దళిత బంధుపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2021-10-05T21:32:51+05:30 IST

హైదరాబాద్: హుజురాబాద్‌ కోసం దళిత బంధు పెట్టలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.

దళిత బంధుపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఏమన్నారంటే..

హైదరాబాద్: హుజురాబాద్‌ కోసం దళిత బంధు పెట్టలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మంగళవారం దళిత బంధు పథకంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రతిపక్షాలు రాజకీయ కోణంలోనే మాట్లాడుతున్నాయని అన్నారు. దళితులు దయనీయ స్థితిలో ఉన్నారని, దేశమంతా ఇదే పరిస్థితి ఉందన్నారు. అణచివేయబడ్డ వారికి సాధికారత రావట్లేదన్నారు. దళిత వర్గాలకు అంబేద్కర్ చేయాల్సిందంతా చేశారని, అంబేద్కర్ ఆలోచన సరళి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు వస్తోందన్నారు. దళితుల గురించి కాంగ్రెస్ ఏం చేయలేదని అనలేమని, వారు చేసేది చేశారని, అయితే అనుకున్నంత జరగలేదనేది తమ వాదన అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.


ముందు ముందు కూడా తామే అధికారంలోకి వస్తామని సీఎం కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చేది లేదు.. సచ్చేది లేదన్నారు. ఎన్నికలు వస్తే తమకు అంచనాలు ఉండవా?.. తమది రాజకీయ పార్టీ కాదా? అని ప్రశ్నించారు. కేంద్రం గుర్తించి.. దళితుల రిజర్వేషన్ శాతం పెంచాలన్నారు. బీసీల కులగణన కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేయదని సీఎం నిలదీశారు. సుప్రీంకోర్టులో కులగణన చేయమని కేంద్రం అఫిడవిట్ ఎందుకు వేసిందన్నారు. వర్గీకరణ చేయాలని ఇప్పటికే ప్రధాని మోదీకి చాలా సార్లు చెప్పానన్నారు. 


మార్చిలోపే రాష్ట్రంలోని ఒక్కో నియోజకవర్గంలో 100 మందికి దళిత బంధు అందజేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక ఎమ్మెల్యేలకే అప్పగిస్తున్నామన్నారు. వచ్చే మార్చిలో రూ. 20 వేల కోట్లు బడ్జెట్‌లో పెడతామన్నారు. రూ.10 లక్షలు లబ్ధిదారుల ఇష్టమని, నిబంధనలు లేవని, ఎక్కడైనా వ్యాపారం పెట్టుకోవచ్చునని, తమకెలాంటి అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలో భూముల ధరలు పెరిగిపోయాయన్నారు. ఎకరం భూమి రూ.20 లక్షలకు తక్కువ ఎక్కడ దొరకడం లేదన్నారు.


ఇప్పటికీ దళితజాతి అట్టడుగుస్థాయిలోనే ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. మన దేశంలోని సామాజిక వివక్ష వల్లే ఈ పరిస్థితి నెలకొందన్నారు. దళిత జాతి అవకాశాలు లేక సతమతం అవుతోందన్నారు. వివక్ష జరుగుతోందని, ఈ తప్పులను మనమే సవరించుకోవాలన్నారు. ఏడాది కిందటే దళితబంధు పథకం ప్రారంభం కావాల్సిందని, అయితే కరోనా వల్లే ఆలస్యమైందన్నారు. దళితబంధుపై అఖిలపక్షం సమావేశం పెట్టి చర్చించామన్నారు. ఆచరణలో వచ్చే ఇబ్బందులను అధిగమిస్తామని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.


ఈ సందర్బంగా బీజేపీపై సీఎం కేసీఆర్ సెటైర్లు వేశారు. వర్గీకరణ చేయాలని ఇప్పటికే ప్రధానికి చాలాసార్లు చెప్పానన్నారు. కేంద్రంలో ఉన్నారు కదా.. వర్గీకరణ చేసి తీసుకువస్తే.. బేగంపేట నుంచి పెద్ద పెద్ద దండలు వేసి స్వాగతం పలుకుతామన్నారు. ఎమ్మెల్యే రఘునందన్‌రావు యువకుడని, మంచి భవిష్యత్ ఉందన్నారు. ఇంత పెద్ద స్కీమ్‌పై మాట్లాడే ముందు ఆలోచన ఉండాలి కదా అని అన్నారు. ఏదో ఒకటి అనాలనుకునే మాటలు ఇకనైనా మానుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు.

Updated Date - 2021-10-05T21:32:51+05:30 IST