CM KCR: ఆర్టీసీని అమ్మితే వెయ్యికోట్లు ఇస్తామంటున్నారు...

ABN , First Publish Date - 2022-09-12T20:27:06+05:30 IST

ఆర్టీసీ (RTC)ని అమ్మేయాలని కేంద్రం సూచనలు చేస్తోందని సీఎం కేసీఆర్ తెలిపారు.

CM KCR: ఆర్టీసీని అమ్మితే వెయ్యికోట్లు ఇస్తామంటున్నారు...

హైదరాబాద్ (Hyderabad): ఆర్టీసీ (RTC)ని అమ్మేయాలని కేంద్రం సూచనలు చేస్తోందని, ఆర్టీసీని అమ్మితే వెయ్యికోట్లు బహుమతి ఇస్తామంటున్నారని సీఎం కేసీఆర్ (CM KCR) తెలిపారు. సోమవారం అసెంబ్లీలో(Assembly) కేంద్ర విద్యుత్ బిల్లుపై(Electricity bill) స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్న మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఇతర ఖర్చులు తగ్గించుకుని ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. కేంద్రం అన్నింటినీ అమ్మేస్తోందని, వ్యవసాయం, విద్యుత్ మాత్రమే మిగిలాయని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ధాన్యం ఎక్కడైనా అమ్ముకోవచ్చని కేంద్రం మాయ మాటలు చెబుతోందని, రైతులు వ్యవసాయం చేయలేమంటే.. కార్పొరేట్ కంపెనీలను రంగంలోకి దించాలని కేంద్రం ఆలోచన చేస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు.


కేంద్రం ముందుచూపు లేకుండా వ్యవహరిస్తోందని, కేంద్రం తీరుతో ఆహార భద్రత ప్రమాదంలో పడిందని సీఎం కేసీఆర్ అన్నారు. ధాన్యం కొనాలని అడిగితే కేంద్రమంత్రి అవహేళన చేశారని, కేంద్రంతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇంకా బీజేపీ సర్కార్‌కు మిగిలింది రెండేళ్లేనని ముఖ్యమంత్రి అన్నారు. బీజేపీ దేశంలో ఏకపార్టీ విధానం తేవాలనుకుంటోందన్నారు. అన్ని పార్టీలను రద్దు చేస్తారా? చేయండి చూద్దామన్నారు. బీజేపీకి 50 శాతం ఓట్లు కూడా రాలేదని, 36 శాతం ఓట్లతోనే దేశాన్ని పాలిస్తుందని విమర్శించారు. అహంకారం నెత్తికెక్కి మాట్లాడితే దేవుడు కూడా కాపాడలేడన్నారు. బీజేపీని చూసి ప్రజాస్వామ్య, లౌకికవాదులు బాధపడుతున్నారని, 11 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను బీజేపీ కూల్చేసిందని ఆరోపించారు. తెలంగాణలోనూ ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటున్నారు.. అంటే బీజేకీకి పోయేకాలం దగ్గర పడిందని అర్థమన్నారు. ఎంతటి నియంతలైనా ఏదో ఒకరోజు ఇంటికి వెళ్లాల్సిందేనన్నారు. బీజేపీ ‘మేకిన్ ఇండియా’ అని ప్రజలను మోసం చేస్తోందని, అన్నీ చైనా నుంచి తెస్తూ ‘మేకిన్ ఇండియా’ అంటున్నారని విమర్శించారు.


ప్రధానమంత్రి నరేంద్రమోదీ విద్యుత్ సంస్కరణలు ఉపసంహరించుకోవాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. పేదలు, పేద రైతుల పాలిట మరణశాసనం వంటిదని విరుచుకుపడ్డారు. అన్నింటినీ అమ్మేస్తున్న కేంద్రం.. విద్యుత్ రంగాన్ని కూడా ప్రైవేటీకరించే కుట్ర చేస్తోందన్నారు. రైతులు బాగుపడుతుంటే కేంద్రం ఓర్వలేకపోతోందని, దేశ ప్రజలను ఇంకెన్ని రోజులు మోసం చేస్తారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.


ఏపీ బకాయిలు ఉందని చెబుతుంటే కేంద్రం పట్టించుకోవడం లేదని, ఏపీ నుంచి తెలంగాణకు రూ.17,828 కోట్లు రావాల్సి ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ఏపీ నుంచి బకాయిలు ఇప్పించమంటే కేంద్రం ముఖం చాటేస్తోందన్నారు. కృష్ణపట్నంలో కూడా తెలంగాణకు వాటా ఉందని తెలిపారు. వాటిని ఏపీ నుంచి ఇప్పించమంటే.. కేంద్రం ఇప్పించడంలేదన్నారు. అయినోళ్లకు ఆకుల్లో.. కానోళ్లకు కంచాల్లో పెట్టడమే కేంద్రం విధానమా? అని ప్రశ్నించారు. తాను చెప్పేది అబద్ధం అయితే.. వెంటనే రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. కేంద్రానికి దేశంలో ఉచిత కరెంట్ ఇచ్చే తెలివి లేదు కానీ.. ఉచిత కరెంట్ ఇచ్చే తెలంగాణపై పడి ఏడుస్తోందని మండిపడ్డారు.


బిహార్‌కు ఓ దరిద్రుడు బీమారి స్టేట్ అని పేరు పెట్టారని, అక్కడ పవర్ ప్రాజెక్టులు వస్తే.. బిహార్ అద్భత స్టేట్‌గా మారుతుందని సీఎం కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్రం విధానాలతో తెలంగాణ రూ. 25 వేల కోట్లు నష్టపోతుందన్నారు. విద్యుత్ మీటర్లు పెట్టాల్సిందేనని కేంద్రం అనడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఆర్ఈసీ లోన్‌లు ఆపాలని కొత్త కండీషన్ పెడుతున్నారని, దీనిపై కోర్టుకు వెళ్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.


రూ.4 వేలకు టన్ను దొరికే బొగ్గును.. రూ.30 వేలకు కొనమని చెప్పడమే కేంద్ర విద్యుత్ సంస్కరణ? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. విశ్వగురు అంటే పేదలకు సహాయం చేయాలి.. కానీ వచ్చేది అడ్డుకోవడం కాదన్నారు. కేంద్రం పిట్ట బెదిరింపులకు తెలంగాణ భయపడదన్నారు. బీజేపీ సర్కార్ శాశ్వతం కాదని.. 18 నెలల్లో సాగనంపుతామన్నారు. విద్యుత్ సంస్కరణ బిల్లులు వెనక్కి తీసుకోవాలని సభా ముఖంగా డిమాండ్ చేశారు. ఇకనైనా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ కేంద్రానికి సూచించారు.

Updated Date - 2022-09-12T20:27:06+05:30 IST