
విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం వేస్ అండ్ మీన్స్ వెసులుబాటును వినియోగించుకోవడం తప్పు కాదని సీఎం స్పెషల్ సెక్రటరీ దువ్వూరి కృష్ణ అన్నారు. ఈ వెసులుబాటును వినియోగించుకోవడమే తప్పు అన్నట్లు ప్రతిపక్షం వాదించడం సరికాదన్నారు. వేస్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్‌ను వినియోగించుకోవడం సర్వ సాధారణమని ఆయన తెలిపారు. ఒక రాష్ట్రానికి ఎన్ని రోజులు ఓవర్ డ్రాఫ్ట్ వాడుకోవచ్చన్న అంశం రిజర్వు బ్యాంకు నిర్దారిస్తుందన్నారు. 200 రోజుల పాటు ఓడీకి వెళ్లొచ్చని ఆర్బీఐ చెబుతోందని ఆయన పేర్కొన్నారు. కానీ తాము వినియోగించుకున్నది కేవలం 103 రోజులేనని ఆయన స్పష్టం చేశారు. అలాంటప్పుడు రాష్ట్ర ప్రతిష్ట పోయిందని టీడీపీ ఎలా ఆరోపణలు చేస్తుందని ఆయన ప్రశ్నించారు. 48,384 కోట్లు మాయం అయ్యాయని చెబుతున్న టీడీపీ, 2016లో పీడీ ఖాతాల గురించి చెప్పిందా అని ఆయన ప్రశ్నించారు.
తాను ఏర్పరచుకున్న అభిప్రాయాన్నే అకౌంట్స్ సమర్పించే సమయంలో కాగ్ పేర్కొని ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చే సందర్భంలో తామిచ్చిన సమాధానాలతో సంతృప్తి చెందుతుందని ఆశిస్తున్నామన్నారు. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ చేయడమే తప్పన్నట్టుగా ప్రతిపక్షాలు చెబుతున్నాయన్నారు. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ తీసుకోవడం నేరమన్నట్టు చూడడం సరికాదన్నారు. గత ప్రభుత్వ హయాంలో 450 శాతం మేర ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ లెక్కలను బడ్జెట్టులో చూపుతున్నామన్నారు. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ వివరాలు వాల్యూమ్-5లో స్పష్టంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ రూ. 1.17 లక్షల కోట్లు ఉన్నాయని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి