నూతన పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం

ABN , First Publish Date - 2022-04-20T14:39:31+05:30 IST

డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలల్లోపునే 131 సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుని పారిశ్రామిక ప్రగతిని సాధించిందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌

నూతన పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం

- 131 సంస్థలతో అవగాహన ఒప్పందాలు

- ఉద్యోగాల భర్తీలో స్థానికులకు ప్రాధాన్యత

- సీఎం స్టాలిన్‌


చెన్నై: డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలల్లోపునే 131 సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుని పారిశ్రామిక ప్రగతిని సాధించిందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పేర్కొన్నారు. శాసనసభలో మంగళవారం ఉదయం పారిశ్రామిక శాఖకు సంబంధించిన ఆర్థిక పద్దులపై జరిగిన చర్చల్లో అన్నాడీఎంకే సభ్యుడు కేపీ మునుస్వామి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెట్టుబడుల సమీకరణ కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి వివరించాలని కోరారు. అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో సేకరించిన పారిశ్రామిక పెట్టుబడులు సద్వినియోగమయ్యాయా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌ బదులిస్తూ కొత్త పరిశ్రమలను నెలకొల్పడంలో రాష్ట్రం ముందంజలో ఉందని చెప్పారు. గత పదిమాసాల్లోపే స్వదేశీ, విదేశీ పెట్టుబడుల సమీకరణలో భాగంగా 131 సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నామని, వీటి ద్వారా రూ.69,375.54 కోట్ల మేరకు పెట్టుబడులను సమీకరించామని వివరించారు. ఒప్పందాలు కుదుర్చుకోవడంతోనే సరిపెట్టుకోకుండా ఆ ఒప్పందాల ప్రకారం రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు స్థాపించేందుకు తగు చర్యలు కూడా చేపడుతున్నామని చెప్పారు. పారిశ్రామికపెట్టుబడుల ద్వారా ప్రారంభించే అన్ని పరిశ్రమలలోనూ ఉద్యోగవకాశాలు కల్పించడంలో స్థానికులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడమే తన ప్రధాన లక్ష్యమని, ఆ దిశగానే తాను విదేశీ సంస్థలతో చర్చలు జరిపి మరిన్ని అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నానని స్టాలిన్‌ తెలిపారు. పెట్టుబడుల సమీకరణలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పత్రికలు కూడా ప్రశంసిస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో నిరుద్యోగ నిర్మూలనకు శాంతి భద్రతల పరిరక్షణకు కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, పరిశ్రమల ద్వారా ఉద్యోగాలు లభిస్తే యువతలో అశాంతి దూరమవుతుందన్నారు. పరిశ్రమల శాఖలో విశిష్ట సేవలందిస్తున్న మంత్రులకు, పారిశ్రామికవేత్తలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని ఆయన చెప్పారు. అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో కొన్ని అవగాహన ఒప్పందాలు కాగితాలకే పరిమితమయ్యాయని, వాటిపై పరిశీలన జరిపిన పరిశ్రమలు స్థాపించేందుకు చర్యలు తీసుకుంటామని స్టాలిన్‌ హామీ ఇచ్చారు.


రూ.35 వేల కోట్ల వ్యయంతో పైపుల ద్వారా గ్యాస్‌ సరఫరా

రాష్ట్రంలో పైప్‌లైన్ల ద్వారా ఇళ్ళకు గ్యాస్‌ సరఫరా చేసే పథకాన్ని రూ.35 వేల కోట్ల వ్యయంతో అమలు చేయనున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి తంగం తెన్నరసు శాసనసభలో మంగళవారం ఉదయం ప్రవేశపెట్టి తన శాఖకు సంబంధించి ఆర్థిక పద్దుల నివేదికలో ప్రకటించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 2.27కోట్లకు పైగా ఇళ్లకు పైప్‌లైన్‌ల ద్వారా వంటగ్యా్‌సను సరఫరా చేయనున్నామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఐదు ప్రముఖ పెట్రోలియం నేచురల్‌గ్యాస్‌ సంస్థలు పైప్‌లైన్లను అమర్చే పనులను టిడ్కో సంస్థ పరిశీలిస్తోందని పేర్కొన్నారు. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ 1224 కి.మీ. దూరానికి, గెయిల్‌ సంస్థ 319 కి.మీ. దూరానికి పైప్‌లైన్లు అమర్చే పథకాలను చేపడుతున్నాయని వివరించారు.

Updated Date - 2022-04-20T14:39:31+05:30 IST