మీ ఎత్తులు ఫలించవు..

ABN , First Publish Date - 2022-05-05T15:13:06+05:30 IST

ఆధ్యాత్మిక వ్యతిరేక ప్రభుత్వంగా తమను చిత్రీకరించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, ప్రత్యర్థులు చేస్తున్న ఈ ఎత్తుగడలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫలించవని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌

మీ ఎత్తులు ఫలించవు..

- ఆధ్యాత్మిక వ్యతిరేక ప్రభుత్వంగా చిత్రీకరిస్తున్నారు

- ఇది ద్రావిడ మోడల్‌ పాలన

- అసెంబ్లీలో సీఎం స్టాలిన్‌

- ‘పల్లకీసేవ’ నిషేధంపై ప్రతిపక్షాల ఆగ్రహం

 

చెన్నై: ఆధ్యాత్మిక వ్యతిరేక ప్రభుత్వంగా తమను చిత్రీకరించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, ప్రత్యర్థులు చేస్తున్న ఈ ఎత్తుగడలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫలించవని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ మండిపడ్డారు. శాసనసభలో బుధవారం ఉదయం ధరమపురం ఆధీనం పల్లకీసేవ నిషేధంపై ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే సహా కొన్ని పార్టీలు సావధానతీర్మానం ప్రవేశపెట్టాయి. ముందుగా అన్నాడీఎంకే సభాపక్ష నాయకుడు ఎడప్పాడి పళనిస్వామి ఆ తర్వాత పీఎంకే, బీజేపీ సభ్యులు మాట్లాడుతూ.. ధరమపురం ఆధీనం పల్లకీసేవపై నిషేధం విధించడం గర్హనీయమన్నారు. ముఖ్యమంత్రి పండుగలకు శుభాకాంక్షలు తెలిపే విషయమై అన్నాడీఎంకే సభ్యుడు నత్తం విశ్వనాధన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్పీకర్‌ అప్పావు జోక్యం చేసుకుంటూ ఆ వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఎడప్పాడి కూడా ఇదే రీతిలో కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌ జోక్యం చేసుకుని మాట్లాడుతూ.. డీఎంకేని ఆధ్యాత్మిక వ్యతిరేకమైన పార్టీగా చిత్రీకరించేందుకు ప్రతిపక్షాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని మండి పడ్డారు. ఆ దిశగానే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభలో కొన్ని వ్యాఖ్యలను చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎత్తుగడలు ఎట్టి పరిస్థితుల్లో ఫలించవని, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నది పెరియార్‌, అన్నాదురై, కరుణానిధి ఆశయాలకనుగుణంగా పనిచేసే ద్రావిడ పాలనా ప్రభుత్వమని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆధ్యాత్మిక భావాలకు వ్యతిరేకంగా నడచుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.


త్వరలో సీఎం నిర్ణయం..

 ధరమపురం ఆధీనం విషయంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ త్వరలో తగు నిర్ణయం తీసుకుని ప్రకటిస్తారని దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు తెలిపారు. రాష్ట్రంలో 45 ఆధీనాలు (మఠాలు) ఉన్నాయని, శైవ, వైష్ణవ మతాచారాలకు అనుగుణంగా ఈ మఠాలు సేవలందిస్తున్నాయని, అదే విధంగా శక్తిపీఠాలు కూడా భక్తులకు సేవలందిస్తున్నాయని చెప్పారు. ఈ మఠాలు, పీఠాలకు చెందిన అధిపతులందరినీ ఏకతాటిపైకి తెచ్చి దేవాదాయ శాఖలో భక్తులకు అనువైన విధంగా విప్లవాత్మకమైన మార్పులుతీసుకు వచ్చిన ఘనత ముఖ్యమంత్రి స్టాలిన్‌కే దక్కుతుందన్నారు. ఇటీవల రాష్ట్రానికి చెందిన ఆధీనాలందరూ ముఖ్యమంత్రితో సమావేశమైన సమయంలో రాష్ట్రంలో ఆధ్యాత్మిక పాలన జరుగుతోందంటూ ధరమపురం ఆధీనం ప్రశంసించారని గుర్తు చేశారు. ఈనెల 22న పల్లకీసేవ జరుగునుందని, ఆ లోపుగా ముఖ్యమంత్రి స్టాలిన్‌ తగు నిర్ణయాన్ని ప్రకటిస్తారని తెలిపారు.


గురువుగా భావించే మోస్తున్నారు...

ఈ విషయంపై ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే సభాపక్ష నాయకుడు ఎడప్పాడి పళనిస్వామి మాట్లాడుతూ... ఐదు శతాబ్దాలకు పైగా ధరమపురం ఆధీనం పల్లకీసేవలు జరుగుతున్నాయని, ఈ సేవ చేయడం మహద్భాగ్యంగా భక్తులు భావిస్తుంటారని తెలిపారు. ఆంగ్లేయుల కాలంలోనూ, స్వాతంత్య్రం తర్వాత ఏ ప్రభుత్వం కూడా ఆధీనం పల్లకీసేవలపై నిషేధం విధించలేదన్నారు. ఎలాంటి నిర్బంధాలకు తావులేకుండా గురువులను సంతోషంగా పల్లకీలో మోసుకెళుతుంటారని, అరుదైన ఆధ్యాత్మిక కార్యక్రమంగా భావించే ఈ సేవను నిషేధించడం గర్హనీయమన్నారు. అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో మైలాడుదురైని కొత్త జిల్లాగా ప్రకటించినప్పుడు కొత్త కలెక్టరేట్‌ తదితర పాలన భవనాల కోసం 60 ఎకరాల భూములను ఉచితంగా అందజేసింది ధరమపురం ఆధీనమేనని ఎడప్పాడి తెలిపారు. ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకుని ధరమపురం ఆధీనం పల్లకీసేవను ఎప్పటిలానే సాఫీగా నిర్వహించేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.


నా భుజాలపై మోసుకెళతా: అన్నామలై

ధరమపురం ఆధీనం పల్లకీసేవపై నిషేధం అమలు చేస్తే ఆధీనంను తానే భుజాలపై మోసుకెళ్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ సందేశం పోస్టు చేస్తూ శతాబ్దాలుగా ధరమపురం ఆధీనం పట్టణ ప్రవేశ వేడుకల్లో సేవకులు ఆయనను పల్లకీలో మోసుకెళ్లడం జరుగుతోందని, హఠాత్తుగా ప్రభుత్వం పల్లకీసేవపై నిషేధం విధించడం అనాగరికమైన చర్యల అని మండిపడ్డారు. తమిళ సంస్కృతీ సంప్రదాయాలకు విరుద్ధమని విమర్శించారు. 


కేంద్రానికి చేరిన ‘నీట్‌ బిల్లు’

రాష్ట్ర విద్యార్థుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని నేషనల్‌ ఎలిజబిలిటీ కం ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌)ను రద్దు చేయాలంటూ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిన బిల్లుకు ఎట్టకేలకు కదలిక వచ్చింది. ఆ బిల్లును రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్ర హోంశాఖకు పంపించారని ముఖ్యమంత్రి స్టాలిన్‌ బుధవారం అసెంబ్లీలో ప్రకటించారు. ఈ మేరకు గవర్నర్‌ సహాయకుడు తనకు ఫోన్‌ చేసి చెప్పారని డీఎంకే ఎమ్మెల్యేల హర్షధ్వానాల మధ్య పేర్కొన్నారు. రాష్ట్రపతి ఆమోదానికి పంపే ముందు కేంద్ర హోంశాఖ పరిశీలనకు పంపించడం ఆనవాయితీ అని, అందులో భాగంగానే ఆయన ఆ బిల్లును అక్కడకు పంపించారని వివరించారు. ఇక రాష్ట్రపతి ఆమోదం కోసం ప్రయత్నించాల్సివుందని, ఆ మేరకు చర్యలు తీసుకుంటామని సీఎం పేర్కొన్నారు. నీట్‌కు వ్యతిరేకంగా డీఎంకే ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబరు 13వ తేదీన అసెంబ్లీలో తీర్మానం చేయగా, 142 రోజుల తరువాత గవర్నర్‌ దానిని వెనక్కి తిప్పి పంపించారు. దాంతో కొన్ని సవరణలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ఫిబ్రవరిలో దానిని ఆమోదించి గవర్నర్‌కు రెండోమారు పంపించింది. అంతేగాక ఆ బిల్లును రాష్ట్రపతికి పంపించాలంటూ స్వయంగా ముఖ్యమంత్రి స్టాలిన్‌ వెళ్లి గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో గవర్నర్‌ను రీకాల్‌ చేయాలంటూ డీఎంకే ఎంపీలు పార్లమెంటులో గళమెత్తారు. కాంగ్రెస్‌, డీపీఐ, వామపక్షాలు సైతం గవర్నర్‌ వ్యవహారశైలిపై మండిపడ్డాయి. కాంగ్రెస్‌ పార్టీ ఇటీవల రాజ్‌భవన్‌ ముట్టడికి సైతం ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో గవర్నర్‌ ఎట్టకేలకు ఆ బిల్లును రాష్ట్రపతి పరిశీలన కోసం కేంద్రానికి పంపడంతో రాష్ట్ర ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది.

Read more