవడంలో అర్థం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.



కాగా ఇలాంటి విమర్శణాత్మక వైఖరిని అవలంభించడం సీఎం కేసీఆర్‌కు ఇదేమీ మొదటిసారి కాదు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనలను పెడచెవిన పెడుతున్నారని ప్రతిపక్షాలు గగ్గోలుపెడుతున్నాయి. మంత్రులు రంగంలోకి దిగినా విద్యార్థుల డిమాండ్లు నెరవేరలేదు. పలుమార్లు విద్యార్థులు రోడ్లెక్కారు. అయినా సీఎం ఒక్కసారి కూడా స్పందించకపోవడంపై విపక్షనేతలు ఫైర్ అవుతున్నారు.  గవర్నర్ తమిళసై త్రిపుల్ ఐటీని సందర్శించి విద్యార్థులను పరామర్శించారు. మరీ ఆ బాధ్యత సీఎంకు లేదా  విమర్శిస్తున్నారు. ఇలాంటి మరో ముఖ్యమైన ఘటనే కొండగట్టు బస్సు ప్రమాద విషాదం.సెప్టెంబర్ 11, 2018న జరిగిన ఈ దుర్ఘటనలో ఏకంగా 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం ఎక్స్‌గ్రేసియా ప్రకటించింది. క్షతగాత్రులకు వైద్యసాయం అందించారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంతపెద్ద ప్రమాదం జరిగిన ఘటనా స్థలిని కానీ, బాధితులను కానీ సందర్శించలేదు.ఇలాంటి పలు ఘటనలు కేసీఆర్‌ను వేలెత్తిచూపుతున్నాయి. ఇదేం వైఖరి అనే ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. అటు రాజకీయం, ఇటు మానవీయ కోణంలోనూ విమర్శలపాలవుతున్న ఈ వైఖరి విడనాడాలని సామాజిక, రాజకీయ నిపుణులు హితబోధ చేస్తున్నారు.


పి. సుదర్శన్ రావు

Updated Date - 2022-09-02T14:54:26+05:30 IST