Chief Minister: పారిశ్రామికాభివృద్ధే లక్ష్యం..

ABN , First Publish Date - 2022-09-17T14:16:16+05:30 IST

రాష్ట్రంలో భారీ పరిశ్రమలతోపాటు చిన్న, కుటీర, మధ్య తరహా పరిశ్రమలకు తగిన ప్రోత్సాహం కల్పించినప్పుడే పారిశ్రామికాభివృద్ధి సాధ్యమవుతుందని

Chief Minister: పారిశ్రామికాభివృద్ధే లక్ష్యం..

- మదురైలో రూ.600 కోట్లతో టైడల్‌ పార్క్‌ 

- సీఎం స్టాలిన్‌ ప్రకటన


చెన్నై, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భారీ పరిశ్రమలతోపాటు చిన్న, కుటీర, మధ్య తరహా పరిశ్రమలకు తగిన ప్రోత్సాహం కల్పించినప్పుడే పారిశ్రామికాభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) పేర్కొన్నారు. తమిళ సాహితీ సాంస్కృతిక నగరంగా పేరుపొందిన మదురైలో రూ.600 కోట్లతో టైడల్‌ పార్క్‌ను నెలకొల్పనున్నట్లు సీఎం ప్రకటించారు. మదురైలో చిన్న, కుటీర, మధ్యతరహా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ప్రాంతీయ పారిశ్రామిక మహానాడులో ఐదు పారిశ్రామిక సంస్థలకు అవార్డులను ఆయన ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో సీఎం మాట్లాడుతూ మదురై జిల్లాలో 50 వేలకు పైగా చిన్న, కుటీర, మధ్యతరహా పరిశ్రమలున్నాయని, వీటి ద్వారా 3.37లక్షల మంది స్థానిక యువత ఉపాధి పొందుతున్నారని తెలిపారు. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న ఎంఎ్‌సఎంఈ సంస్థలకు తగిన గుర్తింపునిచ్చేందుకే అత్యుత్తమ పారిశ్రామికవేత్తల అవార్డులను తమ ప్రభుత్వం ప్రతియేటా అందజేస్తోందని వెల్లడించారు. అదే సమయంలో ఈ చిన్న, కుటీర మధ్యతరహా పరిశ్రమలకు తగిన సమయంలో రుణాలిచ్చి ప్రోత్సహించిన బ్యాంకులకు కూడా తమ ప్రభుత్వం అవార్డులను ప్రకటించిందని తెలిపారు. మదురై(Madurai)లో తొలి దశగా రూ.600 కోట్లతో ఐదెకరాల విస్తీర్ణంలో టైడల్‌ పార్క్‌ నెలకొల్పనున్నట్లు సభికుల హర్షధ్వానాల మధ్య స్టాలిన్‌ ప్రకటించారు. రెండో దశగా మరో ఐదెకరాల్లో టైడల్‌ పార్క్‌ విస్తరింపజేస్తామని, దీంతో సుమారు 10 వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. ప్రస్తుతం తిరుప్పూరు, విల్లుపురం, తూత్తుకుడి, తంజావూరు, సేలం, వేలూరు, ఊటీలో టైడల్‌ పార్క్‌ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆయన వివరించారు. 


అవగాహన ఒప్పందం..

ఈ సభలో సీఎం స్టాలిన్‌ సమక్షంలో ఇండో అమెరికన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌తో రాష్ట్ర పరిశ్రమల శాఖ అనుబంధ సంస్థ ‘ఫామీ టీఎన్‌’ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ అవగాహన ఒప్పంద పత్రాలను ఆ సంస్థల ప్రతినిధులకు ఆయన అందించారు. ఈ మహానాడులో మంత్రులు దామో అన్బరసన్‌, పి. మూర్తి, పళినవేల్‌ త్యాగరాజన్‌, అన్బిల్‌ మహేష్‌ పొయ్యామొళి, ఎంపీ కే వెంకటేశన్‌, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌, అనీష్‌ శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-17T14:16:16+05:30 IST