చిత్ర కళలో ప్రతిభను ధర్నాలో ప్రదర్శించిన మమత బెనర్జీ

ABN , First Publish Date - 2021-04-13T23:14:37+05:30 IST

ఎన్నికల కమిషన్ (ఈసీ) ఆదేశాలకు నిరసనగా నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పశ్చిమ

చిత్ర కళలో ప్రతిభను ధర్నాలో ప్రదర్శించిన మమత బెనర్జీ

కోల్‌కతా : ఎన్నికల కమిషన్ (ఈసీ) ఆదేశాలకు నిరసనగా నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తన చిత్రకళా ప్రతిభను ప్రదర్శించారు. కాలికి దెబ్బ తగలడంతో వీల్‌చైర్‌లో కూర్చుని రెండు రంగు రంగుల పెయింటింగ్స్ వేశారు. శాసన సభ ఎన్నికల్లో 24 గంటలపాటు ఆమె ప్రచారం చేయరాదని ఈసీ ఆదేశించిన సంగతి తెలిసిందే. 


పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల ప్రచారంలో మమత బెనర్జీ వ్యంగ్యంగా దూషించే పదాలు వాడారని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఆమె వ్యాఖ్యల వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం తీవ్రంగా ఉందని, తద్వారా ఎన్నికల ప్రక్రియపై ప్రభావం పడవచ్చునని తెలిపింది. ఆమె ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై సోమవారం రాత్రి 8 గంటల నుంచి 24 గంటలపాటు నిషేధం విధించింది.  ఈ ఆదేశాలపై మమత బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మంగళవారం ధర్నా నిర్వహించారు. 


మమత బెనర్జీ మంగళవారం మేయో రోడ్డులోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఉదయం ఈ వేదిక వద్దకు వచ్చిన తర్వాత పెయింటింగ్ వేయడం ప్రారంభించారు. రంగు రంగుల పెయింటింగ్స్ రెండిటిని వేశారు. ఆమె కాలికి గాయమైనందువల్ల వీల్‌చైర్‌లో కూర్చునే పెయింటింగ్స్ వేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా తనపై 24 గంటలపాటు నిషేధం విధిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. 


ఎనిమిది దశల్లో జరుగుతున్న పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో ఐదో విడత పోలింగ్ ఈ నెల 17న జరుగుతుంది. చివరి, ఎనిమిదో విడత పోలింగ్ ఈ నెల 29న జరుగుతుంది. మే రెండున ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 


Updated Date - 2021-04-13T23:14:37+05:30 IST