సకల జనాభివృద్ధే ద్రావిడ పాలన

ABN , First Publish Date - 2022-05-01T13:17:47+05:30 IST

అన్ని వర్గాలవారికి అభివృద్ధి ఫలాలను సమానంగా అందించటమే ద్రావిడ మోడల్‌ పాలన అని, అదే దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పాలన అని రాష్ట్ర ముఖ్యమంత్రి

సకల జనాభివృద్ధే ద్రావిడ పాలన

                       - తేని సభలో సీఎం స్టాలిన్‌


చెన్నై: అన్ని వర్గాలవారికి అభివృద్ధి ఫలాలను సమానంగా అందించటమే ద్రావిడ మోడల్‌ పాలన అని, అదే దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పాలన అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయడమే కాకుండా ఆ పథకాల ద్వారా అందరికీ లబ్ధి చేకూర్చటమే తమ ప్రభుత్వ ఆశయమని చెప్పారు. తేని జిల్లా ఊంజాంపట్టి గ్రామంలో శనివారం ఉదయం ఏర్పాటైన బహిరంగ సభలో ఆ జిల్లాలో రూ.114.21 కోట్లతో వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్మించిన కొత్త భవనాలను ఆయన ప్రారంభించారు. రూ.74.21 కోట్లతో వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్మించనున్న కొత్త భవనాలు, అమలు చేయనున్న పథకాలకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. వివిధ ప్రభుత్వ పథకాల కింద రూ. 71 కోట్ల విలువైన సహాయాలను 19427 మంది లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... వచ్చే వారం ఏడాది పాలనను పూర్తి చేసుకోబోతున్న తమ ప్రభుత్వం పదేళ్లకు సరిపడా పథకాలను అమలు చేసి సరికొత్త రికార్డు సృష్టించిందని చెప్పారు. డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చిందని, ఎనిమిది నెలలపాటు శ్రమించి ఆ వైర్‌సను పూర్తిగా కట్టడి చేయగలిగామన్నారు. టీకాల కార్యక్రమాలను ఉద్యమ తరహాలో నిర్వహించడంతో 91 శాతం మందికి మొదటి విడత టీకాలు వేశామని చెప్పారు. డీఎంకే ప్రకటించిన ఎన్నికల హామీలన్నింటినీ పూర్తి చేసినట్లు తాను గొప్పలు చెప్పుకోవడం లేదని, ఇంకా నెరవేర్చాల్సిన కీలకమైన హామీలు ఐదు నుంచి 10 శాతం వరకూ ఉన్నాయని చెప్పారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి కూడా తమ ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని, ఆ దిశగానే గత పదినెలల వ్యవధిలో రూ.64వేల కోట్ల పెట్టుబడులను సమీకరించేలా వివిధ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుని సుమారు రెండు లక్షల మందికి ఉపాధి అవకాశాలను కల్పించామని చెప్పారు. ఈ సభలో తేనిలో రూ.98.01 కోట్లతో నిర్మించిన న్యాయ కళాశాల భవనం, విద్యార్థుల హాస్టల్‌ భవనాలను ప్రారంభించడంతో పాటు పలు భవనాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెరియసామి, కేకేఎ్‌సఎ్‌సఆర్‌ రామచంద్రన్‌, శాసనసభ్యులు కంభం ఎన్‌.రామకృష్ణన్‌, ఎ.మహారాజన్‌, కేఎస్‌ శరవణకుమార్‌, తేని కలెక్టర్‌ కేవీ మురళీధరన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-01T13:17:47+05:30 IST