TS News: హైదరాబాద్‌లో అల్లర్లు సృష్టించేందుకు కేసీఆర్‌ కుట్ర: బండి సంజయ్‌

ABN , First Publish Date - 2022-08-25T01:16:12+05:30 IST

సీఎం కేసీఆర్‌ (CM KCR) డైరెక్షన్‌లో మరో రెండురోజుల్లో హైదరాబాద్‌ (Hyderabad)లో మత ఘర్షణలు సృష్టించడానికి కుట్ర

TS News: హైదరాబాద్‌లో అల్లర్లు సృష్టించేందుకు కేసీఆర్‌ కుట్ర: బండి సంజయ్‌

కరీంనగర్‌: సీఎం కేసీఆర్‌ (CM KCR) డైరెక్షన్‌లో మరో రెండురోజుల్లో హైదరాబాద్‌ (Hyderabad)లో మత ఘర్షణలు సృష్టించడానికి కుట్ర జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi Sanjay) తెలిపారు. లిక్కర్‌ స్కామ్‌లో తన కుమార్తె ఎమ్మెల్సీ కవిత పాత్రపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుండడంతో ఆ చర్చను దారి మళ్లించేందుకు కేసీఆర్‌ ఈ కుట్రకు తెరదీశారని ఆరోపించారు. బుధవారం కరీంనగర్‌ (Karimnagar)లోని ఆయన నివాసంలో అక్రమ అరెస్టులు, అరాచకదాడులు, నిరంకుశ నిర్బంధాలపై  బండి సంజయ్‌ నిరసన దీక్ష చేపట్టారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 27న హన్మకొండ ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో నిర్వహించతలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడత ముగింపు బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతున్నారని, ఈ సభకు భారీ ఎత్తున జనం తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్‌ డైరెక్షన్‌లో ప్రజా సంగ్రామయాత్రను ఏ విధంగా అడ్డుకున్నారో ప్రజలు చూశారని, దీనికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసన దీక్షలు విజయవంతమయ్యాయని అన్నారు. ప్రజాసంగ్రామ యాత్రను ఏదో ఒక సాకుతో ఆపాలని కుట్ర చేశారని, కొన్ని చోట్ల తమపై దాడులు చేశారని, అయినా భరించామే తప్ప ఎక్కడ కూడా రెచ్చగొట్టే వాఖ్యలు చేయలేదని సంజయ్‌ అన్నారు. రాష్ట్ర ప్రజలను కలిసి వారి బాధలు తెలుసుకొని భరోసా ఇవ్వాల్సిన సీఎం కేసీఆర్‌ ఫాంహౌస్‌, ప్రగతిభవన్‌లో సేద తీరుతున్నారని బండి సంజయ్‌  విమర్శించారు.

Updated Date - 2022-08-25T01:16:12+05:30 IST