నేడు వికారాబాద్‌కు సీఎం కేసీఆర్‌

ABN , First Publish Date - 2022-08-16T06:00:32+05:30 IST

నేడు వికారాబాద్‌కు సీఎం కేసీఆర్‌

నేడు వికారాబాద్‌కు సీఎం కేసీఆర్‌
విద్యుద్దీపాల వెలుగులో కలెక్టరేట్‌

వికారాబాద్‌, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : సీఎం కేసీఆర్‌ పర్యటన కోసం వికారాబాద్‌ జిల్లా కేంద్రం సిద్ధమైంది. కొత్తగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫీసెస్‌ కాంప్లెక్స్‌ (జిల్లా కలెక్టరేట్‌) భవనంతో పాటు జిల్లా టీఆర్‌ఎస్‌ భవన్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. ఇటీవల జిల్లాకు ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణం, ఏరియా ఆసుపత్రిని జనరల్‌ ఆసుపత్రిగా స్థాయి పెంపు పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఆర్‌బీవీఆర్‌ఆర్‌ పోలీస్‌ అకాడమీ నుంచి వికారాబాద్‌ వరకు సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ దారిపొడవునా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నేతలు పోటాపోటీగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో వికారాబాద్‌ పట్టణం గులాబీమయంగా మారింది. సీఎం కేసీఆర్‌ పర్యటనకు పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. సీఎం పర్యటనను అడ్డుకుంటామని బీజేపీ నాయకులు ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. 

గంపెడాశతో ఎదురు చూపులు..

తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తరువాత తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో వికారాబాద్‌ జిల్లాకు వస్తున్న సీఎం కేసీఆర్‌ ఎలాంటి వరాలు ప్రకటిస్తారోనని జిల్లా ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సీఎం కేసీఆర్‌ జిల్లా పర్యటనకు వస్తే వరాల జల్లు కురిపిస్తారని, ప్రత్యేక నిధులు మంజూరు చేస్తారనిప్రజలు గంపెడాశతో ఎదురు చూస్తున్నారు.  

ఏకతాటి పైకి వచ్చేరా?

జిల్లాలో టీఆర్‌ఎస్‌ నేతల మధ్య విబేధాలు తారస్థాయికి చేరుకున్నాయి. తాం డూరులో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విబేధాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతంతాండూరు మునిసిపల్‌ చైర్‌పర్సన్‌గా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి మద్దతుదారు స్వప్న కొనసాగుతుండగా, ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్లు పూర్తయినందున ఆమె తన పదవికి రాజీనామా చేయాలని, ఆ స్థానంలో తన మద్దతుదారు దీపా నర్సిములును చైర్‌పర్సన్‌గా చేయాలని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పట్టుదలతో ఉన్నారు. వికారాబాద్‌ మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పదవి విషయంలోనూ ఇదే వివాదం కొనసాగుతోంది.  ఇటీవల జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతామహేందర్‌రెడ్డిని ప్రొటోకాల్‌ పాటించడం లేదని సొంత పార్టీ నాయకులే అడ్డుకుని ఆమె కారుపై దాడి చేసిన సంఘటనతో నియోజకవర్గంలో అధికారపార్టీ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయాయి.  సీఎం కేసీఆర్‌ పర్యటన పార్టీ నాయకులను ఏకం చేస్తుందా, విబేఽధాలు మరింత పెరిగేలా చేస్తాయా అనేది చర్చనీయాంశంగా మారింది. 

సీఎం పర్యటన సాగేదిలా

సీఎం మధ్యాహ్నం రెండు గంటలకు హెలీకాప్టర్‌లో వికారాబాద్‌ జిల్లా పోలీసు పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. మొదటగా ఆయన టీఆర్‌ఎస్‌ భవన్‌ను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి ఎన్నేపల్లి శివారులోని ఇంటిగ్రేటెడ్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫీసెస్‌ కాంప్లెక్స్‌ను ప్రారంభిస్తారు. ఆ తరువాత ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణానికి సీఎం అక్కడే శిలాఫలకం ఆవిష్కరించనున్నారు. అనంతరం కొత్త కలెక్టరేట్‌లో మంత్రులు, జడ్పీ చైర్‌పర్సన్‌, ఎమ్మెల్యేలు, అధికారులతో జిల్లా అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 4గంటలకు కలెక్టరేట్‌ పక్కన జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 5.15 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరుతారు.

సీఎం కేసీఆర్‌కు ఘనస్వాగతం పలకాలి: సబితా ఇంద్రారెడ్డి 

 సీఎం కేసీఆర్‌ వికారాబాద్‌ జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. సీఎం హోదాలో తొలిసారిగా మంగళవారం వికారాబాద్‌కు వస్తున్న సీఎం కేసీఆర్‌కు ఘనస్వాగతం పలకాలని ఆమెపార్టీ శ్రేణులను కోరారు. సోమవారం సాయంత్రం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్‌, మహేష్‌రెడ్డి, కాలే యాదయ్య, రోహిత్‌రెడ్డి, బీసీ కమిషన్‌ సభ్యుడు శుభప్రద్‌ పటేల్‌, కలెక్టర్‌ నిఖిల, జడ్పీ వైస్‌ చైర్మన్‌ విజయకుమార్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మురళీకృష్ణతో కలిసి నూతన కలెక్టరేట్‌, సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. అనంతరం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, దశాబ్దాల వికారాబాద్‌ జిల్లా ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చిన తరువాత మొదటిసారి వికారాబాద్‌కు వస్తున్న సీఎం కేసీఆర్‌కు పెద్ద ఎత్తున స్వాగతం పలకనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రూ.60.70 కోట్లతో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం, రూ.235 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ప్రభుత్వ మెడికల్‌ కళాశాల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. అదే విధంగా కొత్తగా నిర్మించిన టీఆర్‌ఎస్‌ భవన్‌ ను ప్రారంభిస్తారని ఆమె తెలిపారు. 



Updated Date - 2022-08-16T06:00:32+05:30 IST