కేసీఆర్‌ మౌనం వెనుక!

Published: Thu, 09 Jun 2022 02:37:29 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కేసీఆర్‌ మౌనం వెనుక!

రాష్ట్రపతి ఎన్నికకు వ్యూహమేంటి?

తటస్థమా? కూటమి కడతారా?

ఉమ్మడి అభ్యర్థిని దింపే ప్రయత్నమా?

టీఆర్‌ఎస్‌ చీఫ్‌ మౌనంపై సందేహాలు

మొన్నటివరకు హడావుడి పర్యటనలు

ఇప్పుడు మౌనం దాల్చిన కేసీఆర్‌

చెబుతానన్న సంచలన వార్త ఏమిటి?

రాజకీయ వర్గాల్లో సర్వత్రా చర్చ


హైదరాబాద్‌, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): దేశంలోని పలు రాష్ట్రాల్లో హడావుడి పర్యటనలు చేశారు. ముఖ్యమంత్రులను, మాజీ ముఖ్యమంత్రులను కలిశారు. రెండు మూడు నెలల్లో సంచలన వార్త వింటారంటూ గంభీర ప్రకటన చేశారు. చివరికి రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్న తరుణంలో మౌనం దాల్చారు. పర్యటనలతో హడావుడి సీఎం కేసీఆర్‌ ఇలా ఒక్కసారిగా సైలెంట్‌ కావడంతో.. ఆయన ఏం చేయబోతున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే దిశగా పావులు కదుపుతున్నారా? అందుకు అవసరమైన సమాచారాన్ని సేకరిస్తున్నారా? దేశంలోని విపక్ష నేతలతో ఫోన్లలో సంభాషిస్తున్నారా? మళ్లీ బయటకు వచ్చి హడావుడి చేస్తారా? ఇంతటితోనే ఆగిపోతారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


జూలై 25తో రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ పదవీకాలం ముగియనుండడంతో ఈ లోపు రాష్ట్రపతి పదవికి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే అధికార టీఆర్‌ఎస్‌, ఇతర పార్టీల్లో రాష్ట్రపతి ఎన్నికలపై చర్చ జరుగుతోంది. కానీ.. కేసీఆర్‌ మాత్రం ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు. టీఆర్‌ఎస్‌ తటస్థంగా ఉండిపోతుందా? లేక ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేసి, ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దించడానికి కేసీఆర్‌ వ్యూహాన్ని పన్నుతున్నారా? అని చర్చించుకుంటున్నారు. మే చివరి వారంలో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌సింగ్‌ మాన్‌తో భేటీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌తో, ఆ తర్వాత మాజీ ప్రధాని దేవెగౌడతో కేసీఆర్‌ సమావేశమైన విషయం తెలిసిందే. అనంతరం సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే వద్దకు వెళ్లాల్సి ఉండగా.. ఆ పర్యటన రద్దయింది. తదనంతరం కేసీఆర్‌ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదు. దీంతో రాష్ట్రపతి ఎన్నికల్లో కేసీఆర్‌ ఆలోచనేంటన్నది తెలియడంలేదు.


ఎన్డీఏకు మద్దతిచ్చే అవకాశమే లేదు

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి టీఆర్‌ఎస్‌ మద్దతిచ్చే అవకాశమే లేదని ఆ పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. కేసీఆర్‌ జాతీయ స్థాయి పర్యటనలు చేపడుతూ విపక్షాలను కూడగడుతున్నది ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టడానికేనని అంటున్నారు. ప్రస్తుతం ఆయన దీనిపైనే వ్యూహ రచన చేస్తున్నారని పేర్కొంటున్నారు. రెండు మూడు నెలల్లో సంచలన వార్త చెబుతానన్న కేసీఆర్‌ ప్రకటనలో భాగంగానే ఇది జరుగుతోందని అంటున్నారు. జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకు ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చి, తన వ్యూహాన్ని అమలు చేసే యోచనలో ఆయన ఉన్నారని వివరిస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నిక నుంచే తన రాజకీయ చతురతను ప్రదర్శించాలన్న పట్టుదలతో ఆయన ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.


మహారాష్ట్రకు చెందిన ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే పేరును, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ పేరును కేసీఆర్‌ ప్రస్తావిస్తున్నారని, వీరితో పాటు మరో ఇద్దరు కీలక నేతల పేర్లను ఆయన ప్రతిపాదిస్తున్నారని టీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి. అయితే.. కేసీఆర్‌ ప్రతిపాదనను దేవెగౌడ సున్నితంగా తిరస్కరించినట్లు వివరించాయి. ఇందుకు కారణాలను కూడా జేడీఎస్‌ వెల్లడించినట్లు చెప్పాయి. ‘‘తెలంగాణ కోసం ఉద్యమ సమయంలో కేసీఆర్‌ మా మద్దతు కోరుతూ లేఖ తీసుకున్నారు. కానీ, మా నేత దేవెగౌడకు మాటవరసకైనా చెప్పకుండా 2004 ఎన్నికల్లో కాంగ్రె్‌సతో పొత్తు పెట్టుకున్నారు. అది మాకు ఇబ్బందికరంగా పరిణమించింది. అప్పటి నుంచే టీఆర్‌ఎస్‌ వైఖరి ఏమిటో తెలిసిపోయింది’’ అని జేడీఎస్‌ వర్గాలు వివరించినట్లు తెలిపాయి. ఇలా దేవెగౌడ నుంచి ఊహించని సమాధానం రావడంతో అన్నా హజారే పేరును కేసీఆర్‌ తెరపైకి తెస్తున్నట్లు సమాచారం.


కేసీఆర్‌ కల ఫలించేనా ?

కేసీఆర్‌ కల ఫలిస్తుందా? ప్రాంతీయ పార్టీలు ఆయనను విశ్వసిస్తాయా? అన్నా హజారే వంటి సామాజిక ఉద్యమకారుడు అభ్యర్థిత్వ ప్రతిపాదనకు అంగీకరిస్తారా? అన్న చర్చ కూడా సాగుతోంది. నిజానికి కేసీఆర్‌ను కొన్ని ప్రాంతీయ పార్టీలు నమ్మడం లేదు. ఇదివరకు కేసీఆర్‌ పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్‌లతోనూ సమావేశమయ్యారు. బీజేపీ, కాంగ్రెసేతర కూటమి గురించి వారి వద్ద ప్రస్తావించారు. కానీ... దీనికి ఆ పార్టీలు అంగీకరించడం లేదని తెలుస్తోంది. మమత ఇప్పటికే తనకు తాను ప్రధానమంత్రి అభ్యర్థిగా భావిస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఏదైనా కూటమి ఏర్పడితే... తన సారథ్యంలోనే ఏర్పడాలి, తానే నేతృత్వం వహించాలన్నది ఆమె అంతర్గత ఆలోచనగా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అలాంటప్పుడు కేసీఆర్‌ కట్టే ప్రత్యామ్నాయ కూటమిలో సభ్యురాలుగా చేరడానికి ఆమె అంగీకరిస్తారా అన్నది సందేహమేనని వారు వివరిస్తున్నారు.


పైగా... రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రత్యామ్నాయ కూటమి తరపున అభ్యర్థిని నిలిపినా... గెలిచే అవకాశాలు ఉండవని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఓడిపోయే సీటు కోసం అన్నా హజారే వంటి ప్రముఖ ఉద్యమకారుడు ఒప్పుకొంటారా, కేసీఆర్‌ కల ఫలిస్తుందా అన్న చర్చ జరుగుతోంది. అన్నా హజారే కాదు... ఎవరైనా అంగీకరించబోరని చెబుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసి, రాజకీయ పలుకుబడినిసాధించుకోవాలన్నవారెవరైనా ఉమ్మడి అభ్యర్థిగా పోటీకి దిగినా... కేసీఆర్‌కు పెద్దగా ఒరిగేదేముంటుందన్న ప్రశ్నలున్నాయి. కాకపోతే... కేంద్రంలోని బీజేపీని ఢీకొట్టానన్న సంతృప్తి మాత్రం మిగలవచ్చని టీఆర్‌ఎస్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

తెలంగాణ Latest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.