ప్రధాని ప్రకటన అవాస్తవం

ABN , First Publish Date - 2022-04-29T13:37:16+05:30 IST

తమిళనాడు సహా కొన్ని రాష్ట్రాలు పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించకపోవడం వలనే అక్కడి వాటి ధరలను తగ్గలేదంటూ ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి

ప్రధాని ప్రకటన అవాస్తవం

- పెట్రో ధరలపై మోదీ కపట నాటకం 

- సీఎం స్టాలిన్‌ ధ్వజం


చెన్నై: తమిళనాడు సహా కొన్ని రాష్ట్రాలు పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించకపోవడం వలనే అక్కడి వాటి ధరలను తగ్గలేదంటూ ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి స్టాలిన్‌ శాసనసభలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం ఉదయం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయం ముగియగానే సీఎల్పీనేత సెల్వపెరుందగై ప్రధాని వ్యాఖ్యాలను ప్రస్తావించారు. దీనిపై స్టాలిన్‌ స్పందిస్తూ.. పెట్రో ధరలపై ప్రధాని నరేంద్రమోదీ కపటనాటకాలాడుతున్నారని విరుచుకుపడ్డారు. కేంద్రం చేపడుతున్న చర్యలకు కొన్ని రాష్ట్రాలు సహకరించడం లేదని, ఆ రాష్ట్రాలు వ్యాట్‌ తగ్గించకపోవడం వల్లే పెట్రో దరలను తగ్గించలేకపోతున్నట్లు ప్రధాని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మోదీ వ్యాఖ్యల కోసం ఒక్క మాటలో చెప్పాలంటే తమిళ సామెత ‘గుమ్మడికాయను అన్నంలో దాచిన’ చందాన ఉందని, వాస్తవాన్ని దాచిపెట్టేందుకు ఆయన తంటాలు పడినట్లుగా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. 2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు విపరీతంగా తగ్గినా అందుకు తగినట్లు పెట్రోలు, డీజిల్‌ ధరలను తగ్గించకుండా ముడిచమురు ధరల తగ్గింపు వల్ల సమకూరిన ఆదాయాన్ని కేంద్రప్రభుత్వమే స్వాహా చేసిందని విమర్శించారు. పెట్రోలు, డీజీల్‌పై కేంద్ర ప్రభుత్వం విధించే సుంకంలో రాష్ట్రాలకు వాటా ఉందని, ఆ వాటాను కూడా బాగా తగ్గించి ఆ ఆదాయాన్ని కూడా సొంతం చేసుకుందని ఆరోపించారు. అదే సమయలో రాష్ట్రాలకు వాటా ఇచ్చేందుకు అవకాశం లేని పన్నులను పెట్రోలో డీజిల్‌పై విపరీతంగా పెంచి సామాన్యులపై భారం వేసి లక్షల కోట్ల ఆదాయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వమే స్వంతం చేసుకుందని ధ్వజమెత్తారు.


ఎన్నికల ముందు తగ్గింపు, ఆ తర్వాత వడ్డింపు

కొన్ని రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలకు ముందు పెట్రోలు, డీజిల్‌పై పన్ను తగ్గించి కేంద్ర ప్రభుత్వం కపటనాటకమాడిందని ఆరోపించారు. ఆ రాష్ట్రాల  ఎన్నికలు ముగిసిన వారానికే సుంకాలను, పన్నులను గతం కంటే విపరీతంగా పెంచి సామాన్య ప్రజలపై భారాన్ని మోపిన ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కిందని విమర్శించారు. రాష్ట్రానికి సంబంధించినంతవరకూ శాసనసభ ఎన్నికలు ముగిసి తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేంద్ర ప్రభుత్వం కంటే ముందుగా రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్‌పె సుంకాన్ని తగ్గించామని స్టాలిన్‌ తెలిపారు. ఏ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌ ధరలను తగ్గించిందో ఏ ప్రభుత్వం వాటి ధరలను విపరీతంగా పెంచిందోనన్న వాస్తవాలన్నీ ప్రజలందరికీ తెలుసునని చెప్పారు. 


ఆర్థిక మంత్రి ప్రకటన...

పెట్రో ధరలపై ప్రధాని చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ రాష్ట్ర ఆర్థిక మంత్రి పళనివేల్‌ త్యాగరాజన్‌ గణాంకాలతో సమగ్రమైన ఓ ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌ ధరలపై ద్వంద్వవైఖరిని అవలంభిస్తోందని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికే ఆదాయం సమకూరే విధంగా సుంకాన్ని, పన్నులను అధికం చేస్తున్నదే తప్ప రాష్ట్రాలకు వాటా ఇచ్చే విధంగా ఉన్న సుంకాన్ని మాత్రం పెంచకుండా తగిస్తోందని, ఈ ద్వంద్వ వైఖరి వల్ల పెట్రో ధరల వల్ల రాష్ట్రాలకు వచ్చే ఆదాయం బాగా తగ్గిపోయిందని తెలిపారు. డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి రాగానే గతేడాది ఆగస్టులో పెట్రోలుపై వ్యాట్‌ పన్ను తగ్గించిన విషయం ప్రధానికి తెలియకపోవడం గర్హనీయమన్నారు. లీటర్‌ పెట్రోలుకు ధరను రూ.3ల వరకు తగ్గించిందని, ఇందువల్ల రూ. 1160 కోట్ల మేరకు అదనపు వ్యయభారం పడిందని చెప్పారు. 2014 నుంచి 2021 వరకు కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు బాగా తగ్గినా, రాష్ట్రాలకు ఆదాయ వనరులు లభించని రీతిలో ఏయే పద్ధతుల్లో పెట్రోలు, డీజిల్‌ ధరలను పెంచిందన్న వివరాలను ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2022-04-29T13:37:16+05:30 IST