సీఎం సార్‌... శంకుస్థాపనలేనా..!

Published: Thu, 07 Jul 2022 01:26:16 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సీఎం సార్‌... శంకుస్థాపనలేనా..!పులివెందుల వద్దనున్న ఏపీకార్ల్‌

వెక్కిరిస్తున్న శిలాఫలకాలు 

ఊసే లేని ఉక్కుకర్మాగారం

ఏపీకార్ల్‌కు గ్రహణం వీడదా...

ప్రాజెక్టులదీ అదే తీరా... 

గండికోట ముంపువాసులకు పరిహారం ఏదీ 

కడప రోడ్ల విస్తరణ సంగతేంటి 

కడప, జూలై 6 (ఆంరఽధజ్యోతి): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పర్యటనకు వస్తే చాలు... వందల కోట్ల అభివృద్ధి పనులకు శిలఫలకాలు, శంకుస్థాపనలు చేస్తూ వచ్చారు. దీంతో ఇక వైఎస్‌ఆర్‌ హయాంలో జరిగిన అభివృద్ధికి తగ్గట్లుగానే జగన్‌ పాలనలో జిల్లా అభివృద్ధి వైపు దౌడు తీస్తుందని ఆశించారు. ఈ నేపథ్యంలో జిల్లా వాసుల శ్వాస అయిన ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపనను చూసి.. ఇంకేంటి జిల్లా రూపు రేఖలే మారిపోతాయని సగటు జిల్లా వాసి సంబరపడ్డాడు. అటు పరిశ్రమలతో నిరుద్యోగులకు ఉపాధి, ఇటు సాగునీటి ప్రాజెక్టులతో రైతన్నలకు దండిగా పనులు, రోడ్ల విస్తరణలతో పట్టణాలు న్యూ సిటీ లుక్‌లోకి వెళతాయని ఆశించారు. అయితే సీఎం జగన్‌పై జనం పెట్టుకున్న భ్రమలు ఇప్పుడిప్పుడే కారుమబ్బుల్లా కరిగిపోతున్నాయి. ఎందుకంటే మూడేళ్లలో అభివృద్ధి పనులన్నీ శంకుస్థాపనలకే పరిమితమవుతున్నాయి. ఆవిష్కరించిన శిలాఫలకాలు వెక్కిరిస్తున్నాయి. ఇవి ఎప్పుడు పూర్తి అవుతాయి... వాటి ఫలాలు ఎప్పుడు అందుతాయని జిల్లా వాసులు ఎదురు చూస్తున్నారు. సీఎం జగన్‌ రెండు రోజుల పర్యటన నిమిత్తం నేడు జిల్లాకు రానున్నారు. ఈ నేపథ్యంలో జనం సీఎం సార్‌ శంకుస్థాపనలేనా... అభివృద్ధి ఎప్పుడంటూ ప్రశ్నిస్తున్నారు. 


ఊసేలేని ఉక్కు పరిశ్రమ అభివృద్ధి 

జిల్లాలో ఏ ముహుర్తాన బ్రాహ్మణీ స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి నాటి దివంగత సీఎం వైఎస్‌ఆర్‌ శంకుస్థాపన చేశారో కానీ ఆ ప్రాజెక్టు అర్థాంతరంగా ఆగిపోయింది. ఓబులాపురం మైనింగ్‌ కేసులో గాలి జనార్థన్‌రెడ్డి జైలుకు వెళ్లడం... ఆయనపై సీబీఐ కేసులు ఇతరత్రా వాటి వల్ల బ్రాహ్మణి స్టీల్‌ ప్రాజెక్టు అటకెక్కింది. గత చంద్రబాబు హయాంలో జమ్మలమడుగులో స్టీల్‌ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఓట్ల కోసమే చంద్రబాబు స్టీల్‌ ఫ్యాక్టరీ శంకుస్థాపన చేశారని, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉక్కుపరిశ్రమ నిర్మాణానికి శంకుస్థాపన చేసి పూర్తి చేస్తామన్నారు. అందుకు తగ్గట్లుగానే జగన్‌ సీఎం అయిన తరువాత చంద్రబాబు శంకుస్థాపన చేసిన సున్నపురాళ్లపల్లె ప్రాంతాన్ని మార్చేసి పెద్దదండ్లూరు సమీపంలో 2019 డిసెంబర్‌ 23న శంకుస్థాపన చేశారు. మూడేళ్లలో ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేస్తానని జనం సాక్షిగా సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. అయితే స్టీల్‌ ఫ్యాక్టరీ ప్రహారీ గోడ పూర్తి అయ్యింది. సీఎం చెప్పిన హామీ మేరకు అయితే ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి ఫ్యాక్టరీ పూర్తి కావాల్సి ఉంది. సీఎం హామీ నెరవేరి ఉంటే మరో 5 నెలల్లో సుమారు 20వేల మందికి ప్రత్యక్షంగా,  పరోక్షంగా  ఉపాధి లభించేది. 


గండికోట ముంపువాసులకు పరిహారం ఏదీ 

గండికోట ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 26.85 టీఎంసీలు.  పూర్తి స్థాయిలో నీరు నింపా లంటే 22 గ్రామాలు ఖాళీ చేయాల్సిందే. దివంగత సీఎం వైఎస్‌ఆర్‌ హయాంలో పున రావాస పరిహారం కింద భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు 1.22 లక్షలు పరిహారం ఇచ్చారు. అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పరిహారాన్ని పెంచి రూ.6.70 లక్షలు అందించారు. మొదటి విడతలో చౌటుపల్లె, సీతాపురం, గండ్లూరు, ఓబన్నపేట,  బొమ్మేపల్లి, దొరువు, బుక్కపట్నం, రంగాపురం, రేపల్లె, ముచ్చుమర్రి, పక్కీరుపేట, దత్తాపురం, నేదరపేట, కొర్రపాడు గ్రామాల్లోని 9096 మందికి 6.75 లక్షల చొప్పున అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రూ.479 కోట్లు పరిహారం అందించింది. అయితే జగన్‌  సీఎం అయిన తరువాత ఒక్కొక్కరికి పరిహారం రూ.10 లక్షలు ఇస్తామన్నారు. రెండో విడతలోని 8 గ్రామాలకు రూ.10 లక్షలు ఇచ్చారు. సీఎం హామీ మేరకు మొదటి విడతలోని 9096 మందికి ఒక్కొక ్కరికి రూ.3.25 లక్షలు చెల్లించాల్సి ఉంది.  అయుతే ఇంత వరకు ఇవ్వలేదు.


పురోగతి లేని జలాశయ నిర్మాణ పనులు 

వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కాగానే జిల్లాలో పలు జలాశయ నిర్మాణ పనులకు అట్టహాసంగా శంకుస్థాపనలు చేశారు. రూ.564 కోట్లతో కుందూ, పెన్నా ఎత్తిపోతల పథకం, రూ.1350 కోట్లతో రాజోలు జలాశయం నిర్మాణ పనులు, రూ.312 కోట్లతో జొలదరాసి రిజర్వాయర్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినప్పటికీ వాటిలో ఎటువంటి పురోగతి లేదు. ఇక సర్వారాయసాగర్‌ ప్రాజెక్టు లీకేజీ వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారంటూ ఇటీవల జరిగిన జిల్లా పరిషత్‌ సమావేశంలో సభ్యులు వాపోయారు. తెలుగు గంగ లీకేజీ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. అవుకు టన్నెల్‌ పూర్తి చేసి కృష్ణావరద జలాలను 20 వేల క్యూసెక్కులు గండికోటకు తీసుకొస్తామని ప్రాజెక్టుల సమీక్షలో జగన్‌ సీఎం అయిన తొలినాళ్లలో పేర్కొన్నారు. నిధుల సమస్య వల్ల సొరంగ నిర్మాణం నత్తన డకన సాగుతోంది. 


నత్తే నయంగా... నగర అభివృద్ధి పనులు

2019 డిసెంబర్‌, గత ఏడాది సీఎం కడప పర్యటన సందర్భంగా కడప నగరంలో పలు అభివృద్ధి పనులకు సీఎం శిలాఫలకాలు ఆవిష్కరించారు. సుమారు రూ.300 కోట్లతో రిమ్స్‌ను సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చేందుకు శిలాఫలకం వేశారు. అయితే ఆ పనులు నత్తే నయంగా సాగుతున్నాయి. సూపర్‌స్పెషాలిటీ వైద్యం జిల్లా వాసులకు ఎప్పుడు అందుతుందో మరి. ఇక దేవుని కడప చెరువును హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌ తరహా, రాజీవ్‌మార్గ్‌ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇక్కడ ఇంత వరకు పనులే మొదలు పెట్టలేదు. రాజీవ్‌ మార్గ పనులు నత్తేనయం అన్నట్లుగా సాగుతున్నాయి. ఇక కడపలో రహదారుల విస్తరణకు సంబంధించి... ఆ ఒక్క రోడ్డు తప్ప ఇంత వరకు పనులు మొదలు కాలేదు. వర్షపు నీటి నుంచి కడపను గట్టెక్కించేందుకు వరద కాలువ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు కానీ..  ఇంత వరకు ఆ ఊసే లేదు. ఇలా సీఎం వచ్చిన ప్పుడల్లా శిలాఫలకాలు ఆవిష్కరించడం తప్ప... పనులు మొదలు కాక, మొదలైనా పూర్తి కాక వెక్కిరిస్తున్నాయి. మరో రెండేళ్లలో ఎన్నికలు రాబోతున్నాయి. మరి ఈ పనులు ఎప్పుడు పూర్తి అవుతాయో చూడాల్సి ఉంది.


ఏపీకార్ల్‌కు గ్రహణం వీడదా ?

పులివెందుల ఖ్యాతిని అంతర్జాతీయస్థాయిలో నిలిపేందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సంకల్పించారు. పశువులకు రాబోయే ముందస్తు వ్యాధులను గుర్తించి వాటికి టీకాలు, వచ్చిన వ్యాధులను పరిశోధనలు చేసి వ్యాక్సిన్లు తయారు చేసేందుకు ఇందిరాగాంధీ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ ఆన్‌ లైవ్‌స్టాక్‌ (ఐజీకార్ల్‌) ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. అత్యంత వేగంగా పరిశోధన భవనాన్ని రూ.35కోట్లతో నిర్మించారు. 2008 డిసెంబరులో వైఎస్‌ చేతులమీదుగా ప్రారంభమైంది. అప్పట్లో మౌలిక వసతులు లేక పరిశోధనలు సాగలేదు. వైఎస్‌ మృతితో ఈ పరిశోధన కేంద్రం మరుగున పడింది. అప్పటికే నిధులు విడుదల కావడంతో రూ.280కోట్లు వెచ్చించి దాదాపు 80 నుంచి 90శాతం పనులు పూర్తిచేశారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఐజీకార్ల్‌ను వినియోగంలోకి తీసుకురావడంలో విఫలమయ్యాయి. టీడీపీ ప్రభుత్వం ఐజీకార్ల్‌ను ఏపీకార్ల్‌గా పేరు మార్చింది. 2019లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఏపీకార్ల్‌లో జెట్‌ వేగంతో పరిశోధనలు సాగుతాయని అందరూ భావించారు. కానీ దీనిపై ప్రకటనలు తప్ప చేతలు ఎక్కడ కనిపించడం లేదు.  రాష్ట్ర ప్రభుత్వం ఏపీకార్ల్‌ను పూర్తిగా పక్కనపెట్టిందా అన్న సందేహం రాకమానదు. ఎందుకంటే విజయవాడలో ఉన్న వెటర్నరీ బైలాజికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ (వీబీఐ)ని ఏపీకార్ల్‌కు మారుస్తూ దాదాపు నాలుగైదు నెలల కిందటే జీఓ కూడా విడుల చేసింది. ఇప్పటి వరకు వీబీఐ ఏపీకార్ల్‌కు వచ్చే పరిస్థితి కనిపించలేదు. జీఓ విడుదల చేసినా ఇక్కడకు మారలేదంటే ప్రభుత్వానికి ఏపీకార్ల్‌పై ఎంతటి చిత్తశుద్ది ఉందో ఇట్టే అర్థమవుతుంది. రూ.280కోట్లు ఖర్చు చేసి అందులో ఒక వంతు అయినా పశువులకు, ఈ ప్రాంత ప్రజలకు గాని ఉపయోగం ఉందా అని ఇక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు.  


పంటల బీమా సెగ సీఎంను తాకనుందా...

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం పులివెందులలో ప్రజలతో, రైతులతో, నాయకులతో సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలో ఆయన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా పులివెందులకు రానున్నారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి పులివెందులలో ప్రజలతో, రైతులతో, నాయకులతో మాట్లాడనున్నారు. పులివెందుల నియోజక వర్గంలో 2021కి సంబంధించి పంటల బీమాలో రైతులకు తీవ్ర అన్యా యం జరిగిందన్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈ విషయం ఇప్పటికే గ్రామాల్లోని నాయకులు, ప్రజాప్రతినిధులు ఎంపీ అవినాష్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గస్థాయి ప్లీనరీ సమా వేశంలో కూడా కొందరు నాయకులు, రైతులు జరిగిన అన్యాయాన్ని సమావేశంలో ఏకరువుపెట్టారు. చీనీతోటలు, కంది, పత్తి తదితర పంటలు సాగుచేసినప్పటికీ సచివాలయాల్లో ఈ-క్రాప్‌ నమోదు చేయక   బీమా దక్కలేదని రైతులు ఆవేదనలో ఉన్నారు.  ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు రైతులు సిద్దమవుతున్నట్లు తెలిసింది. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.