karnataka rains: రైతుల ఖాతాల్లో పంట నష్టపరిహారం

ABN , First Publish Date - 2021-11-23T13:26:49+05:30 IST

ఇటీవల కురుస్తున్న భారీవర్షాల వల్ల జరిగిన పంట నష్టానికి రైతులకు నష్టపరిహారం అందించాలని కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆదేశాలు జారీ చేశారు...

karnataka rains: రైతుల ఖాతాల్లో పంట నష్టపరిహారం

సీఎం బసవరాజ్ బొమ్మై ఆదేశాలు

బెంగళూరు: ఇటీవల కురుస్తున్న భారీవర్షాల వల్ల జరిగిన పంట నష్టానికి రైతులకు నష్టపరిహారం అందించాలని కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆదేశాలు జారీ చేశారు. వరద సహాయ పనులకు నిధుల కొరత లేదని, దీని కోసం రూ.684 కోట్లు జిల్లా కలెక్టర్ల పీడీ ఖాతాల్లో ఉన్నాయని సీఎం చెప్పారు. ఇళ్లు దెబ్బతిన్న బాధితులకు ఒక్కొక్కరికి రూ.3లక్షలు మూడు విడతల్లో అందచేస్తామని సీఎం చెప్పారు. జీపీఎస్ సర్వే చేసి పంట నష్టంపై అంచనాలు రూపొందించి రైతుల ఖాతాల్లో నష్టపరిహారం తక్షణం వేయాలని సీఎం అధికారులను కోరారు.కోలార్ జిల్లాలో పర్యటించిన సీఎం బసవరాజ్ పంట నష్టాన్ని పరిశీలించి అధికారులకు తాజా ఆదేశాలు జారీ చేశారు. రాగులు, కూరగాయలు, పండ్ల, పూల తోటలు బాగా దెబ్బతిన్నాయని సీఎం చెప్పారు. 


ముదావడి చెరువు కట్ట తెగి వరదనీరు ప్రవహించడంతో రోడ్డు కొట్టుకుపోయింది. భారీవర్షాలు, వరదల వల్ల 790 ఇళ్లు దెబ్బతిన్నాయి. 48,333 హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 8,966 హెక్టార్లలో పండ్ల తోటలు దెబ్బతిన్నాయి. 189 కిలోమీటర్ల రోడ్లు, 34 వంతెనలు బాగా దెబ్బతిన్నాయని అధికారులు చెప్పారు.రోడ్లు, వంతెనల మరమ్మతుల కోసం రూ.500 కోట్లను విడుదల చేశామని సీఎం చెప్పారు. వరదల వల్ల దెబ్బతిన్న పాఠశాల భవనాలు, అంగన్ వాడీ భవనాల మరమ్మతులకు ఎన్డీఆర్ఎఫ్ నిధులు వెచ్చిస్తామని సీఎం వివరించారు. బెంగళూరు రూరల్, బెంగళూరు అర్బన్, తుముకూరు, కోలార్, చిక్కబళ్లాపూర్, రాంనగర్, హాసన్ జిల్లాల్లో భారీనష్టం సంభవించింది.


Updated Date - 2021-11-23T13:26:49+05:30 IST