CM Stalin: మా పాలనలో సామాజిక న్యాయానికే ప్రాధాన్యం

ABN , First Publish Date - 2022-09-26T15:51:33+05:30 IST

రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వ ద్రావిడ తరహా పరిపాలనలో సామాజిక న్యాయానికే ప్రాధాన్యం కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం తన క్యాంపు కార్యాలయం

CM Stalin: మా పాలనలో సామాజిక న్యాయానికే ప్రాధాన్యం

చెన్నై: రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వ ద్రావిడ తరహా పరిపాలనలో సామాజిక న్యాయానికే ప్రాధాన్యం కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్షరెన్స్‌ ద్వారా కెనెడాలో నిర్వహించిన పెరియార్‌ మానవతావాద సామాజిక న్యాయ సాధన అంతర్జాతీయ తృతీయ మహానాడులో పాల్గొన్న ఆయన ప్రసంగించారు. అమెరికాకు చెందిన పెరియార్‌ అంతర్జాతీయ సంస్థ, కెనడాకు చెందిన మానవతవాద సంస్థల సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది. ద్రవిడ కళగం నేత కే వీరమణి స్వాగతోపన్యాసం చేశారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో డీఎంకే అధికారంలోకి వచ్చాక  సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవం, భాషాభిమానం, స్వయంప్రతిపత్తి సాధన అనే ప్రధాన లక్ష్యాలు సాధించే దిశగా ద్రావిడ తరహా పాలన అందిస్తోందన్నారు. ద్రవిడ ఉద్యమనేత పెరియార్‌ సిద్ధాంతాలన్నీ నేడు విశ్వవ్యాప్తమయ్యాయని, ఆయన రచనలన్నీ ప్రపంచభాషల్లోకి అనువాదమయ్యాయని స్టాలిన్‌ పేర్కొన్నారు. 


డీఎంకే ప్రభుత్వ ఆధ్వర్యంలో పెరియార్‌ రచనలను మరో 21 విదేశీ భాషల్లోకి అనువదించనున్నామని వెల్లడించారు. ఇక తిరువళ్లువర్‌ రచించిన తిరుక్కురళ్‌ సైతం 125 భాషల్లో అనువదించటంతో తమిళ సంస్కృతి, సంప్రదాయాలు, భాషపై విదేశీయుల్లో ఆసక్తి పెరిగిందన్నారు. 1945లో పెరియార్‌ ప్రపంచ భవిష్యత్‌ ఎలా ఉంటుందో తెలుపుతూ ‘ఇనివరుమ్‌ ఉలగమ్‌’ పేరిట తెలిపిన విషయాలు నేడు నిజమయ్యాయని, వాటిలో సెల్‌ఫోన్లు, వీడియోకాల్స్‌,  ఫ్యాక్స్‌, బ్యాటరీ కార్లు, టెస్ట్‌ట్యూబ్‌ బేబీల ప్రస్తావన కూడా ఉందని స్టాలిన్‌ గుర్త చేశారు. ఇదే రీతిలో పెరియార్‌ ఆశించిన విధంగానే సామాజిక న్యాయానికే ప్రాధాన్యతనిస్తూ పాలిస్తున్నామని, ఆ దిశగానే ఇళ్లవద్దకే విద్య, వైద్యం పథకాలు, ఉన్నతవిద్యనభ్యసించే విద్యార్థినులకు ప్రతినెలా రూ.1000ల సాయం, బడిపిల్లలకు అల్పాహారం వంటి పధకాలు అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు.

Updated Date - 2022-09-26T15:51:33+05:30 IST