త్వరలో శుభవార్త

ABN , First Publish Date - 2022-01-14T09:13:24+05:30 IST

సినీ రంగ సమస్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సానుకూల రీతిలో స్పందించారని, త్వరలో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటానని హామీ..

త్వరలో శుభవార్త

  • సినీ సమస్యలపై సీఎం సానుకూల స్పందన
  • 2,3 వారాల్లో ఆమోదయోగ్యమైన నిర్ణయం
  • జగన్‌ ఇచ్చిన భరోసాతో ధైర్యం వచ్చింది
  • పరిశ్రమ వారికి అభద్రతా భావం వద్దు 
  • సంయమనంతో వ్యవహరించండి: చిరంజీవి 
  • తాడేపల్లి క్యాంపు ఆఫీసులో సీఎంతో భేటీ 
  • జగన్‌తో కలసి విందు.. గంటన్నర సేపు చర్చలు
  • జీవో ఇచ్చేముందు కలుద్దామని సీఎం హామీ!


అమరావతి, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): సినీ రంగ సమస్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సానుకూల రీతిలో స్పందించారని, త్వరలో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి పేర్కొన్నారు. సినీ రంగం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలనూ సీఎంకు సమగ్రంగా వివరించానని చెప్పారు. జగన్‌ ఇచ్చిన భరోసాతో ధైర్యం వచ్చిందన్నారు. సినీ పరిశ్రమవారు ఎవరూ అభద్రతా భావానికి లోనుకావద్దని, సంయమనంతో వ్యవహరించాలని, విమర్శలు చేయవద్దని కోరారు. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్‌తో చిరంజీవి భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర సేపు జరిగిన సమావేశంలో టికెట్‌ ధరలు, ఇతర సమస్యలను వివరించారు. అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణంలో గన్నవరం విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడారు.


సీఎంతో సమావేశం సంతృప్తికరంగా సాగిందని, నిర్మాణాత్మకమైన సూచనలు ఇచ్చానని తెలిపారు. సినిమా టికెట్‌ ధరలు పెంచాలని, కరోనాతో కష్టాల్లో ఉన్న కార్మికులను ఆదుకోవాలని సీఎంను కోరినట్టు తెలిపారు. తీవ్ర కష్టాలు, నష్టాల్లో ఉన్న సినీ పరిశ్రమకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. ‘‘జగన్‌ ఆహ్వానం మేరకు చర్చలకు వచ్చాను. నన్ను ఒక సోదరుడిలా ఆహ్వానించారు. సంక్రాంతి వేళ ఇంట్లో విందు ఏర్పాటు చేయడం ఆనందం కలిగింది. జగన్‌ సతీమణి భారతి స్వయంగా వడ్డించారు. ఇద్దరూ కుటుంబ సభ్యుడిలా మర్యాదలు చేశారు. సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయి. నేను చెప్పిన అన్ని సమస్యలను జగన్‌ సానుకూలంగా విన్నారు. ఒక పుస్తకంలో రాసుకున్నారు. ఒకరి పక్షాన గాక అందరి వైపు ఉంటానని, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం భరోసా ఇచ్చారు. చర్చల వివరాలను సినీ పెద్దలకు వివరిస్తాను. వారు ఏవైనా సలహాలు, సూచనలు ఇస్తే వాటిని సీఎం దృష్టికి తీసుకువెళ్తా. పరిశ్రమకు పెద్దగా కాకుండా ఒక బిడ్డగా చెబుతున్నా. పరిశ్రమలో ఉన్న వారు, ఎగ్జిబిటర్లు  ఆందోళనతో అనవసరంగా మాటలు జారొద్దు. పరిశ్రమకు అనుకూలంగా నిర్ణయం వస్తుంది’’ అని చిరంజీవి చెప్పారు. హైదరాబాద్‌లో ఫిలిం చాంబర్‌, నిర్మాతల మండలితో సమావేశం ఏర్పాటు చేసి భేటీలో చర్చించిన అంశాలను వారికి వివరిస్తానని చెప్పారు. అందరూ ఆమోదం తెలిపిన తర్వాత ఒక జీవో ఇవ్వడానికి సీఎం సిద్ధంగా ఉన్నారన్నారు.   టికెట్‌ ధరల జీవోపై పునరాలోచన చేస్తామని చెప్పడం ఆనందాన్ని కలిగించిందన్నారు. 


సినీ కార్మికులను ఆదుకోండి

‘‘టికెట్ల ధరలు తగ్గించడం వల్ల సినీ రంగం కుదేలవుతుంది. నిర్మాతలు అసంతృప్తితో ఉన్నారు. థియేటర్ల యజమానులు వాటిని మూసేయాల్సి వస్తుందన్న అభద్రతాభావంలో ఉన్నారు. పరిశ్రమను నమ్ముకున్న వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోతారు. కరోనా కారణంగా షూటింగ్‌లు లేకపోవడంతో కార్మికులు ఆర్థికంగా తీవ్ర కష్టాల్లో ఉన్నారు. మరోవైపు సినీ పరిశ్రమ నష్టాల్లో ఉంది. రాష్ట్రంలో షూటింగ్‌లు చేసేందుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలి. కార్మికులను ఆదుకునే చర్యలు చేపట్టేలా ప్రత్యేక పథకాన్ని ప్రకటించాలి’’ అని సీఎంను కోరినట్టు చిరంజీవి తెలిపారు. 


మరోసారి కలుద్దాం: జగన్‌ 

పేదలకు వినోదాన్ని చౌకగా అందించాలన్న ఉద్దేశంతోనే టికెట్‌ ధరలు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నామని సమావేశంలో జగన్‌ వివరించారు. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. టికెట్‌ ధరల పెంపుపై ప్రతిపక్షాలు, కొందరు సినీరంగానికి చెందినవారు రాజకీయం చేస్తున్నారని జగన్‌ విమర్శించారు. ప్రభుత్వానికి, సినీరంగానికి మధ్య అంతరం పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు సినీరంగంలో కీలక వ్యక్తిగా, అందరివాడిగా ఉన్న మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించినట్టు చిరంజీవితో చెప్పారు. అయితే, సినీ రంగంలోని ప్రతి ఒక్కరి సమస్యలను పరిగణనలోనికి తీసుకోవాలని చిరంజీవి కోరారు. సమస్యలన్నింటినీ ప్రభుత్వం  కమిటీ దృష్టికి తీసుకువెళ్తానని, కమిటీ అధ్యయనం చేసి తుది నిర్ణయం తీసుకునేలోగా మరోసారి కలసి మాట్లాడుదామని జగన్‌ చెప్పారు. ప్రభుత్వ ఉత్తర్వును జారీ చేసేముందు మళ్లీ ఆహ్వానిస్తానన్నారు. తానెప్పుడు, ఎక్కడికి రావాలని చిరంజీవి అడగగా, ఎక్కడో ఎందుకు తన నివాసంలోనే భోజనం చేస్తూ మాట్లాడుకుందామని జగన్‌ చెప్పారు. ఇద్దరూ చర్చించాకే ఉత్తర్వు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. 


చిరుకు సీఎం సాదర స్వాగతం 

హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో చిరంజీవి గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు. అక్కడి నుంచి సీఎం నివాసానికి చేరుకున్నారు.  జగన్‌ ఎదురెళ్లి చిరంజీవికి సాదర స్వాగతం పలికారు. ముఖ్యమంత్రికి చిరంజీవి శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేశారు. ప్రతిగా చిరంజీవికి జగ న్‌ శాలువా కప్పి జ్ఞాపికను అందజేశా రు. అనంతరం ఇద్దరూ కలసి భో జనం చేశారు. భోజన సమయంలో ఇద్దరి మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి.’


విమర్శల నేపథ్యంలో భేటీ 

సినీ పరిశ్రమకు చెందినవారిపై వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి ఇటీవల తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై సినీ ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. ఈ నేపథ్యంలో సీఎంతో చిరంజీవి భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర ప్రభుత్వానికి, సినీ రంగానికి మధ్య పెరిగిన దూరాన్ని తగ్గించేందుకు చిరంజీవిని భోజనానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి ఆహ్వానించారు.  



Updated Date - 2022-01-14T09:13:24+05:30 IST