ఏడాదిలో పదేళ్ల లక్ష్యసాధన: Cm Stalin

ABN , First Publish Date - 2022-05-14T14:04:07+05:30 IST

ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రాన్ని డీఎంకే అధికారంలోకి రాగానే గట్టెక్కించిందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పేర్కొన్నారు. కేవలం ఏడాది పాలనలో పదేళ్ల

ఏడాదిలో పదేళ్ల లక్ష్యసాధన: Cm Stalin

                   - ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించాం 


చెన్నై: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రాన్ని డీఎంకే అధికారంలోకి రాగానే గట్టెక్కించిందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పేర్కొన్నారు. కేవలం ఏడాది పాలనలో పదేళ్ల లక్ష్యాలను సాధించామని ప్రకటించారు. ఉగ్రరూపం దాల్చిన కరోనా వైరస్‌ వ్యాప్తిని సమర్థవంతంగా కట్టడి చేశామన్నారు. తిరువాన్మియూరులో శుక్రవారం ఉదయం జరిగిన తాంబరం డీఎంకే శాసనసభ్యుడు రాజా తనయుడు నెల్సన్‌ మండేలా వివాహవేడుకల్లో పాల్గొన్న సీఎం ప్రసంగించారు. తాంబరం ఎమ్మెల్యే రాజా అంటే తనకెంతో ఇష్టమని, మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో తన నియోజకవర్గం అభివృద్ధి గురించే మాట్లాడేవారని, ప్రశ్నోత్తరాల సమయంలోనూ నియోజకవర్గ సమస్యలపైనే దృష్టిసారించేవారని ప్రశంసించారు. తమను ఎన్నుకున్న నియోజకవర్గం ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేయడానికే పాటుపడే రాజాలాంటి శాసనసభ్యుల వల్లే రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందుతోందన్నారు. తాను సీఎం పదవి చేపట్టినప్పుడు కరోనా ఉగ్రరూపం దాల్చిందని, దానిని కట్టడి చేయడానికి తీవ్రంగా పాటుపడ్డానని చెప్పారు. అంతే కాకుండా ఓ వైపు ఆర్థిక సంక్షోభం, మరో వైపు కరోనా ఉగ్రరూపం దాల్చటం వంటి పరిస్థితుల్లోనూ తమకు ఓటేసిన ప్రజలకే కాకుండా ఓటు వేయనివారు కూడా మెచ్చుకునేలా సంక్షేమ పథకాల ను అమలు చేశామని వెల్లడించారు.. ఇంటి వద్దకే విద్య, వైద్యం, విద్యార్థులలో ప్రతిభాపాటవాలు పెంచేందుకు ‘నాన్‌ ముదల్వన్‌’ పథకం, రోడ్డు ప్రమాద బాధితులను 48 గంటలలో కాపాడే ‘ఇన్నుయిర్‌ కాప్పోం’ పథకం, సమత్తువపురాల ఏర్పాటు, దురాక్రమణలకు గురైన రూ.2వేల కోట్ల విలువైన భూముల స్వాధీనం వంటివెన్నో పథకాలను అమలు చేయగలిగామని చెప్పారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన హామీల్లో ముప్పావు శాతం  నెరవేర్చామని సగౌరవంగా ప్రకటిస్తున్నానని తెలిపారు. డీఎంకే పాలనను మహిళలంతా మెచ్చుకుంటున్నారని, ప్రత్యేకించి సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకానికి మంచి స్పందన లభిస్తోందని, దీని ద్వారా నెలకు రూ.600 నుంచి రూ.1200ల దాకా ఆదా చేయగలుగుతున్నామని మహిళలు తనకు స్వయంగా తెలిపారని స్టాలిన్‌ పేర్కొన్నారు.  తమ పాలనలో అన్ని వర్గాలవారికి సంక్షేమపథకాల ఫలాలు అందాలని కోరుకుంటున్నానని స్టాలిన్‌ స్పష్టం చేశారు. ఈ వివాహవేడుకల్లో మంత్రులు దురైమురుగన్‌, ఎం.సుబ్రమణ్యం, ఏవీ వేలు, గాంధీ, దామో అన్బరసన్‌, ఎంపీలు టీఆర్‌ బాలు, టీకేఎస్‌ ఇళంగోవన్‌, జగద్రక్షగన్‌, ఎ.రాజా, డీపీఐ నేత తొల్‌ తిరుమావళవన్‌, మనిదనేయ మక్కల్‌ కట్చి నాయకుడు జవహిరుల్లా తదితరులు కూడా పాల్గొన్నారు.

Read more