జీహెచ్ఎంసి పరిధిలో వరద పరిస్థితులపై సీఎం ఆరా

ABN , First Publish Date - 2022-07-11T00:26:23+05:30 IST

జీహెచ్ఎంసి పరిదిలో వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారుల నుంచి ఆరా తీశారు. విద్యుత్ తీగలు తెగిపడడం, పాతగోడలు కూలడం వంటి ప్రమాదాలను పసిగట్టి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

జీహెచ్ఎంసి పరిధిలో వరద పరిస్థితులపై సీఎం ఆరా

హైదరాబాద్: జీహెచ్ఎంసి పరిదిలో వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారుల నుంచి ఆరా తీశారు. విద్యుత్ తీగలు తెగిపడడం, పాతగోడలు కూలడం వంటి ప్రమాదాలను పసిగట్టి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆదివారం ప్రగతి భవన్ లో మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసిలో వరద పరిస్థతిని ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. వానల నేపధ్యంలో తలెత్తుతున్న పరిస్థితులను వెంట వెంటనే సీఎం కార్యాలయానికి తెలియజేయాలని ఆదేశించారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండేదారుల్లో (కాజ్ వే లు) ప్రమాద హెచ్చరిక సూచనలను ఏర్పాటు చేసి ప్రమాదాల నుంచి ప్రజలను కాపాడాలన్నారు. 


అంటు వ్యాధులు ప్రబలకుండా జీహెచ్ఎంసి మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వరద ముంపు అధికంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేకంగా ద`ష్టి సారించాలన్నరు. వానలు ఆగినా తద్వారా వచ్చే వరదలు మరికొన్ని రోజుల పాటు కొనసాగుతుందని, దీనిపై కార్యాచరణ ఉండాలని సీఎం అన్నారు. హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లలో వరద పెరిగే అవకాశమున్నందున నీటి విడుదల చర్యలు చేపట్టాలన్నారు. జీహెచ్ఎంసి పరిధిలో పరిస్థితులు అదుపులోనే వున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. 


ఈ సమావేశంలో మంత్రులు తలసాని, సబితారెడ్డి, మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు వివేకానంద, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, భేతి సుభాష్ రెడ్డి, ముఠాగోపాల్, మాగంటి గోపీనాధ్, సీఎస్ సోమేశ్ కుమార్, జీహెచ్ఎంసి కమిషనర్ లోకేశ్ కుమార్, పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్, హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-07-11T00:26:23+05:30 IST