గ్రామీణాభివృద్ధితో దేశం సుసంపన్నం

ABN , First Publish Date - 2022-04-06T14:21:43+05:30 IST

గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేసినప్పుడే దేశం సుసంపన్నమవుతుందని, అన్ని కులాలు, మతాలకు చెంది నవారు ఒకే చోట కలిసిమెలసి సమైక్యంగా జీవించేలా రాష్ట్రం మతసామ రస్యాన్ని చాటే ఓ

గ్రామీణాభివృద్ధితో దేశం సుసంపన్నం

- మతసామరస్యాన్ని చాటే సమత్తుపురంగా రాష్ట్రం

- విల్లుపురం సభలో సీఎం స్టాలిన్‌


చెన్నై: గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేసినప్పుడే దేశం సుసంపన్నమవుతుందని, అన్ని కులాలు, మతాలకు చెంది నవారు ఒకే చోట కలిసిమెలసి సమైక్యంగా జీవించేలా రాష్ట్రం మతసామ రస్యాన్ని చాటే ఓ సమత్తువపురంగా మారాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఆకాంక్షించారు. విల్లుపురం జిల్లా వానూరు తాలూకా కొళువారి గ్రామంలో రూ.2.88 కోట్లతో నిర్మించిన 100 నివాసాలతో కూడిన పెరియార్‌ స్మారక సముత్తువపురాన్ని మంగళవారం సీఎం ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన పెరియార్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖలు ప్రజలకు చేరువగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాయని, గ్రామీణ పథకాలను సకాలంలో అమలు చేయడంలోనూ ఆ రెండు శాఖలు కీలక పాత్రను పోషిస్తున్నాయన్నారు. అన్నివర్గాలు, మతాలవారు ఒకే చోట నివసించేలా చేయడమే సమత్తువపురం ప్రధాన లక్ష్యమని, ఇదే విధంగా రాష్ట్రం కూడా మతసామరస్యతను ఎలుగెత్తి చాటేలా సమత్తువపురంగా మారాలన్నదే తన ఆకాంక్ష అని ఆయన పేర్కొన్నారు. గత పదినెలలుగా తమ ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. విల్లుపురం పర్యటన సందర్భంగా స్థానికులు ప్రభుత్వ పాలన చక్కగా ఉందని ప్రశంసించారన్నారు. ప్రజలకు మేలు చేయడమే డీఎంకే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని, సమర్థ వంతంగా సాగుతున్న తమ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అర్ధంలేని ఆరోపణలు చేసి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో పెరియార్‌ జన్మించకుంటే ద్రావిడ తరహా పరిపాలన ఉండేది కాదని, పెరియార్‌ సిద్ధాంతాలను ప్రజలు మరవకూడదనే ఈ సమత్తువపురాలను మళ్ళీ నిర్మిస్తున్నామని వెల్లడించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి హయాంలో శంకుస్థాపన చేసిన ఈ సమత్తువ పురాన్ని పదేళ్ల తర్వాత తాను ప్రారంభించడం తనకెంతో సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ప్రభుత్వ హయాంలో అన్ని కులాలవారు ఒకే చోట నివసించేలా రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల పెరియార్‌ స్మారక సమత్తువపురాలను నిర్మించారని, గత పదేళ్లుగా అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో ఈ సమత్తువపురాల సంరక్షణ  పట్టించుకోలేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా వుండగా మంగళవారం ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆ సమత్తువపురాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు ఇళ్ల తాళాలను అందజేశారు. ఈ సమత్తువపురంలో రూ.14.20 లక్షలతో నీటి తొట్టె నిర్మించి కొళాయి కనెక్షన్లు కూడా ఇచ్చారు. రూ.7.32 లక్షలతో చిల్డ్రన్స్‌ పార్కు, రూ.3.42 లక్షలతో వీది లైట్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక ఈ సమత్తువపురంలో రూ.2.75 కోట్లతో నిర్మించిన రేషన్‌ దుకాణం భవనాన్ని కూడా స్టాలిన్‌ ప్రారంభించారు. రూ.10.19లక్షలతో నిర్మించనున్న అంగన్‌వాడీ భవనానికి, రూ.12 లక్షలతో నిర్మించనున్న గ్రంథాలయ భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. 


38 భవనాల ప్రారంభోత్సవం...

విల్లుపురం జిల్లా ఒళుందియాంబట్టు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో రూ. 24.77 కోట్లతో పూర్తయిన 38 భవనాలను స్టాలిన్‌ ప్రారంభించారు.  ఈ కార్యక్రమాలలో మంత్రులు కె.పొన్ముడి, కేఆర్‌ పెరియకరుప్పన్‌, సెంజి కేఎస్‌ మస్తాన్‌, ఎంపీ రవికుమార్‌, శాసనసభ్యులు ఎన్‌. పుగళేంది, డాక్టర్‌ ఇరా లక్ష్మణన్‌, ఏజే మణికన్నన్‌, సి. శివకుమార్‌, గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్‌ శాఖల ప్రధాన కార్యదర్శి పి. అముదా, గ్రామీణాభివృద్ధి శాఖ సంచాలకులు ప్రవీణ్‌ పి. నాయర్‌, విల్లుపురం జిల్లా కలెక్టర్‌ డి. మోహన్‌, జిల్లాపరిషత్‌ అధ్యక్షుడు ఎం. జయచంద్రన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-04-06T14:21:43+05:30 IST