ప్రధాని మోదీ అడ్డాలో CM KCR ఫ్లెక్సీలు

ABN , First Publish Date - 2022-03-03T18:00:07+05:30 IST

భారత ప్రధాని నరేంద్ర మోదీ అడ్డా అయిన వారణాసిలో తెలంగాణ సీఎం కేసీఆర్ పేరిట పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి..

ప్రధాని మోదీ అడ్డాలో CM KCR ఫ్లెక్సీలు

న్యూ ఢిల్లీ : భారత ప్రధాని నరేంద్ర మోదీ అడ్డా అయిన వారణాసిలో తెలంగాణ సీఎం కేసీఆర్ పేరిట పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి. మోదీ నియోజకవర్గమైన వారణాసిలో రేపు (శుక్రవారం నాడు) బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ ప్రచారం చేయబోతున్నారు. ఈ క్రమంలో కేసీఆర్‌కు ఘన స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. తెలంగాణ మ్యాప్, ప్రభుత్వ పథకాలను హైలెట్ చేస్తూ ఉన్న ఈ ఫ్లెక్సీలో కేసీఆర్ ప్రధానంగా కనిపిస్తున్నారు. ఈ ఫ్లెక్సీలో ఇంకా మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌తో పాటు మరికొందరు ఉన్నారు. ఇక జాతీయస్థాయి నాయకుల విషయానికొస్తే.. ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, స్టాలిన్, ఉద్ధవ్ థాక్రే, నవీన్ పట్నాయక్‌తో పాటు కీలకనేతలైన దేవెగౌడ, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, శరద్ పవార్.. నటుడు ప్రకాష్ రాజ్ ఉన్నారు. ‘ఉత్తరప్రదేశ్‌కు విచ్చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ జీ.. కి స్వాగతం’ అని ఫ్లెక్సీపై రాసి ఉంది.


సోషల్ మీడియాలో వైరల్..

ఈ ఫ్లెక్సీ రోడ్డుపై కొత్తగా కనిపించడంతో ఏంటబ్బా ఇది అని.. వాహనదారులు, జనాలు తథేకంగా చూడసాగారు. ఇక సోషల్ మీడియాలో అయితే మోదీకి వ్యతిరేకిస్తున్న పార్టీలకు చెందిన వ్యక్తులు, నెటిజన్లు దీన్ని పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. ఇక టీఆర్ఎస్ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు అయితే ఓ రేంజ్‌లో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తమ అభిమానం చాటుకుంటున్నారు. మొత్తానికి చూస్తే.. కేసీఆర్ ఫ్లెక్సీ ఫొటోలు మాత్రం ఇలా వైరల్ అవుతున్నాయి. 


ఇదీ అసలు విషయం.. 

నరేంద్రమోదీపై రాజకీయ యుద్ధం ప్రకటించిన తర్వాత కేసీఆర్ ఢిల్లీలో మకాం వేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఫెడరల్ ఫ్రంట్ చర్చలు ముమ్మరం చేసిన గులాబీ దళపతి యూపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. కాగా.. వాస్తవానికి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేస్తామంటూ గతంలో సీఎం కేసీఆర్‌తో పాటు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంకేతాలిచ్చారు. అయితే.. వారణాసి లోక్‌సభ స్థానం పరిధిలో ఈ నెల 7న ఏడో విడత యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రేపట్నుంచి ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, మమత బెనర్జీ.. ఎన్సీపీ నేత శరద్ పవర్ వెళ్లనున్నారు. వీరితో పాటు కేసీఆర్ కూడా వారణాసి ఎన్నికల ప్రచారానికి వెళ్తారు.

Updated Date - 2022-03-03T18:00:07+05:30 IST