ఇది తెలంగాణ మట్టి మనిషికి దక్కిన గౌరవం: కేసీఆర్

ABN , First Publish Date - 2021-12-30T22:34:08+05:30 IST

గోరెటి వెంకన్నకు లభించిన ‘కేంద్ర సాహిత్య అకాడమీ

ఇది తెలంగాణ మట్టి మనిషికి దక్కిన గౌరవం: కేసీఆర్

 హైదరాబాద్: గోరెటి వెంకన్నకు లభించిన ‘కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును తెలంగాణ మట్టి మనిషికి దక్కిన గౌరవంగా సీఎం కేసీఆర్ అభివర్ణించారు. ప్రముఖ కవి, జానపద గాయకుడు, వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ సభ్యుడు గోరెటి వెంకన్నకు ప్రతిష్టాత్మక ‘కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు – 2021’  దక్కడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ‘వల్లంకి తాళం’అనే కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు దక్కడం గొప్ప విషయమన్నారు. గోరెటి వెంకన్నకు ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు.


దైనందిన జీవితంలోని ప్రజా సమస్యలను సామాజిక తాత్వికతతో కండ్లకు కడుతూ వెంకన్న అందించిన  సాహిత్యం ప్రపంచ మానవుని వేదనకు అద్దం పడుతుందని సీఎం అన్నారు. మానవ జీవితానికి, ప్రకృతికి వున్న అవినాభావ సంబంధాన్ని... మనిషికి, ఇతర జంతు పక్షి జీవాలకు ఉన్న అనుబంధాన్ని గోరెటి అత్యున్నతంగా ఆవిష్కరించారని సీఎం కొనియాడారు.

తెలంగాణ మట్టి వాసనలను తన సాహిత్యం ద్వారా వెంకన్న విశ్వవ్యాపితం చేశారని సిఎం అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కవిగా తన  సాహిత్యం ద్వారా గొప్ప పాత్ర పోషించారని తెలిపారు. గోరెటి సాహిత్యానికి దక్కిన ప్రతిష్టాత్మక సాహితీ గౌరవం, తెలంగాణ మట్టి మనిషి జీవనతాత్వికకు దక్కిన గౌరవంగా సిఎం పేర్కొన్నారు.

Updated Date - 2021-12-30T22:34:08+05:30 IST