సీఎం సార్‌.. ‘పాదయాత్ర’ హామీ ఏమైంది?

ABN , First Publish Date - 2021-04-12T08:27:00+05:30 IST

‘‘సీఎం సార్‌.. మీ పాదయాత్ర హామీ ఏమైంది? మా ఉద్యోగాలను క్రమబద్ధీకరించండి!’’ అని కాంట్రాక్టు అధ్యాపకులు ముఖ్యమంత్రి జగన్‌కు మొరపెట్టుకుంటున్నారు. ‘పాదయాత్ర’ సందర్భంగా..

సీఎం సార్‌.. ‘పాదయాత్ర’ హామీ ఏమైంది?

క్రమబద్ధీకరణ మాట నిలుపుకోండి

కమిటీల గడువు ముగిసినా కాలయాపనా?

ఏటా రెన్యువల్‌ పద్ధతిని తొలగించండి

ఖాళీలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీచేయండి

ప్రభుత్వానికి కాంట్రాక్టు అధ్యాపకుల మొర


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘‘సీఎం సార్‌.. మీ పాదయాత్ర హామీ ఏమైంది? మా ఉద్యోగాలను క్రమబద్ధీకరించండి!’’ అని కాంట్రాక్టు అధ్యాపకులు ముఖ్యమంత్రి జగన్‌కు మొరపెట్టుకుంటున్నారు. ‘పాదయాత్ర’ సందర్భంగా.. వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్త్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను.. వారివారి అర్హతలను అనుసరించి వీలైనంత ఎక్కువ మందిని క్రమబద్ధీకరిస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఈ అంశాన్ని పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా అధికారంలోకి రాగానే మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు.


ఆ తర్వాత కొన్నాళ్లకు సీఎస్‌ అధ్యక్షతన మరో కమిటీని నియమించారు. గత జూన్‌ 30తో ఆయా కమిటీల గడువు ముగిసింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ నిమిత్తం ప్రత్యేక సెల్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు. జగన్‌ అధికారంలోకి వచ్చి 22నెలలైనా.. కాంట్రాక్టు ఉద్యోగుల పరిస్థితి ‘యథారాజా’ అన్నట్లుగానే ఉంది. రాష్ట్రంలో 9వేల మందికి పైగా కాంట్రాక్టు అధ్యాపకులు ఉన్నారు. వీరిలో జూనియర్‌ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు, పాలిటెక్నిక్‌ లెక్చరర్లు, ఏపీ రెసిడెన్షియల్‌ కాలేజీల్లో పనిచేస్తున్న లెక్చరర్లు, గిరిజన సంక్షేమ విద్యాసంస్థల్లో పనిచేస్తున్నవారు ఉన్నారు. ఇక, వీరిలో చాలామంది 10-20 ఏళ్ల నుంచి ఈ వృత్తిపైనే ఆదారపడి కుటుంబాలను పోషించుకుంటున్నారు. కానీ ప్రభుత్వం వారి సర్వీసును క్రమబద్ధీకరించటం లేదు. వారి ఉద్యోగానికి భద్రత కరువైంది. ఎప్పుడు ఎలాంటి ఉత్తర్వులు వస్తాయో తెలియని పరిస్థితి. గత టీడీపీ ప్రభుత్వం కాంట్రాక్టు అధ్యాపకుల వేతనాలను 50ు పెంచింది. అంతకుముందు కేవలం 10నెలల జీతం ఇస్తుంటే.. 12నెలలకు పెంచారు. 2019 ఏప్రిల్‌ 1 నుంచి 2015 ఆర్‌పీఎస్‌ ప్రకారం కాంట్రాక్టు అధ్యాపకులకు కూడా కనీస వేతనం అమలు చేశారు.


మహిళలకు ప్రసూతి సెలవులు 90నుంచి 180 రోజులకు పెంచారు. ఎక్‌ ్సగ్రేషియా విధానం అమలు చేశారు. సహజ మరణానికి రూ.2 లక్షలు, ప్రమాద రీత్యా మరణానికి రూ.5 లక్షలు ఇస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగి చనిపోతే మట్టి ఖర్చుల కింద రూ.15 వేలు ఇస్తున్నారు. ఇక, వైసీపీ సర్కారు మాత్రం ఇప్పటి వరకు కాంట్రాక్టు ఉద్యోగుల విషయంలో పెద్దగా చేసిందేమీ లేదనే విమర్శ ఉంది. ముఖ్యంగా క్రమబద్ధీకరణ హామీని ఇప్పటి వరకు నెరవేర్చలేదు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు పాదయాత్రలో, మేనిఫెస్టోలో తమకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కాంట్రాక్టు అధ్యాపకులు కోరుతున్నారు. అర్హతలు ఉన్న అధ్యాపకులందరినీ క్రమబద్ధీకరించాలని, రెన్యువల్‌ పద్ధతి తొలగించి 10రోజుల విరామం లేకుండా 60ఏళ్ల వరకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్న ఖాళీలకు మినహాయింపు ఇచ్చి మిగిలిన ఖాళీలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని, రెగ్యులర్‌ ఉద్యోగులతో పాటు పీఆర్‌సీ అమలు చేయాలని కోరుతున్నారు. సీఎం ఇచ్చిన హామీ మేరకు ఏ ఒక్క కాంట్రాక్టు అధ్యాపకుణ్ని తొలగించరాదంటున్నారు. 


క్యాలండర్‌పై ఆందోళన

ఉగాదికి ఏపీపీఎస్సీ ద్వారా భర్తీచేసే ఖాళీలకు క్యాలెండర్‌ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం కాంట్రాక్టు అధ్యాపకుల్లో ఆందోళన పుట్టిస్తోంది. ఎందుకంటే మరే విభాగంలో లేని విధంగా కేవలం విద్యాశాఖలో  పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను కూడా కలుపుకొని ఏపీపీఎస్సీ ద్వారా నియామకాలు చేస్తున్నారు. దీనివల్ల చాలా మంది ఉద్యోగాలు కోల్పోవలసి వస్తుంది. మంజూరైన పోస్టుల్లో పనిచేస్తున్న వారికి మాత్రమే జీతాలు ఇస్తున్నారు. విద్యాశాఖలో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నా ఆమేరకు మంజూరు చేయడం లేదు. ఈ నేపథ్యంలో గత రెండు దశాబ్దాలుగా ఉద్యోగ భద్రత లేకుండా పనిచేస్తున్న తమ సర్వీసులను ఇప్పటికైనా క్రమబద్ధీకరించాలని వారు కోరుతున్నారు. 

Updated Date - 2021-04-12T08:27:00+05:30 IST