20న కలెక్టరేట్‌ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

Jun 15 2021 @ 00:58AM
మాట్లాడుతున్న కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి

17లోగా సామగ్రిని  నూతన కలెక్టరేట్‌లోకి తరలించాలి

కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి

కొండపాక, జూన్‌ 14: ఈ నెల 20న నూతన సమీకృత కలెక్టరేట్‌ను సీఎం కేసీర్‌ ప్రారంభిస్తారని కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి తెలిపారు. సోమవారం కొండపాక మండలం దుద్దెడ శివారులో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ భవనంలో వివిధ శాఖలకు స్థల కేటాయింపులపై అదనపు కలెక్టర్‌ ముజమిల్‌ఖాన్‌, డీఆర్వో చెన్నయ్య ఇతర అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 17వ తేదీలోగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోని ఫైల్స్‌, సామగ్రిని నూతన సమీకృత కలెక్టరేట్‌లోకి తరలించాలన్నారు. పాలనా సౌలభ్యం కోసమే ఒకే దగ్గర అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. కొరత ఉన్న ఫర్నిచర్‌ ను వెంటనే సమకూర్చాలని ఆర్‌అండ్‌బీ  అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు బేసిక్‌ డిస్ట్రిక్ట్‌ డాటా, శాఖల సంక్షిప్త సమాచారాన్ని వెంటనే సిద్ధం చేసి సీపీవోకు అందివ్వాలన్నారు. ఫిర్యాదుల కోసం ప్రత్యేక అధికారిని అందుబాటులో ఉంచాలని, జిల్లా కార్యాలయాన్ని కొత్త సమీకృత కలెక్టరేట్‌కు మారుస్తున్నందున ప్రజల సత్వర అవసరాలు, ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ఒక అధికారిని ప్రత్యేకంగా ప్రస్తుతం ఉన్న కార్యాలయంలో ఈ నెల 20వ తేదీ వరకు అందుబాటులో ఉంచాలన్నారు.


Follow Us on: