Chief Minister: మూడేళ్లలో 2 లక్షల మందికి ఉపాధి

ABN , First Publish Date - 2022-08-24T16:31:55+05:30 IST

రాష్ట్రంలో పాదరక్షల తయారీ, తోళ్ల కర్మాగారాల్లో మూడేళ్లలో రెండు లక్షలమందికి ఉపాథి అవకాశాలు కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief

Chief Minister: మూడేళ్లలో 2 లక్షల మందికి ఉపాధి

                        - తోళ్ల శాఖ సదస్సులో సీఎం స్టాలిన్‌ ఫ ఐదు సంస్థలతో ఒప్పందం


చెన్నై, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పాదరక్షల తయారీ, తోళ్ల కర్మాగారాల్లో మూడేళ్లలో రెండు లక్షలమందికి ఉపాథి అవకాశాలు కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) ప్రకటించారు. నగరంలో మంగళవారం ఉదయం రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పాదరక్షల తయారీ, తోళ్ల పరిశ్రమల ప్రతినిధుల సదస్సులో ఆయన ప్రసంగిస్తూ డీఎంకే ప్రభుత్వ యేడాది పాలనలో 192 స్వదేశీ, విదేశీ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నామని రూ.2.20లక్షల కోట్ల పెట్టుబడులతో కొత్త పరిశ్రమలకు అనుమతిచ్చి 3.22లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించామని తెలిపారు. పాదరక్షలు, తోళ్ల ఉత్పత్తుల తయారీలో అన్ని రాష్ట్రాల కంటే మనం ముందంజలో ఉన్నామన్నారు. ఆంబూరు, రాణిపేట, వాణియంబాడి, వేలూరు, పేర్నాంబట్టు, తిరుచ్చి, దిండుగల్‌, చెన్నై ప్రాంతాల్లో తోళ్ళ పరిశ్రమలు, పాదరక్షల తయారీ కేంద్రాలు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు.  ఈ సదస్సులో ఆయన తోళ్ల పరిశ్రమల విధాన నిర్ణయాల నివేదిక విడుదల చేశారు. ఆ తర్వాత స్టాలిన్‌ సమక్షంలో రూ.2250 కోట్ల పెట్టుబడులతో 37,450 మందికి ఉపాధి కల్పించేలా ఐదు సంస్థల ప్రతినిధులు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. కొథారి ఫినిక్స్‌ అకార్డ్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో రెండు పాదరక్షల తయారీ కర్మాగారాలు, కొథారి సీమ్స్‌ గ్రూపు ఆధ్వర్వంలో తోలు రహిత పాదరక్షల తయారీ కర్మాగారం, వేగన్‌ గ్రూపు ఆధ్వర్యంలో తోలు దుస్తులు, కానుకలు, ఉపకరణాల తయారీ కర్మాగారం, వాక్రూ ఇంటర్నేషనల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో తోలు రహిత పాదరక్షల తయారీ కర్మాగం నెలకొల్పే దిశగా ఆ ఐదు సంస్థల నిర్వాహకులు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ కొత్త కర్మాగారాలు పెరంబలూరు, రాణిపేట (మనపాక్కం) జిల్లాల్లో ఏర్పాటవుతాయని ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రకటించారు. ఈ సదస్సులో మంత్రులు తంగం తెన్నరసు, దామో అన్బరసన్‌(Ministers Thangam Tennarasu and Damo Anbarasan), ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు తదితరులు పాల్గొన్నారు. ఇదే విధంగా స్కెచర్స్‌ సంస్థ అధికారి రాహుల్‌వీరా, ఇంగ్లాండ్‌ ఫుట్‌వేర్స్‌ కంపెనీ అధికారి జేన్‌ విల్సన్‌, ఎవర్‌వాన్‌ గ్రూపు నిర్వాహకులు రోన్‌సాంగ్‌, జెన్నీ సాంగ్‌, వాల్‌మార్ట్‌ గ్రూపు నిర్వాహకులు బాబ్‌ లాయిడ్‌, ఆల్టో సంస్థ నిర్వాహకులు జేన్స్‌ఎన్‌, సీమ్స్‌ గ్రూపు నిర్వాహకులు కెనెట్‌ తదితరులు ఆన్‌లైన్‌ ద్వారా ప్రసంగించారు. ఈ సదస్సులో రీటైలర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా, వాక్రూ, వీకేసీ గ్రూపు, పారగాన్‌, సీఅండ్‌జే క్లార్క్స్‌ లిమిటెడ్‌, స్కెచర్స్‌ ఇండియా, ఫ్యూమా ఇండియా, టైస్‌మేన్‌, కాథిమ్స్‌, అజియో, రిలయెన్స్‌ ఫుట్‌ ప్రింట్స్‌, మెట్రో, శ్రీలెదర్స్‌, ఇండియన్‌ టెరైన్‌ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-24T16:31:55+05:30 IST