సీఎం గారూ.. ఇదీ మీ అభివృద్ధి..

ABN , First Publish Date - 2022-09-28T05:41:52+05:30 IST

నంద్యాల జిల్లా ఆవిర్భావం తరువాత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రెండోసారి ఇక్కడికి వస్తున్నారు.

సీఎం గారూ..  ఇదీ మీ అభివృద్ధి..
నిర్మాణంలో ఉన్న మెడికల్‌ కాలేజీ

కొత్త జిల్లాలో అద్దె భవనాల్లో పాలన
పూర్తికాని అవుకు టెన్నెల్‌
రహదారులు అస్తవ్యస్తం
జిల్లాలో అన్నీ సమస్యలే


నంద్యాల, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి):

 నంద్యాల జిల్లా  ఆవిర్భావం తరువాత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి  రెండోసారి ఇక్కడికి వస్తున్నారు. వసతి దీవెన కార్యక్రమానికి ఏప్రిల్‌ 8న  మొదటిసారి వచ్చారు. బుధవారం బనగానపల్లెలో రామ్‌కో సిమెంటు ఫ్యాక్టరీని ప్రారంభించేందుకు వస్తున్నారు. టీడీపీ హయాంలో నిర్మాణ పనులు  మొదలుపెట్టిన ఈ ఫ్యాక్టరీని సీఎం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని అనేక సమస్యలు చర్చనీయాంశమవుతున్నాయి. సీఎం కొత్త జిల్లా ఏర్పాటు చేశారు గానీ కనీస శ్రద్ధ చూపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో అడుగడుగునా సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలన్నీ అరకొర వసతుల మధ్య అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. అభివృద్ధి పనులకు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించలేదు. అభివృద్ధే తమ ప్రభుత్వ విధానమని చాటుకొనే సీఎం జగన్‌ ఒకసారి ఈ వైపు చూపు సారించాలని జిల్లా వాసులు కోరుతున్నారు.

అద్దె భవనాల్లోనే..

జిల్లా ఏర్పడి దాదాపు 5 నెలలు కావస్తోంది. కానీ ఇంకా  ప్రభుత్వ కార్యాయాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఆర్‌ఏఆర్‌ఎస్‌ ప్రాంతంలో కొన్ని కార్యాలయాలను తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. మిగతా వాటి గురించి ఎలాంటి స్పష్టత లేదు. అద్దె భవనాల్లో వసతులు సరిగా లేకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం  శాశ్వతంగా భవనాలు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నదా? అనే సందేహం కలుగుతోంది. ఇటీవలే మొదలు పెట్టిన మెడికల్‌ కాలేజీకి సంబంధించిన మట్టి పనుల్లో అవకతవకలు జరుగుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. వీటిపైన దృష్టి సారించి కాలేజీ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు. వీటికి తోడు జిల్లాలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. అంతర్గత రోడ్లు, ప్రధాన రహదారులు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. రైతు భరోసా కేంద్రాలు, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు, డిజిటల్‌ గ్రంథాలయాల పనులు నత్తనడకన సాగుతున్నాయి. వీటి పనులు చేపట్టిన   కాంట్రాక్టర్లకు బిల్లులు సరిగా చెల్లించకపోవడంతో వాళ్లు పనులు మధ్యలోనే వదిలేశారు. ఇలా అన్ని రకాలుగా జిల్లా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సీఎం వీటన్నింటిపైన దృష్టి సారిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 ఎప్పటికి పూర్తయ్యేనో..

ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి కడప జిల్లా గండికోటకు నీటిని తరలించేందుకు అవుకు టెన్నెల్‌ నిర్మాణం చేపట్టారు. దీని ద్వారా 20 వేల క్యూసెక్కుల నీటిని మళ్లించేలా ప్రణాళికను తయారు చేశారు. ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వం కుడి సొరంగం ఫాల్ట్‌జోన్‌ వద్ద రెండు మళ్లింపు సొరంగాలకు డిజైన్‌ చేసి  2018లో పూర్తి చేసింది. వైసీపీ ప్రభుత్వం ఎడమ సొరంగం సంవత్సరం లోపు పూర్తి చేసేలా ప్రాధాన్య ప్రాజెక్టుల్లో పెట్టింది. 106 మీటర్ల ఫాల్ట్‌ జోన్‌ తవ్వకం.. 2.50 కి.మీ. లైనింగ్‌ పనులకు రూ.108 కోట్లతో కాంట్రాక్టర్‌ పనులు చేపట్టారు. బిల్లుల చెల్లింపులో జాప్యంతో కాంట్రాక్టర్‌  మధ్యలో పనులు నిలిపివేశారు. ఇంజనీర్ల ఒత్తిడితో   పనులు చేసేందుకు ఆయన ఒప్పుకున్నారు. కానీ అవి నత్తనడకన సాగుతున్నాయి. సొంత జిల్లాకు నీరు తీసుకువెళ్లే ప్రాజెక్టును కూడా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. సీఎం  అవుకు ప్రాంతానికి వస్తున్నందున టెన్నెల్‌ పనులకు పట్టించుకుని త్వరితగతిన పూర్తి చేయిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సిమెంటు హబ్‌ చంద్రబాబు చొరవే..

నేడు రామ్‌కో ఫ్యాక్టరీనీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ ఫ్యాక్టరీకి పునాది పడింది మాత్రం గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే. బనగానపల్లె నియోజకవర్గం సిమెంటు ఫ్యాక్టరీల నిర్మాణానికి అనువుగా ఉంటుంది. ఈ ఉద్దేశంతో గత టీడీపీ ప్రభుత్వం ఇక్కడ సిమెంటు హబ్‌ను ఏర్పాటు చేసేందుకు పూనుకుంది. ఇక్కడ ఫ్యాక్టరీలు కడతామని ముందుకు వస్తే స్థలాన్ని ఇస్తామని చెప్పడంతో పలువురు ఫ్యాక్టరీల నిర్మాణానికి చొరవ చూపారు. అందులో భాగంగానే రామ్‌కో సిమెంటు ఫ్యాక్టరీకి గత టీడీపీ ప్రభుత్వం కొలిమిగండ్ల మండలం కల్వటాల గ్రామ సమీపంలో 5808.27 ఎకరాలు లీజుకు ఇచ్చింది. అంతేకాకుండా అప్పటి సీఎం చంద్రబాబునాయుడు 2018 డిసెంబరు 5న భూమి పూజ చేసి ఫ్యాక్టరీ నిర్మాణాన్ని చేపట్టారు. దానినే ప్రస్తుతం సీఎం ప్రారంభిస్తున్నారు. ల్లా ఏర్పాటు చేశారు గానీ కనీస శ్రద్ధ చూపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో అడుగడుగునా సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలన్నీ అరకొర వసతుల మధ్య అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. అభివృద్ధి పనులకు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించలేదు. అభివృద్ధే తమ ప్రభుత్వ విధానమని చాటుకొనే సీఎం జగన్‌ ఒకసారి ఈ వైపు చూపు సారించాలని జిల్లా వాసులు కోరుతున్నారు.

Updated Date - 2022-09-28T05:41:52+05:30 IST