కేంద్రానికి అండగా ఉంటాం

ABN , First Publish Date - 2022-01-14T13:45:08+05:30 IST

దేశంలో విజృంభిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రప్రభుత్వం తీసుకునే చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర

కేంద్రానికి అండగా ఉంటాం

- CM Stalin హామీ 

- ‘కరోనా’పై ప్రధాని మోదీ సమీక్ష 


అడయార్‌(చెన్నై): దేశంలో విజృంభిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రప్రభుత్వం తీసుకునే చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన హామీ ఇచ్చారు. గురువారం అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్‌ మాట్లాడుతూ... కరోనా వైరస్‌తో పాటు ఒమైక్రాన్‌ వ్యాప్తిని సమర్థవంతంగా అడ్డుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేసి, ఇప్పటివరకు 64 శాతం మేర వ్యాక్సిన్లు వేసినట్టు తెలిపారు. బూస్టర్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌కు కూడా మంచి స్పందన ఉందన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్ట చర్యల్లో భాగంగా రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ప్రత్యేకంగా కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేయడమేకాకుండా, అన్ని నగరాల్లో కొవిడ్‌ మేనేజ్‌మెంట్‌ సెంటర్లను నెలకొల్పినట్టు చెప్పారు. అంతేకాకుండా, జాతీయ స్థాయిలో ఖరారు చేసిన విధివిధానాల మేరకు అన్ని చర్యలు తీసుకుని ముందుకు సాగుతున్నట్టు వెల్లడించారు. ఆర్‌టీపీ సీఆర్‌ టెస్టులను మాత్రమే చేస్తున్నట్టు వెల్లడించిన ముఖ్యమంత్రి స్టాలిన్‌.. వాటితో పాటు ఆక్సిజన్‌ నిల్వలు, ఐసీయూ పడకలను అధిక సంఖ్యలో సిద్ధం చేసామన్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని రకాలైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ అధికారులకు తాను స్పష్టమైన ఆదేశాలు జారీచేసినట్టు వెల్లడించారు. కరోనా వల్ల ఏర్పడే అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగాన్ని కూడా సన్నద్ధం చేసినట్టు తెలిపారు. చివరగా, కరోనా మహమ్మారికి అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకునే అన్ని రకాల చర్యలు, ప్రయత్నాలకు తమ ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని ప్రధానికి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ హామీ ఇచ్చారు. ఈ సమీక్షా సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం, ఆరోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్‌ జె. రాధా కృష్ణన్‌, రెవెన్యూ, విపత్తుల నిర్వహణ విభాగం ప్రిన్సిపల్‌ కార్యదర్శి కుమార్‌ జయంత్‌తో పాటు కేంద్ర రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖల ఉన్నతాధి కారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-14T13:45:08+05:30 IST